
భారత మహిళల ‘ఎ’ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 260/8
ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్ 305 ఆలౌట్
బ్రిస్బేన్: తొలి ఇన్నింగ్స్‌లో చక్కటి ప్రదర్శన కనబర్చిన రాఘ్వి బిస్త్ (119 బంతుల్లో 86; 13 ఫోర్లు) రెండో ఇన్నింగ్స్‌లోనూ రాణించడంతో ఆ్రస్టేలియా మహిళల ‘ఎ’ జట్టుతో ఏకైక అనధికారిక టెస్టులో భారత మహిళల ‘ఎ’ జట్టు మెరుగైన స్థితిలో నిలిచింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి రాధా యాదవ్ సారథ్యంలోని భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 73 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది.
రాఘ్వి బిస్త్, షఫాలీ వర్మ (58 బంతుల్లో 52; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ శతకాలు సాధించగా... తేజల్ హస్నబిస్ (52 బంతుల్లో 39; 7 ఫోర్లు) రాణించింది. ఆస్ట్రేలియా మహిళల ‘ఎ’ జట్టు బౌలర్లలో అమీ ఎడ్గర్ 4 వికెట్లు పడగొట్టగా... జార్జియా 2 వికెట్లు తీసింది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 158/5తో శనివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆ్రస్టేలియా మహిళల ‘ఎ’ జట్టు... చివరకు 76.2 ఓవర్లలో 305 పరుగులకు ఆలౌటైంది.
సియానా జింజర్ (138 బంతుల్లో 103; 12 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో కదం తొక్కగా... నికోల్ ఫాల్టుమ్ (91 బంతుల్లో 54; 6 ఫోర్లు) అర్ధ శతకంతో ఆకట్టుకుంది. భారత మహిళల ‘ఎ’ జట్టు బౌలర్లలో సైమా ఠాకూర్ 3 వికెట్లు పడగొట్టగా... రాధా యాదవ్, మిన్ను మణి చెరో రెండు వికెట్లు తీశారు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 299 పరుగులు చేసింది. ప్రస్తుతం చేతిలో రెండు వికెట్లు ఉన్న భారత జట్టు... ఓవరాల్‌గా 254 పరుగుల ఆధిక్యంలో ఉంది. జోషిత (9 బ్యాటింగ్), టిటాస్ సాధు (2 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.