తెల్లని నురగలతో నిండిన పాలసంద్రంలోకి పడిపోతున్న నల్లరాయిలా కన్పిస్తున్న ఈ శిల వాస్తవానికి ఒక ఉపగ్రహం. దీని పేరు ఫోబోస్. ఇది అంగారకుని చుట్టూ పరిభ్రమిస్తోంది. మార్స్‌కు అత్యంత సమీపంగా అంతర్గత కక్షలో తిరిగే ఈ ఫోబోస్ తాజా ఫొటోలను యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ(ఈఎస్‌ఏ) ఇటీవల క్లిక్ మనిపించి విడుదలచేసింది. ఇమేజ్ స్పెషలిస్ట్ అయిన ఆండ్రియా లక్ ఈ ఫొటోలను అందరితో పంచుకున్నారు.
ఈఎస్‌ఏ వారి ‘మార్స్ ఎక్స్‌ప్రెస్ ఆర్బిటార్’ ద్వారా ఈ ఫొటోలను తీశారు. ఓ పేద్ద బంగాళదుంపకు అతుక్కున్న రాయిలా ఈ ఉపగ్రహం భలేగా కన్పిస్తోందని ఒక నెటిజన్ తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్‌పెట్టారు. సౌరవ్యవస్థలోనే అత్యంత వైవిధ్యమైన నేలలున్న గ్రహంగా మార్స్ పేరొందింది. విస్తారమైన అగ్నిపర్వత నేలలు, రుధిరవర్ణ ఉపరితలం మీదుగా గగనతలంలో నల్లటి ఫోబోస్ దూసుకుపోవడం ఫొటోల్లో మరింత అందంగా కన్పిస్తోంది. ఫోబోస్ వెడల్పు 27 కిలోమీటర్లు మాత్రమే. అత్యల్ప స్థాయి సహజ ఉపగ్రహాల తీరుతెన్నులను గమనించేందుకు ఇలాంటి ఫొటోలు అక్కరకొస్తాయని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
–సాక్షి, నేషనల్ డెస్క్


