
ఆరు నెలల్లోనే 15 లక్షలు తగ్గిన ఇమ్మిగ్రెంట్లు
5.33 కోట్ల నుంచి 5.19 కోట్లకు పడిపోయిన వలసదార్లు
‘ప్యూ రీసెర్చ్ సెంటర్’ నివేదికలో వెల్లడి
అమెరికా ఆర్థిక వ్యవస్థకు నష్టమే అంటున్న నిపుణులు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత వలసదార్లకు కష్టాలు మొదలయ్యాయి. ట్రంప్ సర్కార్ విధానాలతో విదేశీయులు బిక్కుబిక్కుమంటూ రోజులు లెక్కబెట్టుకొనే పరిస్థితి వచ్చింది. ఎవరిని ఎప్పుడు వెళ్లగొడతారో తెలియడంలేదు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే ‘సామూహిక తరలింపులకు’ తెరలేపారు. వేలాది మందిని బలవంతంగా స్వదేశాలకు పంపించారు. కాళ్లకు చేతులకు సంకెళ్లు వేసి మరీ విమానాల్లో తరలించారు. చట్టాలను ఉల్లంఘించారంటూ అభియోగాలు మోపి విదేశీయులను అరెస్టు చేస్తున్నారు.
అమెరికాలోకి ప్రవేశంపై కొత్తకొత్త ఆంక్షలు విధిస్తున్నారు. వీసాలు రద్దు చేస్తున్నారు. ఈ పరిణామాలన్నీ వలసదార్లను బెంబేలెత్తిస్తున్నాయి. చాలామంది అమెరికాను వీడుతున్నారు. అమెరికాలో ఈ ఏడాది జనవరి నుంచి జూన్ దాకా.. కేవలం ఆరు నెలల్లో వలసదార్ల సంఖ్య ఏకంగా 15 లక్షలు తగ్గినట్లు ‘ప్యూ రీసెర్చ్ సెంటర్’ తాజాగా ఒక నివేదికలో వెల్లడించింది. అగ్రరాజ్యంలో 1960వ దశకం తర్వాత ఇమ్మిగ్రెంట్స్ సంఖ్య ఈ స్థాయిలో తగ్గి పోవడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఈ ఏడాది అరంభంలో దేశంలో మొత్తం వలసదార్లు 5.33 కోట్ల మంది ఉండగా, ప్రస్తుతం 5.19 కోట్లకు పడిపోయింది.
→ వలసదార్లు వెనక్కి వెళ్లిపోతుండడం వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకు భారీగా నష్టం వాటిల్లుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
→ ఆరు నెలల్లో తగ్గిపోయిన ఇమ్మిగ్రెంట్లలో 7.50 లక్షల మంది కార్మికులే ఉంటారని అంచనా. కార్మికులు వెళ్లిపోతే లేబర్ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం పడుతుందని చెబుతున్నారు.
→ అమెరికాలో జనాభాలో ‘పనిచేసే సామర్థ్యం కలిగిన’ వారి సంఖ్య పెరగడం లేదు. వర్కింగ్–ఏజ్ పీపుల్ సరిపడా లేకపోతే వలసదార్లపై ఆధారపడాల్సిందే.
→ కొత్త వలసదార్లు రాకపోగా, ఉన్నవారే స్వదేశాలకు, ఇతర దేశాలకు వెళ్లిపోతుండడంతో ఆర్థిక వ్యవస్థ దిగజారుతుందని నిపుణులు తేల్చిచెబుతున్నారు. ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు.
→ నిజానికి వలసదార్లపై కఠిన ఆంక్షలు 2024లో జో బైడెన్ ప్రభుత్వ హయాంలోనే మొదల య్యాయి. విదేశీయుల రాకను సరిహద్దుల్లో కట్టడిచేశారు. ట్రంప్ వచ్చాక ఆంక్షల మరింత తీవ్రమయ్యాయి. విదేశీయులను బయటకు వెళ్లగొట్టడమే ఏకైక లక్ష్యం అన్నట్లుగా ట్రంప్ ప్రభుత్వం పనిచేస్తోంది. ఇలాంటి పరిస్థితి గత 70 ఏళ్లలో ఎప్పుడూ లేదు.
→ అమెరికాలో చట్టబద్ధమైన వలసదార్లే కాకుండా అక్రమ వలసదార్ల సంఖ్య కూడా వేగంగా తగ్గిపోతోంది.
→ ప్రపంచవ్యాప్తంగా చూస్తే వలసదార్లు అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో అగ్రస్థానం ఇప్పటికీ అమెరికాదే. ఈ ఏడాది జనవరిలో దేశ జనాభాలో వలసదార్ల వాటా 15.8 శాతం కాగా, జూన్ నాటికి 15.4 శాతానికి పడిపోయినట్లు గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి.
→ అమెరికాలోని టెక్సాస్, కాలిఫోర్నియా రాష్ట్రాల్లోనే అత్యధికంగా ఇమ్మిగ్రెంట్లు ఉన్నారు.