కొండ చరియలు విరిగిపడి 17 మంది మృతి, ఆరుగురి గల్లంతు
మెడాన్: ఇండోనేషియాలోని సుమత్రా ప్రావిన్స్‌లో ఆకస్మిక వరదలు, కొండ చరియలు విరిగి పడటంతో 17 మంది మరణించారు. ఆరుగురు గల్లంతయ్యారు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రధాన వంతెనలు ధ్వంసమయ్యాయి. పలు జిల్లాల్లో వేలాది ఇళ్లు ప్రభావితమయ్యాయి. బురద, శిథిలాల కారణంగా ప్రధాన రహదారులు మూసుకుపోయాయి.
ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీస్తుండగా, పైకప్పుల నుంచి నీరు ప్రవహిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నా3యి. కొండ చరియలు విరిగిçపడి, బురద, రాళ్లు పేరుకుపోవడంతోపాటు చెట్లు కూలిపోవడంతో సహాయకచర్యలకు ఆటంకం కలుగుతోంది. బుధవారం నాటికి సిబోల్గానగరంలో ఐదు మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికి తీసింది. గాయపడిన మరో ముగ్గురిని కాపాడింది. గల్లంతైన మరో నలుగురి కోసం అన్వేషణ కొనసాగుతోంది. పక్కనే ఉన్న తపనులి జిల్లాలో కొండ చరియలు విరిగిపడటంతో ఒక కుటుంబంలోని నలుగురు మరణించారు.
వరదల దాటికి 2వేల ఇళ్లు ప్రభావితమయ్యాయి. ఇదే జిల్లాలో మరో ఎనిమిది మంది మృతదేహాలను వెలికి తీశారు. 2,800 మందికి పైగా పునరావాస కేంద్రాలకు తరలించారు. తాత్కాలిక పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని, అధిక ప్రమాద మండలాల్లో ఉన్న ప్రజలు వెంటనే ఖాళీ చేయాలని సిబోల్గా పోలీస్ చీఫ్ సూచించారు. మరిన్ని కొండ చరియలు విరిగిపడే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.
అంతకుముందు భారీ వర్షాల కారణంగా ఇండోనేషియాలోని మరో ద్వీపం జావాలోనూ పది రోజులపాటు సహాయక చర్యలు కొనసాగాయి. కొండచరియలు విరిగిపడి 38 మంది మరణించారు. వారిలో 13 మంది ఆచూకీ తెలియలేదు. ఇది కొనసాగుతుండగానే మంగళవారం సిబోల్గా, తపనులితోపాటు పలు జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. అక్టోబర్ నుంచి మార్చి వరకు కురిసే భారీ వర్షాల వల్ల ఇండోనేషియాలో వరదలు, కొండ చరియలు విరిగిపడటం జరుఉగతుంది. ఇది 17వేల ద్వీపసమూహం. ఇక్కడ లక్షలాది మంది ప్రజలు పర్వత ప్రాంతాల్లో నివసిస్తుంటారు.


