ఇరాన్‌లో కరెన్సీ విలువ పతనంతో మొదలైన ఆర్థిక సంక్షోభం.. పెరిగిన ధరలకు వ్యతిరేకంగా నడుస్తున్న ఆందోళనలు హింసాత్మక మలుపు తీసుకున్నాయి. భద్రతా బలగాలకు, ఆందోళనకారులకు మధ్య జరిగిన ఘర్షణల్లో హింస చెలరేగి ఇప్పటిదాకా 8 మంది మరణించారు. అయితే ఈ పరిణామాలను ఆధారంగా చేసుకుని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు వార్నింగ్ ఇవ్వగా.. ఆ దేశం కౌంటర్ వార్నింగ్ ఇచ్చింది. అదే జరిగితే ప్రతిస్పందన మరోలా ఉంటుందంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.
ఇరాన్‌లో ఖమేనీ పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న తిరుగుబాట్లు మరిన్ని నగరాలకు విస్తరించాయని కథనాలు వెలువడుతున్నాయి. పలు చోట్ల భద్రతా బలగాలకు, ఆందోళనకారులకు మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయన్నది ఆ కథనాల సారాంశం. అయితే శాంతియుతంగా నిరసనలు తెలిపేవారిపై కాల్పులు జరిపితే మేం జోక్యం చేసుకుంటామంటూ ట్రంప్ ఇరాన్‌కు వార్నింగ్ ఇచ్చారు. దీనికి ఇరాన్ ఘాటుగా స్పందించింది.
ట్రంప్ హెచ్చరికలను తిప్పి కొట్టింది ఇరాన్. తమ దేశ వ్యవహారంలో అమెరికా జోక్యం చేసుకుంటే అది ఘర్షణలకు దారి తీస్తుందని.. ఇరాన్ జాతీయ భద్రత రెడ్‌లైన్ లాంటిదని.. దానిని దాటే ప్రయత్నం చేస్తే ఎక్కడ గురిపెట్టాలో తమకు తెలుసని.. కాబట్టి అమెరికా అలా చేయకపోవడం ఉత్తమం’’ అని ఖమేనీ సలహాదారు అలీ షంఖానీ ఒక ప్రకటనలో తెలిపారు.
మరోవైపు.. ట్రంప్ బెదిరింపుల అంశాన్ని ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకెళ్లింది ఇరాన్. ఐరాసలో ఆ దేశ రాయబారి అమీర్ సయ్యద్ ఇర్వానీ ఈ మేరకు యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్, భద్రతా మండలి అధ్యక్షుడికి లేఖ రాశారు. ట్రంప్ బెదిరింపులను అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనగా పేర్కొంటూ ఖండించిన ఇర్వానీ.. అవసరమైతే తమ దేశ సార్వభౌమత్వాన్ని రక్షించుకునే హక్కుల్ని వినియోగించుకుంటామని స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే.. ఇరాన్ మరో సీనియర్ నేత అలి లారిజానీ సంచలన ఆరోపణలకు దిగారు. అమెరికా, ఇజ్రాయెల్ తమ దేశంలో నిరసనలను ప్రేరేపిస్తున్నాయని అన్నారు. ఇరాన్‌లో విదేశీ జోక్యం జరిగితే ప్రాంతీయ అస్థిరత పెరుగుతుందని సొంత ప్రజలను ఉద్దేశించి హెచ్చరించారాయన.
ఇరాన్‌లో నిరసనలు ఏడో రోజుకి చేరాయి. 2022లో మోరల్ పోలీసింగ్ ఘటనతో మరణించిన మహ్సా అమినికి సంఘీభావంగా మహిళా లోకం పెద్ద ఎత్తున ఉద్యమించింది. మళ్లీ ఇన్నాళ్లకు ఇరాన్‌లో ఆ స్థాయిలో నిరసనలు జరుగుతున్నాయి.


