అంధుల మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్‌గా తొలి టీ 20 వరల్డ్ కప్‌ను అందుకున్న దీపిక
ఆదివారం నేపాల్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో భారత్ విజయం
క్రికెట్‌లో భారత అమ్మాయిలు అదరగొడుతున్నారు. హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలో వన్డే ప్రపంచకప్ గెలిచి నెల తిరగకముందే ఉమ్మడి జిల్లాకు చెందిన దీపిక నేతృత్వంలో మరో ప్రపంచకప్ మన సొంతమైంది. అది కూడా అంధ మహిళల టీ20 విభాగంలో మొట్టమొదటి ప్రపంచకప్ కావడం గమనార్హం.
ప్రస్తుతం దేశంలోని అందరి దృష్టి టీసీ దీపికపై పడింది. ఎవరీ దీపిక? ఏ ప్రాంతానికి చెందిన వారనేది హాట్‌టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో దీపిక గురించి తెలుసుకోవాలంటే శ్రీసత్యసాయి జిల్లా అమరాపురం మండలం హేమావతి పంచాయతీ తంబాలహట్టి గ్రామానికి చేరుకోవాల్సిందే.
నిరుపేద కుటుంబానికి చెందిన దీపిక తల్లిదండ్రులు చిత్తమ్మ, చిక్కతిమ్మప్ప వ్యవసాయ కూలి పనులతో జీవనం సాగిస్తున్నారు. దీపిక ఐదు నెలల ప్రాయంలో ఉన్న సమయంలో చేతి వేలు గోరు తగిలి ఒక కంటి చూపు పోయింది. కొన్నాళ్లు తల్లిదండ్రులు బాధపడినా.. ఆ తర్వాత పాపకు మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసం ఎంత కష్టమైనా తామే పడాలని నిర్ణయించుకున్నారు.
కన్నడ మాధ్యమంలోనే విద్యాభ్యాసం
దీపిక స్వగ్రామం కర్ణాటక సరిహద్దున ఉండడంతో కర్ణాటకలోని తుమకూరు జిల్లా దొడ్డ బాణగెరలోని సర్కారీ ప్రౌఢశాలలో 1 నుంచి 4వ తరగతి వరకూ చదువుకుంది. కంటి చూపు సక్రమంగా లేకపోవడంతో స్థానిక ఉపాధ్యాయుల సహకారంతో 2012 –13లో తుమకూరు జిల్లా కుణిగల్‌లోని అంధుల పాఠశాలలో 5 నుంచి 7వ తరగతి వరకూ చదువుకుంది.
అనంతరం మైసూరులోని రంగారావు మెమోరియల్ స్కూల్ ఫర్ డిసేబుల్డ్‌లో చేరి 8 నుంచి 10వ తరగతి వరకు, ఆ తరువాత శిర తాలుకా బరగూరులోని జ్ఞాన జ్యోతిలో పీయూసీ (ఇంటర్) పూర్తి చేసింది. అనంతరం బెంగళూరులోని విజయనగర ఫస్ట్‌గ్రేడ్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసింది.
టీ–20 ప్రపంచకప్‌లో అజేయంగా...
శ్రీలంక రాజధాని కొలంబో వేదికగా ఈ ఏడాది నవంబర్‌లో అంధ మహిళల క్రికెట్ టీ–20 ప్రపంచ కప్ టోర్నీ జరిగింది. ఈ పోటీల్లో ప్రాతినిథ్యం వహించిన భారత జట్టుకు దీపికనే కెప్టెన్‌గా వ్యవహరించి, అన్ని మ్యాచ్‌ల్లోనూ జట్టును విజయతీరాలకు చేరేలా సభ్యులను దిశానిర్దేశనం చేస్తూ జట్టును ఫైనల్స్‌కు చేర్చింది.
ఈ నెల 23న జరిగిన ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టుతో తలపడిన నేపాల్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు నిర్ణీత 12.1 ఓవర్లలోనే 117 పరుగులు సాధించి విజయకేతనం ఎగురవేసింది.
క్రీడలో రాణించింది ఇలా..
2016లో మైసూరులో 8వ తరగతి చదువుతుండగా పాఠశాల స్థాయిలో క్రికెట్ పోటీ నిర్వహించారు. ఇందులో ఏకంగా 100 పరుగులు చేసిన దీపికలోని క్రీడాప్రతిభను ఉపాధ్యాయులు గుర్తించి, ఆ దిశగా ఆమెను ప్రోత్సహిస్తూ వచ్చారు. అదే ఏడాది బెంగళూరు వర్సెస్ మైసూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో దీపిక 3 వికెట్లు తీయడంతో పాటు 78 పరుగులు చేసింది. ఇదే ఆమెలోని ఆత్మవిశ్వాసం పెంపొందేందుకు తొలి మెట్టుగా మారింది. ఇంటి ఆర్థిక పరిస్థితి సక్రమంగా లేకపోవడానికి తోడు సరైన ఆర్థిక ప్రోత్సాహం లేక కొన్ని రోజుల పాటు జిల్లా స్థాయి క్రికెట్‌కే పరిమితమైంది.
పీయూసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న సమయంలో బెంగళూరులోని ఐడీఎల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన టోర్నీలో పాల్గొన్న దీపిక ఏకంగా మరో సెంచరీతో బెంగళూరులోని సమర్థనం సంస్థ దృష్టిని ఆకర్షించింది. సంస్థ నిర్వాహకులు వెంటనే దీపిక తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో మాట్లాడి క్రికెట్‌లో ఉన్నతశ్రేణి శిక్షణ ఇప్పించేందుకు అయ్యే ఖర్చు భరించారు. అప్పటి నుంచి దీపిక వెనుతిరిగి చూడలేదు. వరుస మ్యాచ్‌ల్లో రాణిస్తూ భారత మహిళల అంధుల క్రికెట్ జట్టు కెప్టెన్ స్థాయికి ఎదిగింది.
కలెక్టర్ కావాలని ఉంది..
నా ప్రతి విజయం వెనుక అమ్మ, నాన్న ప్రోత్సాహం మరువలేను. చిన్నప్పటి నుంచి కలెక్టర్ కావాలని నా ఆశ. అయితే పేదరికం కారణంగా యూపీఎస్సీకి సిద్ధం కాలేకపోతున్నా. ప్రభుత్వం కానీ, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కానీ సహకరిస్తే ఈ కలను సాకారం చేసుకుని ప్రజలకు విశిష్ట సేవలు అందిస్తా.
– టీసీ దీపిక, తంబాలహట్టి, అమరాపురం మండలం
విశ్వ విజేతగా నిలిచిన క్షణంలో జాతీయ పతాకంతో మైదానంలో పరుగు తీస్తున్న దీపిక బృందం
దీపిక తల్లిదండ్రులు చిత్తమ్మ, చిక్కతిమ్మప్ప (ఫైల్)
కలెక్టర్ కావాలని ఉంది.. టీసీ దీపిక


