భర్తను చంపిన భార్య | Wife Cheats On Husband | Sakshi
Sakshi News home page

భర్తను చంపిన భార్య

Aug 24 2025 5:20 AM | Updated on Aug 24 2025 5:20 AM

Wife Cheats On Husband

అజీజ్‌నగర్‌లో మరో వ్యక్తితో కలిసి ఘాతుకం 

ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసి పరారు

మొయినాబాద్‌: డెయిరీ ఫామ్‌లో పనిచేస్తున్న ఓ మహిళ మరో వ్యక్తితో కలిసి భర్తను హత్య చేసింది. శవాన్ని బావి పక్కన పడేసి, సెల్‌ఫోన్‌ స్విచ్ఛాప్‌ చేసి పరారైంది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలోని అజీజ్‌నగర్‌లో శనివారం రాత్రి వెలుగు చూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. అజీజ్‌నగర్‌కు చెందిన సామ రాజిరెడ్డి రెండు నెలల క్రితం డెయిరీ ఫామ్‌ ప్రారంభించారు. ఇక్కడ పనిచేసేందుకు ఓ జంట కావాలని బిహార్‌కు చెందిన పవన్‌ను సంప్రదించాడు. అతని ద్వారా నెల క్రితం రాజేశ్‌కుమార్, పూనందేవి దంపతులను పనికి కుదుర్చుకున్నాడు.

గత గురువారం రాజిరెడ్డి డెయిరీ ఫామ్‌కు వెళ్లగా రాజేశ్‌కుమార్‌ దంపతులతోపాటు మరో వ్యక్తి కనిపించాడు. అతను తమ బంధువని చెప్పడంతో సరేనని ఊరుకున్నాడు. శుక్రవారం ఫామ్‌కు వెళ్లిన యజమానికి రాజేశ్‌ కనిపించలేదు. ఎక్కడికి వెళ్లాడని పూనందేవిని అడగగా మద్యం తాగివచ్చి, తనతో గొడవ పడి ఎక్కడికో వెళ్లాడని చెప్పింది. సాయంత్రం ఫామ్‌ వద్దకు వెళ్లిన రాజిరెడ్డికి పనివాళ్లెవరూ కనిపించలేదు.

ఫోన్‌ చేయగా స్విచ్ఛాఫ్‌ వచ్చింది. దీంతో శనివారం ఏజెంట్‌కు ఫోన్‌ చేసి విషయం చెప్పాడు. కొద్దిసేపటి తర్వాత తిరిగి ఫోన్‌ చేసిన పవన్‌.. పూనందేవి, మహేశ్‌సాని అలియాస్‌ గుడ్డు అనే వ్యక్తి కలిసి రాజేశ్‌ను చంపి, బావి వద్ద పడేశారని చెప్పాడు. రాజిరెడ్డి వెళ్లి చూడగా రాజేశ్‌కుమార్‌ మృతదేహం కనిపించింది. రాయితో తలపై కొట్టి చంపినట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement