టాలీవుడ్లో ఈ ఏడాది చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. పెద్ద పెద్ద స్టార్స్ సినిమాలతో చిన్న చిత్రాలు కూడా థియేటర్లలో సందడి చేశాయి. భారీ తారాగణ, పెద్ద బడ్జెట్ సినిమాలకు కలెక్షన్స్ వస్తాయి. మరి చిన్న సినిమాల సంగతేంటి? అగ్రతారలు లేకపోయినా సినిమాలకు ఆదరణ దక్కడం అంతా ఈజీ కాదు. కంటెంట్ ఉంటే బాక్సాఫీస్ వద్ద రాణిస్తాయి. లేకపోతే వారం రోజుల్లోనే కనుమరుగవుతుంటాయి. కానీ కంటెంట్ ఉన్న చిన్న చిత్రాలు మాత్రం ఈ ఏడాది సత్తా చాటాయి. ఈ ఏడాదిలో పెద్ద స్టార్స్ లేకుండానే బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కొట్టిన వచ్చిన ఆ చిన్న సినిమాలేవో ఓ లుక్కేద్దాం.
కోర్ట్ మూవీ..
ఈ ఏడాది సూపర్ హిట్గా నిలిచిన చిత్రాల్లో కోర్టు ఒకటి. మార్చి 14న థియేటర్లలోకి వచ్చిన కోర్ట్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆడియన్స్ ఆదరణ దక్కించుకుంది. ఓ చిన్న సినిమా అద్భుత విజయాన్ని సాధించింది. హీరో నాని నిర్మించిన ఈ మూవీ.. అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. ఈ చిత్రంలో ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించగా.. హర్ష రోషన్-శ్రీదేవి జంటగా అలరించారు. రామ్ జగదీశ్ అనే కొత్త దర్శకుడు తీసిన ఈ చిత్రంలో పోక్సో చట్టం గురించి ప్రస్తావించారు. ఈ మూవీ కేవలం రూ. 5 కోట్ల బడ్జెట్‌తో తీస్తే.. దాదాపు రూ. 55 కోట్లు వసూలు చేసి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
8 వసంతాలు..
ఈ ఏడాగి సినీ ప్రియులను అలరించిన ప్రేమ కథా చిత్రం '8 వసంతాలు'. ఈ ఏడాది జూన్ 20న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ను సొంతం చేసుకుంది. అయితే థియేటర్లలో పెద్దగా రెస్పాన్స్ రాని ఈ సినిమా మాత్రం ఓటీటీలో అదరగొట్టింది. 8 వసంతాల డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించారు.
లిటిల్ హార్ట్స్..
ఈ ఏడాది సూపర్ హిట్గా నిలిచిన మరో చిన్న సినిమా లిటిల్ హార్ట్స్. యూట్యూబర్ మౌళి, శివాని నాగారం జంటగా నటించిన ఈ చిత్రం థియేటర్ల వద్ద అదరగొట్టిది. కేవలం మౌత్ టాక్‌తో పుంజుకుని ఏకంగా రూ. 50 కోట్లు వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సినిమాకు సాయి మార్తాండ్ దర్శకత్వం వహించారు.
మ్యాడ్ స్క్వేర్..
గతంలో వచ్చి సూపర్ హిట్ కొట్టిన ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ మ్యాడ్. ఈ మూవీకి సీక్వెల్గా మ్యాడ్ స్క్వేర్ తెరకెక్కించారు. ఈ ఏడాది ఉగాదికి థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్గా నిలిచింది. ఫస్ట్ పార్ట్ అంతా సూపర్ హిట్ కాకపోయినా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాకు కలెక్షన్స్ కూడా బాగానే వచ్చాయి. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ యూత్ ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్ సుమారు రూ. 65 కోట్లు రాబట్టింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ కీలక పాత్రల్లో మెప్పించారు.
రాజు వెడ్స్ రాంబాయి..
ఇటీవలే రిలీజైన సూపర్ హిట్ కొట్టిన మరో చిన్న సినిమా రాజు వెడ్స్ రాంబాయి. యధార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన ఈ విలేజ్ బ్యాక్డ్రాప్ లవ్ స్టోరీ బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. కేవలం రూ. 3 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా సుమారు దాదాపు రూ. 15 కోట్ల వరకు వసూలు చేసింది. ఈ చిత్రాన్ని సాయిలు కంపటి దర్శకత్వంలో తెరకెక్కించారు.


