
సాధారణంగా పెళ్లైన కుమార్తెలకు తండ్రి, తల్లి, తాతల ఆస్తిలో వాటా ఉండదనే అభిప్రాయాలుంటాయి. ఎలాగో పెళ్లి అయిపోయింది కదా ఆమె భర్త, మామలకు చెందిన ఆస్తులపైనే తనకు హక్కులుంటాయనే వాదనలున్నాయి. కానీ హిందూ వారసత్వ చట్టం 1956ను 2005లో సవరించకముందు వరకు ఇదే తంతు ఉండేది. కానీ ఇలాంటి అంశాలపై స్పష్టత ఇచ్చేలా ఆ చట్టాన్ని సవరించారు. అయితే ఇప్పటికీ చాలామందిలో దీనికి సంబంధించి అవగాహన ఉండకపోవచ్చు. సవరణ చట్టంలోని కుమార్తె ఆస్తి హక్కుల గురించి కింద తెలియజేశాం.
2005లో ఈ చట్టం సవరణకు ముందు పూర్వీకుల ఆస్తిని వారసత్వంగా పొందే హక్కు కుమారులకు మాత్రమే ఉండేది. కుమార్తెలు కుటుంబంలో భాగమైనప్పటికీ సహ-భాగస్వాములుగా(ఆస్తిని వారసత్వంగా పొందే హక్కు ఉన్న హిందూ ఉమ్మడి కుటుంబానికి చెందిన సభ్యులు) గుర్తించబడలేదు. అయితే, హిందూ వారసత్వ (సవరణ) చట్టం 2005 వివాహిత కుమార్తెలకు కుమారులతో సమానమైన హక్కులను ఇచ్చింది. అంటే వివాహమైన కుమార్తెలకు వారి వైవాహిక స్థితితో సంబంధం లేకుండా పూర్వీకుల ఆస్తిలో సమాన వాటా ఉంటుంది. ఈ మార్పు సవరణ తర్వాత జన్మించిన ఆడపిల్లలకే కాకుండా 2005కు ముందు జన్మించిన వారికి కూడా రెట్రోస్పెక్టివ్ హక్కులను కల్పిస్తుంది.
తల్లి ఆస్తిలో వాటా ఉంటుందా?
తల్లి సొంతంగా సంపాదించిన ఆస్తిని కాస్త భిన్నంగా పరిగణిస్తారు. తల్లి అకాల మరణం చెందితే (వీలునామా లేకుండా) ఆమె ఆస్తిని చట్టబద్ధమైన వారసులకు సమానంగా పంచాలి. ఇందులో కుమారులు, కుమార్తెలు పరిస్థితిని బట్టి కొన్నిసార్లు భర్త కూడా ఉంటారు. హిందూ వారసత్వ చట్టం ప్రకారం వివాహిత కుమార్తెలను క్లాస్ 1 వారసులుగా పరిగణిస్తారు. అంటే వారు తమ తల్లి ఆస్తిని వారసత్వంగా పొందడానికి సమాన హక్కు కలిగి ఉంటారు. కుతురుకు వివాహం అయినా తల్లి ఆస్తిలో కుమారులతో సమానంగా వాటా ఉంటుంది.
అపోహలు
సాధారణంగా వివాహం తర్వాత కుమార్తెకు తమ పూర్వీకుల ఆస్తిపై హక్కు రద్దు అవుతుందని అనుకుంటారు. కుమార్తెలు తమ తండ్రులు లేదా తాతలు వారసత్వంగా పొందిన ఆస్తిలో వాటాను పొందలేరని భావిస్తారు. అయితే హిందూ వారసత్వ చట్టం 2005 సవరణ ప్రకారం దీని అమలుకు ముందు వివాహం చేసుకున్నప్పటికీ, పూర్వీకుల ఆస్తిపై కుమార్తెలకు సమాన హక్కు ఉందని స్పష్టం చేస్తుంది.
ఆస్తి వివరాల్లో స్పష్టత వచ్చిన తర్వాత దాని హక్కులను, వారసత్వాన్ని క్లెయిమ్ చేయడంలో కొన్ని దశలు ఉంటాయి. ఇందులోని న్యాయ ప్రక్రియను అర్థం చేసుకోవడం, సజావుగా క్లెయిమ్ చేయడం చాలా అవసరం.
మ్యుటేషన్ ప్రక్రియ
ఆస్తి హక్కును నిర్ధారించడంలో మొదటి దశ ఆస్తి రికార్డుల మ్యుటేషన్. కొత్త యజమానులను (కుమార్తెలతో సహా) ప్రతిబింబించేలా భూ రికార్డులను అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. మ్యుటేషన్ దరఖాస్తును స్థానిక రెవెన్యూ కార్యాలయంలో సమర్పించవచ్చు.
వారసత్వ ధ్రువీకరణ పత్రం
బ్యాంకు ఖాతాలు లేదా బీమా పాలసీలు వంటి మృతుడి ఆస్తి చరాస్తులుగా ఉన్న సందర్భాల్లో వారసత్వ ధ్రువీకరణ పత్రం అవసరం కావచ్చు. మృతుడి ఆస్తిపై వారసుల హక్కు ఉందని పేర్కొంటూ సివిల్ కోర్టులో దరఖాస్తు చేసుకోవడం ద్వారా ఈ ధ్రువీకరణ పత్రాన్ని పొందవచ్చు.
సివిల్ కోర్టు
వివాదం కేసుల్లో లేదా కుటుంబ సభ్యులు కుమార్తె వాటాను అంగీకరించడానికి నిరాకరిస్తే కేసును సివిల్ కోర్టుకు తీసుకెళ్లవచ్చు. ఆస్తిలో న్యాయమైన వాటాను పొందడానికి హిందూ వారసత్వ చట్టం నిబంధనల ప్రకారం చట్టపరమైన దావా వేయవచ్చు.
ఇదీ చదవండి: మోసపూరిత పథకాల పట్ల జాగ్రత్త: సెబీ హెచ్చరిక