– ప్రతాని రామకృష్ణ గౌడ్
‘‘తెలుగు పరిశ్రమలోని ముగ్గురు నిర్మాతలు చేస్తున్న నిర్వాకాల వల్ల చిన్న సినిమా మనుగడ ప్రశ్నార్థకంగా మారింది’’ అన్నారు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సీసీ) చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్. టీఎఫ్‌సీసీ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన మహాధర్నాలో రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ– ‘‘సినిమాను థియేటర్‌లో ప్రదర్శించే డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్స్ ‘క్యూబ్, యూఎఫ్‌వో, పీఎక్స్ డీ’ తెలుగు నిర్మాతల నుంచి థియేటర్లలో ప్రదర్శనకు వారానికి రూ. పది వేలు, మల్టీప్లెక్స్‌లో వారానికి 15 వేలు వసూలు చేస్తున్నారు.
ఇతర రాష్ట్రాల్లో ఈ చార్జీలు రూ. 2500 నుంచి 3 వేల రూపాయలు మాత్రమే. ఇండస్ట్రీలోని ముగ్గురు నిర్మాతలు ఈ డిజిటల్ ప్రొవైడింగ్ కంపెనీల్లో భాగస్వామ్యంగా ఉంటూ తెలుగు పరిశ్రమను లూటీ చేస్తున్నారు. థియేటర్స్‌లో తినుబండారాల ధర, టికెట్ రేట్లు భారీగా ఉంటున్నాయి. దీంతో సామాన్య ప్రేక్షకుడు చిన్న సినిమాను థియేటర్స్‌లో చూసేందుకు రావడం లేదు. ఈ సమస్యలపై ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలి’’ అని పేర్కొన్నారు. ఎత్తరి గురురాజ్, సాయి వెంకట్, డీఎస్ రెడ్డి, రవి, సన్నీ, సిరాజ్ తదితరులు పాల్గొన్నారు.


