
మోసపూరిత ట్రేడింగ్ పథకాల విషయంలో అప్రమత్తంగా ఉండాలంటూ ఇన్వెస్టర్లను సెబీ హెచ్చరించింది. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల ద్వారా (ఎఫ్‌పీఐలు) స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు అవకాశం కలి్పస్తామంటూ సోషల్ మీడియా సందేశాలు, మొబైల్ అప్లికేషన్లపై చేసే ప్రచారం పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఆ తరహా పథకాలు చట్టవిరుద్ధమైనవంటూ.. వీటికి సెబీ ఆమోదం లేనట్టు స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: ఏఐలో ఆధిపత్యం కోసం ఎగబడుతున్నారు!
వాట్సాప్, టెలిగ్రామ్ లేదా ఇతర యాప్‌లపై ఎఫ్‌పీఐల రూపంలో పెట్టుబడుల అవకాశాలు కల్సిస్తామన్న మోసపూరిత పథకాలకు దూరంగా ఉండాలని కోరింది. ఇనిస్టిట్యూషనల్ ట్రేడింగ్ ఖాతాలు, తక్కువ ధరలకే ఐపీవోలు, ఐపీవోల్లో కచ్చితమైన కేటాయింపులు అంటూ తప్పుదోవ పట్టించే క్లెయిమ్‌లను నమ్మొద్దని సూచించింది. భారత్‌లో నివసించే పౌరులకు ఎఫ్‌పీఐ పెట్టుబడుల మార్గం అందుబాటులో ఉండదని గుర్తు చేసింది. ఆయా సంస్థలకు రిజిస్ట్రేషన్ ఉందా? లేదా అన్నది సెబీ వెబ్‌సైట్ నుంచి తెలుసుకోవచ్చని తెలిపింది.