
కొత్తతరహా కృత్రిమమేధ కంపెనీని ప్రకటించిన ఎలాన్ మస్క్
మైక్రోసాఫ్ట్ కథ కంచికేనని పరోక్ష వ్యాఖ్యలు
ఏఐ సాఫ్ట్‌వేర్‌తో నేరుగా అనుసంధానం కావొచ్చన్న మస్క్
పెద్ద సంఖ్యలో సిబ్బందికి ప్రత్యామ్నాయంగా పనిచేస్తుందని వెల్లడి
వాషింగ్టన్: సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ రంగంలో ప్రపంచ అగ్రగామిగా కొనసాగుతున్న మైక్రోసాఫ్ట్‌ను తలదన్నేలా అధునాతన కృత్రిమమేధ సంస్థ ‘మాక్రోహార్డ్’ను ప్రారంభిస్తున్నట్లు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ప్రకటించారు. మైక్రోసాఫ్ట్ పేరులోని మైక్రో, సాఫ్ట్ పదాలకు పూర్తి విరుద్ధమైన మాక్రో, హార్డ్ పదాలతో మస్క్ తన కొత్త కంపెనీకి పేరు పెట్టడం గమనార్హం. మైక్రోసాఫ్ట్ కంటే తన సంస్థ అద్భుతంగా ఎదగబోతోందని అర్థంవచ్చేలా గతంలోనే మస్క్ Macrohard >> Microsoft అని ‘ఎక్స్’ లో పోస్ట్‌చేసిన విషయం తెల్సిందే.
ఎక్స్‌ఏఐ సంస్థ సారథ్యంలో ఇకపై మాక్రోహార్డ్ సంస్థ పనిమొదలు పెడుతుందని మస్క్ శనివారం ప్రకటించారు. ‘‘ఇకపై సాఫ్ట్‌వేర్ కంపెనీలు ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ తదితరాల కోసం విడిగా హార్డ్‌వేర్‌లను కర్మాగారాల్లో తయారు చేయాల్సిన పనిలేదు. ఇకపై అంతా ఆన్‌లైన్‌లోనే కృత్రిమమేధతో పని జరిగిపో తుంది. సాఫ్ట్‌వేర్ అనేవి అంతా ఆన్‌లైన్‌లోనే ఇన్‌స్టాల్ అవుతాయి.
ఈ లెక్కన ఒకరకంగా మైక్రోసాఫ్ట్ వంటి సంస్థల్లో సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్, డివైస్‌లు, ఉపకరణాల విభాగ వ్యాపారం మూలకు పడినట్లే. యావత్ సాఫ్ట్‌వేర్ రంగాన్ని ఏఐతో భర్తీచేస్తా. హ్యూమన్ స్పీచ్, టెక్స్ట్ సహా పరస్పర సమాచార బదిలీని సాధ్యంచేసే చాట్‌బాట్ వంటివన్నీ ఇకపై నేరుగా సాఫ్ట్‌వేర్‌తోనే జరిగేలా చేస్తా. ఇది వేలాది మంది శ్రామికులు చేసే పనిలో సమానం. భారీ సంఖ్యలో సాఫ్ట్‌వేర్ శ్రామికశక్తిని మా ఏఐ క్లోన్ భర్తీచేస్తుంది. మాక్రోహార్డ్ అనేది పూర్తిగా ఏఐ సాఫ్ట్‌వేర్ కంపెనీ’’అని మస్క్ చెప్పుకొచ్చారు.
ఒకేసారి సమాంతర వ్యవస్థ
‘‘ఇకపై వేలాదిగా స్పెషలైజ్డ్ కోడింగ్, ఇమేజ్, వీడియోలను సృష్టించే, అర్థంచేసుకునే కంప్యూటర్ పోగ్రామ్‌లను అభివృద్ధిచెందించాల్సి ఉంది. ఇవన్నీ ఒకేసారి సమాంతరంగా పనిచేస్తాయి. దీంతో యూజర్లు తమకు కావాల్సిన ఏదైనా సమాచారం, అంశంపై నేరుగా సాఫ్ట్‌వేర్‌తోనే మాట్లాడొచ్చు, సంప్రతించవచ్చు. వర్చువల్ మెషీన్లే సాధారణ యూజర్లు అడిగే ఎలాంటి సమాచారాన్ని అయినా క్షణాల్లో ఇస్తాయి. ఇదంతా ఊహించనంత స్థాయిలో జరగబోతోంది. దీనిని ఏఐ ఆధారిత సాఫ్ట్‌వేర్ కర్మాగారంగా చెప్పొచ్చు’’అని మస్క్ చెప్పారు.
మస్క్‌కు చెందిన ఎక్స్‌ఏఐ సంస్థ ఆగస్ట్ ఒకటో తేదీన అమెరికా పేటెంట్ ఆఫీస్‌లో ‘మాక్రోహార్డ్’పేరిట పేటెంట్ కోసం దరఖాస్తు చేసింది. గతంలోనే మస్క్ ఏఐ ఆధారిత వీడియోగేమ్స్ రంగంలో అడుగుపెట్టాలని భావించారు. ఇప్పుడు కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలన్నట్లు దశాబ్దాలుగా సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ ఉత్పత్తుల రంగంలో అగ్రగామిగా ఉన్న మైక్రోసాఫ్ట్ ఏకఛత్రాధిపత్యాన్ని కూలదోసేందుకు కొత్త తరహాలో ఏఐ సాఫ్ట్‌వేర్ తయారీకి మస్క్ నడుంబిగించారు.
అయితే ప్రతి కంప్యూటర్‌లో కనిపించే మైక్రోసాఫ్ట్ వర్డ్, ఎక్సెల్, పవర్‌పాయింట్ వంటి సాఫ్ట్‌వేర్‌లకు దీటుగా అంతకుమించిన సౌకర్యాలుండే అన్ని రకాల సాఫ్ట్‌వేర్ సేవలను అందించడం మస్క్‌కు కత్తిమీద సాము చేయడంతో సమానమని సాఫ్ట్‌వేర్ రంగ నిపుణులు చెబుతున్నారు.
దిగ్గజ ఎన్‌విడియా నుంచి తెప్పించిన లక్షలాది గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్(జీపీయూ)లతో అమెరికాలోని మెంఫిస్‌లో మస్క్ ఇప్పటికే భారీ కేంద్రాలను ఏర్పాటుచేసి కొలోసస్ సూపర్‌కంప్యూటర్‌లతో పని మొదలెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇదే తరహాలో ఏఐ కంప్యూటింగ్ సామర్థ్యాన్ని సంతరించుకునేందుకు సిద్ధమైన ఓపెన్‌ఏఐ, మెటా వంటి పెద్ద సంస్థలతో మస్క్ సంస్థ పోటీపడాల్సి ఉంది.