అంగారకుడు. పూర్తిగా రాళ్లమయం. ఎటు చూసినా పర్వతాలే. అయితే ఆ గ్రహంపైనా ఒకప్పుడు జీవం ఉండేదని సైంటిస్టులు గతంలోనే నిర్ధారించారు. అయితే వందల కోట్ల ఏళ్ల క్రితమే అది నామరూపాల్లేకుండా పోయిందన్నది వాళ్లు ఇప్పటిదాకా చెబుతూ వచ్చిన మాట. అది నిజం కాదని, ఆ తర్వాత కూడా అంగారకునిపై జీవజాలం మనుగడ చాలాకాలం పాటు కొనసాగిందని తాజా పరిశోధన ఒకటి బల్లగుద్ది మరీ చెబుతోంది. ఇంకా చెప్పాల్సి వస్తే, అంగారకుని లోలోపలి పొరల్లో బహుశా ఇప్పుడు కూడా సూక్ష్మజీవజాలం ఉనికి బయటపడ్డా ఆశ్చర్యం లేదన్నది దాని సారాంశం!
దిబ్బలే రాళ్లయిన వేళ...
అత్యంత ఆసక్తికరంగా ఉన్న ఈ పరిశోధనకు న్యూయార్క్ యూనివర్సిటీ అబుదాబీ (ఎన్‌వైయూఏడీ) సైంటిస్టుల బృందం సారథ్యం వహించింది. ఈ అధ్యయన వివరాలను జియోఫిజికల్ జర్నల్‌లో ప్రచురించారు. పరిశోధనలో భాగంగా అంగారకునిపై నాసా తాలూకు క్యూరియాసిటీ రోవర్ పరిశోధనలు చేస్తున్న గాలే బిల ప్రాంతంలోని అతి ప్రాచీన ఇసుక దిబ్బలపై ప్రధానంగా దృష్టి సారించారు.
లోపలి పొరల్లోని నీటి కారణంగా ఈ ప్రాంతమంతా కొన్ని వందల కోట్ల ఏళ్ల క్రితమే రాళ్లూ గుట్టలమయంగా మారిపోయింది. అంగారకుని మీది ఆ రాళ్ల స్వరూప స్వభావాలను యూఏఈ ఎడారుల్లో అటూ ఇటుగా అలాంటి పరిస్థితుల్లోనే ఏర్పడ్డ అటువంటివే అయిన రాళ్లతో పోల్చి చూశారు. గాలే బిలం సమీపంలోని పర్వత ప్రాంతం నుంచి భారీ నీటి ప్రవాహం ఇసుక దిబ్బల దిగువ పొరలకు ఇంకినట్టు ఈ పరిశోధనకు రీసెర్చ్ అసిస్టెంట్‌గా వ్యవహరించిన భారతీయ శాస్త్రవేత్త విఘ్నేశ్ కృష్ణమూర్తి వివరించారు.
‘‘ఆ జలం కొన్ని కోట్ల ఏళ్లపాటు వాటిని కిందినుంచి తడుపుతూ వచ్చింది. ఫలితంగా జిప్సం వంటి ఖనిజాలు పురుడు పోసుకున్నాయి. భూమిపై కూడా ఎడారి ప్రాంతాల్లో అత్యంత సహజంగా కనిపించే ఖనిజాల్లో జిప్సం ఒకటన్నది తెలిసిందే. మా పరిశోధనలో అంతిమంగా తేలింది ఒక్కటే. అంగారకుని తడి నేలలు ఉన్నపళంగా పొడిబారిపోలేదు.
అక్కడి ఉపరితలం మీది నదీనదాలు, సరస్సుల వంటివన్నీ పూర్తిగా ఇంకిపోయిన తర్వాత కూడా ఎంతోకొంత జలధార అట్టడుగు పొరల్లో ఉంటూనే వచ్చింది. కనుక మా అంచనా ప్రకారం ఆ ప్రాంతాల్లో సూక్ష్మజీవజాలం నేటికీ ఉనికిలోనే ఉన్నా ఆశ్చర్యమేమీ లేదు’’ అని ఆయన చెప్పుకొచ్చారు. అదే గనక జరిగితే జిప్సం తదితర ఖనిజాలతో కూడిన గాలే బిలం వంటి ప్రాంతాలే ఆ జీవానికి ఆటపట్టులని తెలిపారు. కనుక భావి అంగారక యాత్రలన్నింటికీ సహజంగానే అలాంటి ప్రదేశాలే లక్ష్యాలుగా మారతాయని కృష్ణమూర్తి వివరించారు. పరిశోధనకు ఎన్‌వైయూఏడీ తాలూకు స్పేస్ ఎక్స్‌ప్లరేషన్ లేబొరేటరీ చీఫ్ దిమిత్రా అట్రీ సారథ్యం వహించారు.
– సాక్షి, నేషనల్ డెస్క్


