అంతర్జాతీయ టీ20ల్లో సరికొత్త చరిత్ర సృష్టించబడింది. ఓ బౌలర్ ఒకే ఓవర్‌లో హ్యాట్రిక్ సహా ఐదు వికెట్లు తీశాడు. అంతర్జాతీయ టీ20ల చరిత్రలో ఇలాంటి ఫీట్ నమోదు కావడం ఇదే తొలిసారి. గతంలో గరిష్టంగా ఓ ఓవర్‌లో నాలుగు వికెట్ల ఫీట్ నమోదైంది. శ్రీలంక మాజీ పేసర్ లసిత్ మలింగ 2019లో న్యూజిలాండ్‌పై నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీశాడు.
ఓవరాల్‌గా (అంతర్జాతీయం, దేశవాలీ, ప్రైవేట్ టీ20 లీగ్‌లు) చూస్తే.. ఓ ఓవర్‌లో ఐదు వికెట్ల ఘనత ఇదివరకే రెండు సార్లు నమోదైంది. దేశవాలీ టీ20 మ్యాచ్‌ల్లో బంగ్లాదేశ్‌కు చెందిన అల్-అమిన్ హొసైన్, కర్ణాటకకు చెందిన అభిమన్యు మిథున్ ఈ ఘనత సాధించారు.
చరిత్ర సృష్టించిన గెడే ప్రియందనా
అంతర్జాతీయ టీ20ల్లో ఒకే ఓవర్‌లో, అందులోనూ తన తొలి ఓవర్‌లోనే ఐదు వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా (పురుషులు లేదా మహిళలు) ఇండొనేషియాకు చెందిన గెడే ప్రియందనా చరిత్ర సృష్టించాడు. బాలి వేదికగా కాంబోడియాతో జరిగిన మ్యాచ్‌లో ప్రియందనా ఈ చారిత్రక ఘనత సాధించాడు.
ఇండోనేషియా నిర్దేశించిన 168 పరుగుల లక్ష్యాన్ని కాంబోడియా చేధించే క్రమంలో ఈ ఫీట్ నమోదైంది. కాంబోడియా స్కోర్ 15 ఓవర్లలో 106/5 వద్ద ఉండగా.. మీడియం పేసర్ అయిన ప్రియందనా ఒక్కసారిగా చెలరేగిపోయాడు. 16వ ఓవర్ తొలి మూడు బంతుల్లో వరుసగా షా అబ్రార్ హుస్సేన్, నర్మల్జిత్ సింగ్, చాంతోయున్ రథనక్‌లను ఔట్ చేసి హ్యాట్రిక్ సాధించాడు.
ఆతర్వాత నాలుగో బంతికి పరుగులేమీ రాకపోగా.. ఐదు, ఆరు బంతుల్లో మాంగ్దారా సోక్, పెల్ వెన్నక్‌లను ఔట్ చేసి ఐదు వికెట్లు పూర్తి చేశాడు. ఈ ఓవర్‌లో ఒక్క రన్ (వైడ్) మాత్రమే వచ్చింది. ప్రియందనా ఉన్నపళంగా కాంబోడియా ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చడంతో ఇండోనేషియా 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అంతకుముందు ధర్మ కేసుమా విధ్వంసకర శతకంతో (68 బంతుల్లో 110 నాటౌట్) చెలరేగడంతో ఇండోనేషియా నిర్ణీత 20 ఓవర్లలో 167 పరుగులు చేసింది.


