'ఖతర్నాక్‌ మొక్కలు'..! వీటి టక్కు టమారాలకు విస్తుపోవాల్సిందే..! | 10 Most Unusual Plants in the World | Rare & Mysterious Plant Facts | Sakshi
Sakshi News home page

'ఖతర్నాక్‌ మొక్కలు'..! వీటి టక్కు టమారాలకు విస్తుపోవాల్సిందే..!

Oct 12 2025 12:04 PM | Updated on Oct 12 2025 12:27 PM

 These Plants with Incredible Survival Mechanisms

నక్కజిత్తులు, టక్కు టమారాలు, వలపు వలలు – మనుషుల్లోనే కాదు ప్రకృతిలోని అన్నీ జీవుల్లోనూ ఉంటాయి. అయితే కొన్ని రకాల మొక్కల్లో కూడా ఈ విధమైన ‘జీవన నైపుణ్యాలు’ ఉంటాయని వింటే ఆశ్చర్యం వేస్తుంది. ఇక్కడున్న మొక్కలన్నీ ఏదో ఒక విశేషాన్ని కలిగి ఉన్నవే. కొద్దో గొప్పో తమ ప్రత్యేకతతో విస్తుగొలిపేవే. వీటిల్లో కొన్ని, కొనేందుకు దొరకొచ్చు. కొన్నింటి కోసమైతే 
ఏ ఆఫ్రికాకో, అమెజాన్‌ వర్షారణ్య ప్రాంతాలకో వెళ్లాల్సిందే! 

1. హైడ్నోరా పైకి కనిపించని పరాన్నజీవి
· ‘హైడ్నోరా ఆఫ్రికానా’ అనే ఈ ఆఫ్రికా మొక్క తన జీవితంలో ఎక్కువ భాగం భూగర్భంలో అజ్ఞాతంగా గడుపుతుంది, పుష్పించడానికి మాత్రమే తన గుట్టును రట్టు చేసుకుంటుంది. అంటే భూ ఉపరితలంపైన విప్పారిన పువ్వులా సాక్షాత్కరిస్తుంది. ఈ మొక్కకు ఆకులు ఉండవు. ఆకులు ఉండవు కనుక కిరణజన్య సంయోగక్రియను నిర్వహించదు. ‘కిరణజన్య సంయోగ క్రియ’ అంటే తెలిసిందే కదా. ఆకుపచ్చని ఆకులుండే మొక్కలు సూర్యరశ్మిని ఉపయోగించుకుని నీటిని, కార్బన్‌ డై ఆక్సైడ్‌ని... గ్లూకోజ్‌గా, ఆక్సిజన్‌గా మార్చి శక్తిని పొందటం.

మరి హైడ్నోరా ఆఫ్రికానాకు శక్తి ఎలా? కిరణ జన్య సంయోగ క్రియకు బదులుగా ఇది పోషకాలను దొంగిలించడానికి భూమి లోపల ఇతర మొక్కల వేళ్లకు అంటుకుని ఉంటుంది! దీని వింత జీవనశైలి ఎలా ఉన్నప్పటికీ స్థానికులు ఇందులోని యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్‌ లక్షణాలను విలువైనవిగా భావిస్తారు. ఫంగస్‌కీ, బాక్టీరియాకు ఔషధంగా వాడతారు.

2. ఫ్లైపేపర్‌ ప్లాంట్‌ జిగట ఉచ్చుల జిత్తులమారి
‘పింగిక్యులా జైగాంటియా’ అనే ఈ మొక్క, పోషకాలు తక్కువగా ఉండే నేలల్లో పెరుగుతుంది. దీని జిగట ఆకులు కీటకాలను బంధిస్తాయి. ఆ కీటకాలను తిని ఈ మొక్క పెరుగుతుంది. కీటకాలను తన జిగటతో ఒకసారి పట్టుకున్న తర్వాత, ఆ కీటాకాహారం నెమ్మదిగా మొక్కకు జీర్ణం అవుతుంది. మొక్కకు ముఖ్యమైన పోషకాలను అందిస్తుంది. వేసవి నెలల్లో లేత ఊదా నుండి ముదురు ఊదా వరకు వివిధ వర్ణ ఛాయలలో ఈ మొక్కకు సన్నని పూలు పూస్తాయి. 

ఈ మాంసాహార మొక్క కేవలం తను బతకడానికి మాత్రమే కీటకాలను తినటం కాకుండా, పరిసరాలలో కీటకాల జనాభానూ నియంత్రిస్తుంది. కీటకాలను పట్టుకునే ఉద్దేశంలో (ట్రాప్‌ మోడ్‌) లేనప్పుడు పుప్పొడి పరాగ సంపర్కాల కోసం ఆకర్షణీయమైన పువ్వులను కూడా ఉత్పత్తి చేస్తుంది! ఈ మొక్కను హన్స్‌ లుహర్స్‌ అనే వృక్ష శాస్తజ్ఞుడు మెక్సికోలో కనిపెట్టారు. ఎత్తయిన పర్వత వాతావరణంలో, నిలువు సున్నపు రాతి గోడల మధ్య ఉండే తేమతో కూడిన పగుళ్లలో ఇవి వృద్ధి చెందుతాయి.  

3. హ్యామర్‌ ఆర్కిడ్‌ ‘మాస్టర్స్‌’ డిగ్రీ మాయలాడి!
డ్రాకేయా గ్లిప్టోడాన్‌ అనే ఈ మొక్క మాయల పకీరు వంటిది. ఇది ఆడ కందిరీగను పోలి ఉంటుంది. పోలిక మాత్రమే కాదు, ఆడ కందిరీగ ఒంటి నుంచి వచ్చే వాసన లాంటి వాసననే ఇది విడుదల చేస్తుంటుంది. ఆ వాసనకు మగ కందిరీగలు మైమరచి, దీనితో జత కట్టటానికి వచ్చి వీటిపైన వాలతాయి. ఈ వాలటంలో, పుప్పొడి ఒక పువ్వు నుండి మరొక పువ్వుకు అంటుకుంటుంది. 

ఈ అద్భుతమైన మాయలాడి వ్యూహం వృక్షశాస్త్రవేత్తల అధునాతన పరిశోధనలకు చక్కగా ఉపయోగ పడుతోందని అంటారు! ఇవి పశ్చిమ ఆస్ట్రేలియాలోని నైరుతి ప్రాంతంలో కనిపిస్తాయి. వీటి పూలు మెరూన్‌ రంగులో ఉంటాయి. పైభాగంలో మూడింట రెండు వంతులు ‘నూగు’ ఉంటుంది. కింది భాగం జారుడుగా మెరుస్తూ ఉంటుంది. ఆగస్టు చివరి వారం నుండి అక్టోబర్‌ ఆఖరి వారం వరకు వీటి పూలు కనిపిస్తాయి.

4. డెత్‌ ఆపిల్‌ ట్రీ వల విసిరే వగలాడి
‘హిప్పోమేన్‌ మాన్సినెల్లా అనే ఈ మొక్క పండ్లను చూడగానే తినేయబుద్ధి అవుతుంది. కానీ అవి అత్యంత విషపూరితమైన పండ్లు. తింటే శరీరం విషమయం అవుతుంది. తక్షణ మరణం కూడా  సంభవించవచ్చు. ఇవి ఉష్ణమండల ప్రాంతాలైన దక్షిణ ఉత్తర అమెరికా నుండి ఉత్తర దక్షిణ అమెరికా వరకు విస్తరించి ఉన్నాయి. ఈ మొక్కను ‘లిటిల్‌ ఆపిల్‌ ఆఫ్‌ డెత్‌’ అని కూడా అంటారు. 

అందంగా, పచ్చగా కనిపిస్తున్నప్పటికీ ఈ మొక్కల మోసపూరితమైన అందం జానపద కథలలో అపఖ్యాతిని సంపాదించుకుంది. ఈ చెట్టు చుట్టూ అనేక కథలు ఉన్నాయి. ప్రకృతిలో దాగి ఉన్న ప్రమాదాలకు ఒక హెచ్చరికగా ఈ మొక్క కొన్ని కథల్లో గౌరవాన్ని కూడా పొందింది.  మొదట వీటికి చిన్న ఆకుపచ్చని పువ్వుల వంటి ముళ్లు వస్తాయి. వాటి నుండి పండ్లు వృద్ధి చెందుతాయి. అవి చిన్న ఆపిల్‌ పండ్లలా కనిపిస్తాయి.

5. మూషిక భక్షకి మాంసాహార రాక్షసి
‘నెపెంథెస్‌ అటెన్‌ బరోగి’ అనే ఈ ఆగ్నేయాసియాకు చెందిన మొక్క.. వాలీబాల్‌ నెట్‌లా పెద్ద మూతితో, కాడ ఆకారపు ఆకులను తోకగా కలిగి ఉంటుంది. ఇది కీటకాలను మాత్రమే కాకుండా ఎలుకలను కూడా బంధించి తింటుంది. వీటిని పిచర్‌ మొక్కలు అంటారు. ప్రముఖ ప్రకృతి శాస్త్రవేత్త సర్‌ డేవిడ్‌ అటెన్‌బరో పేరును ఈ మొక్కకు పెట్టారు. నెపెంథెస్‌ అటెన్‌ బరోగి భూమిపై నిటారుగా, లేదా ఊగులాడుతూ పెరిగే పొద.  

కీటకాలు గానీ, ఎలుకలు గాని ఒకసారి ‘నెట్‌’లో పడ్డాక ఇక బయటికి రావటం ఉండదు. మొక్క లోపలి ఆమ్ల ద్రవంలో జీర్ణమై పోతాయి. ఫిలిప్పీన్స్‌ ద్వీప సమూహం అంతటా కనిపించే వివిధ జాతుల పిచర్‌ మొక్కలను ఒక జాబితాగా తయారు చేయటానికి 2007లో వృక్షశాస్త్రవేత్తలు రెండు నెలల పాటు పరిశోధన జరిపినప్పుడు ఈ నెపెంథెస్‌ అటెన్‌బరోగి అమ్మగారు దర్శనమిచ్చారు.

6. పోర్క్యుపైన్‌ టొమాటాముళ్లు కప్పుకున్న వయ్యారి
‘సోలనమ్‌ పైరాకాంతోస్‌’ అనే శాస్త్రీయ నామం కలిగిన ఈ పోర్క్యుపైన్‌ మొక్క టొమాటా మొక్క లాగా కనిపిస్తుంది. అయితే పదునైన ముళ్లను కప్పుకుని ఉంటుంది. ఈ ముళ్లు... వేటాడే జంతువులు, కొన్ని రకాల తెగుళ్ల నుంచి ఈ ‘టొమాటా’లకు సహజ రక్షణ కవచంగా పనిచేస్తాయి. ఆఫ్రికాలోని కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో జీవించడానికి వీలు కల్పిస్తాయి.

పోర్క్యుపైన్‌ అద్భుతమైన రూప లావణ్యాలతో వయ్యారంగా ఉంటుంది. పూలు లావెండర్‌ రంగులో, ముళ్లు నారింజ రంగులో ఉంటాయి. ఇది ఉష్ణమండల మడగాస్కర్‌ ద్వీపానికి చెందిన మొక్క. నిత్యం పచ్చగా ఉంటూ, పొదలు పొదలుగా పెరుగుతుంది.

7. డాల్స్‌ ఐ ప్లాంట్‌
భయానక ‘భ్రమ’రాక్షసి ‘ఆక్టేయా పాకిపొడా’ అనే ఈ మొక్క, బెర్రీ పండ్లు అని భ్రమింపజేసే మానవ కనుగుడ్లను పోలిన పండ్లను కలిగి ఉంటుంది. పండు చుట్టూ తెల్లగా ఉంటుంది. మధ్యలో కారునలుపు ఉంటుంది. ఉత్తర అమెరికా అడవులకు చెందిన ఈ ‘బెర్రీ’లు  క్షీరదాలకు అత్యంత విషపూరితమైనవి. 

ఆహారం కోసం వెతికే జంతువులు తమ సహజజ్ఞానం వల్ల కావచ్చు, వీటి దరిదాపులకే వెళ్లవు. అసలు వీటి రూపమే భయం గొల్పేలా ఉంటుంది. ఇవి మనుషులకు, అడవి జంతువులకు నిషిద్ధమైనవి. వీటి పండ్లు తింటే గుండె కండరాల కణజాలంపై తక్షణ ప్రభావం చూపి గుండెను ఆగిపోయేలా చేస్తాయి.

8. జెల్లీ ఫిష్‌ ట్రీ వెల్లకిలా పడిన గొడుగు!
తూర్పు ఆఫ్రికా వైపుగా హిందూ మహాసముద్రంలో ఉండే సీషెల్స్‌ ద్వీప సముద్రంలో మాత్రమే కనిపించే ఈ ‘మెడుసజైన్‌ ఆపోజిటిఫోలియా’ అనే మొక్క నేడో రేపో అంతరించి పోతుందన్నంతగా ప్రమాదంలో ఉంది. జెల్లీ ఫిష్‌ టెంటకిల్స్‌ను పోలి ఉండే దీని పండ్ల క్యాప్సూ్యల్స్‌ దీనిని అరుదైన మొక్కలలో ఒకటిగా నిలిపాయి. 

చరిత్రకు పూర్వం నుండే ఈ మొక్క జీవించి ఉందని అంటారు. దీనికి వచ్చే తక్కువ విత్తనాలు దీని అంకురోత్పత్తికి సరిపడినంతగా  మాత్రమే ఉంటాయట! అలాగే తగ్గిపోతున్న ఆవాసాలు కూడా ఈ మొక్క మనుగడకు ముప్పుగా పరిణమించాయి. వీటి పండ్లు ఎండి చిట్లినప్పుడు వెల్లికిలా పడిన గొడుగుల్లా కనిపిస్తాయి.

విక్టోరియా వాటర్‌ లిల్లీ తేలియాడే ‘శివగామి’
అమెజాన్‌ వర్షారణ్య ప్రాంతాల్లో కనిపించే ‘విక్టోరియా అమెజోనికా’ అనే ఈ మొక్క 9 అడుగుల వెడల్పు వరకు భారీ ఆకులను ఉత్పత్తి చేస్తుంది, ఆ ఆకు చిన్న పిల్లవాడు  లేదా ఒక సన్నటి మనిషి బరువును మోసేంత బలంగా ఉంటుంది. వీటిని నీటి ఆకులు అంటారు. తేలికపాటి మోడల్స్‌ (అమ్మాయిలు) వీటిపై కూర్చొని ఫొటో షూట్‌ తీసుకోవటం ఇప్పుడు విస్తృతంగా కనిపిస్తోంది. 

విక్టోరియా మొక్క, జలచరాలకు ఆశ్రయం కల్పిస్తుంది. స్థానికులు దీనిని అనేక విధాలుగా ఉపయోగిస్తుంటారు. ఈ భారీ ‘నీటి కలువ’ ఒక సహజమైన అద్భుతం. అమెజాన్‌ ప్రాంతీయులకు ప్రకృతి ప్రసాదించిన సంపద. ఈ మొక్క చేసే టక్కు టమారాలు ఏమీ లేకపోయినా, వృక్షశాస్త్రజ్ఞులు దీనిని ‘అరుదైన జాతి’లో చేర్చారు.

10. డెడ్‌ హార్స్‌ అరమ్‌ కుళ్లిన వాసన కొట్టే లిల్లీ
‘హెలికోడిసెరోస్‌ మస్కివోరస్‌’ అనే ఈ మొక్క కుళ్లిన మాంసం వాసనను వెదజల్లటం ద్వారా పరాగ సంపర్కాలను ఆకర్షిస్తుంది. ఈ వాసన, కళేబరాలను తినే కీటకాలను రారమ్మని పిలుస్తుంటుంది. ఆ కీటకాలు ఈ మొక్కల పునరుత్పత్తికి, విస్తరణకు సహాయపడతాయి.

మధ్యధరా సముద్రంలో ఈ మొక్కను కనుగొన్నారు. మనుగడ కోసం పోరాటంలో మొక్కల వ్యూహాలు ఎంత తీవ్రంగా, అసాధారణంగా ఉంటాయో తెలుసుకోటానికి ఈ మొక్క ఒక ఉదాహరణ. వీటి పూలను ఆరల్‌ లిల్లీస్‌ అంటారు. ఆ లిల్లీపూల పుష్ఫగుచ్చం, చనిపోయిన జంతువు ఆసన ప్రాంతాన్ని పోలి ఉంటుంది. 
సాక్షి, స్పెషల్‌ డెస్క్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement