32 పరుగులతో గుజరాత్‌పై గెలుపు
రాణించిన రాధ, రిచా శ్రేయాంకకు 5 వికెట్లు
నవీ ముంబై: మాజీ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) వరుసగా ఆడిన మూడు మ్యాచ్‌లు గెలిచి ‘హ్యాట్రిక్’ సాధించింది. మహిళల ప్రీమియర్ లీగ్‌లో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 32 పరుగుల తేడాతో గుజరాత్ జెయింట్స్‌పై నెగ్గింది. మొదట బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 182 పరుగులు చేసింది.
రాధా యాదవ్ (47 బంతుల్లో 66; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), రిచా ఘోష్ (28 బంతుల్లో 44; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరిపించారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన గుజరాత్ 18.5 ఓవర్లలో 150 పరుగులకు ఆలౌటైంది. భారతి (20 బంతుల్లో 39; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించింది. శ్రేయాంక పాటిల్ (5/23) ఐదు వికెట్లు తీయడం విశేషం. లీగ్‌లో నేడు ముంబైతో యూపీ తలపడనుంది.
43 పరుగులకే 4 వికెట్లు!
ఆరంభంలో గుజరాత్ కట్టుదిట్టమైన బౌలింగ్, చురుకైన ఫీల్డింగ్‌తో బెంగళూరును కష్టాల్లోకి నెట్టింది. గ్రేస్ హారిస్ (17), హేమలత (4)లను వరుస ఓవర్లలో కాశ్వీ గౌతమ్ అవుట్ చేసింది. తర్వాత స్మృతి మంధాన (5)ను రేణుక, గౌతమి (9)ని సోఫీ డివైన్ పెవిలియన్ చేర్చడంతో 5.3 ఓవర్లలో 43 పరుగులకే టాప్–4 వికెట్లను కోల్పోయింది. ‘పవర్ ప్లే’లోనే పనైపోయిన బెంగళూరుకు బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుగా వచ్చిన రాధా కొత్త ఊపిరి పోసింది.
రిచా ఘోష్‌తో కలిసి సులువుగా పరుగులు చక్కబెట్టింది. రిచా తన సహజశైలిలో చెలరేగగా, రాధ కూడా బౌండరీలు బాదింది. దీంతో 50 స్కోరుకు ముందే 4 వికెట్లను కోల్పోయిన బెంగళూరు మరో వికెట్ కోల్పోకుండానే 12.3 ఓవర్లలో వంద దాటేసింది. రాధ 36 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకుంది. చివర్లో నదైన్ డిక్లెర్క్ (12 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపులతో జట్టు భారీ స్కోరు చేసింది.
ధాటిగా మొదలై...
జెయింట్స్ లక్ష్యఛేదన ధాటిగా మొదలైంది. ఫోర్లు, భారీ సిక్సర్‌తో విరుచుకుపడిన బెత్ మూనీ (14 బంతుల్లో 27; 4 ఫోర్లు, 1 సిక్స్) వేగంగా పరుగులు చేసింది. అయితే ఆ తర్వాత సోఫీ (8), కెప్టెన్ గార్డ్‌నర్ (3), కనిక (16), జార్జియా వేర్‌హమ్ (13) వరుసగా విఫలం కావడంతో 70/5 స్కోరు వద్ద జట్టు ఓటమి దిశగా పయనించింది. భారతి, తనూజ (21) చేసిన పరుగులతో ఓటమి అంతరం మాత్రమే తగ్గింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో యూపీ వారియర్స్ 7 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌పై గెలిచింది.
స్కోరు వివరాలు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: గ్రేస్ (ఎల్బీ) (బి) కాశ్వీ 17; స్మృతి (సి) రాజేశ్వరి (బి) రేణుక 5; హేమలత (సి) శివాని (బి) కాశ్వీ 4; గౌతమి (ఎల్బీ) (బి) డివైన్ 9; రాధ (సి) వేర్‌హమ్ (బి) డివైన్ 66; రిచా (సి) గార్డ్‌నర్ (బి) వేర్‌హమ్ 44; డిక్లెర్క్ (సి) రాజేశ్వరి (బి) డివైన్ 26; అరుంధతి (నాటౌట్) 2; శ్రేయాంక (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 182.
వికెట్ల పతనం: 1–26, 2–33, 3–39, 4–43, 5–148, 6–179, 7–180.
బౌలింగ్: రేణుక 4–0–41–1, కాశ్వీ 4–0–42–2, గార్డ్‌నర్ 4–0–32–0, డివైన్ 4–0–31–3, వేర్‌హమ్ 4–0–35–1.
గుజరాత్ జెయింట్స్ ఇన్నింగ్స్: మూనీ (ఎల్బీ) (బి) శ్రేయాంక 27; డివైన్ (సి) అండ్ (బి) అరుంధతి 8; కనిక (ఎల్బీ) (బి) శ్రేయాంక 16; గార్డ్‌నర్ (సి) రిచా (బి) బెల్ 3; వేర్‌హమ్ (సి) రాధ (బి) డిక్లెర్క్ 13; భారతి (సి) గ్రేస్ (బి) బెల్ 39; కాశ్వీ (సి) గ్రేస్ (బి) శ్రేయాంక 18; తనూజ (సి) స్మృతి (బి) శ్రేయాంక 21; శివాని (సి) అరుంధతి (బి) బెల్ 0; రాజేశ్వరి నాటౌట్ 0; రేణుక (సి) అరుంధతి (బి) శ్రేయాంక 2; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (18.5 ఓవర్లలో ఆలౌట్) 150.
వికెట్ల పతనం: 1–34, 2–38, 3–46, 4–63, 5–70, 6–126, 7–139, 8–139, 9–148, 10–150.
బౌలింగ్: లారెన్ బెల్ 4–0–29–3, లిన్సీ స్మిత్ 2–0–27–0, అరుంధతి 4–0–31–1, శ్రేయాంక 3.5–0– 23–5, డిక్లెర్క్ 3–0–30–1, రాధ 2–0–9–0.


