ఐసీయూలో టాలీవుడ్ 'చిన్న' సినిమా | Telugu Small Budget Movies Hurdles | Sakshi
Sakshi News home page

Tollywood: అలాంటి చిన్న మూవీసే హిట్.. మిగతావి మాత్రం!

Dec 27 2025 6:26 PM | Updated on Dec 27 2025 7:47 PM

Telugu Small Budget Movies Hurdles

ఓ రాజ్యం ఉంది. అందులో రాజు, రాణి, మంత్రి, సైనికులు, ప్రజలు.. ఇలా అందరూ ఉన్నారు. రాజుకి అందరూ జేజేలు పలుకుతారు. కానీ సైనికులు లేకపోతే ఆయనకు విలువ ఎక్కడిది? ఇలా ఆలోచించేవాళ్లు ఎంతమంది? టాలీవుడ్ పరిస్థితి కూడా ఇలానే తయారైనట్లు కనిపిస్తోంది! రాజు లాంటి స్టార్ హీరోల మూవీస్‌ని పట్టించుకుంటున్న ప్రేక్షకుడు.. సైనికుడు లాంటి చిన్న సినిమాని లైట్ తీసుకుంటున్నాడు. ఇంతకీ దీనికి కారణమేంటి? ఇండస్ట్రీలో అసలేం జరుగుతోంది?

ఒకప్పుడు కూడా తెలుగులో స్టార్ హీరోలు ఉన్నారు. వాళ్లు సినిమాలు చేసేవారు. కానీ ఎప్పుడూ పెద్దా చిన్నా అని తేడా ఉండేది కాదు. తెలుగు మూవీ అని మాత్రమే అని మాట్లాడుకునేవారు. ఎప్పుడైతే పాన్ ఇండియా ట్రెండ్ మొదలైందో అప్పటినుంచి రోజురోజుకీ టాలీవుడ్‌లో చిన్న చిత్రాల పరిస్థితి అంతకంతకు దిగజారుతూ వచ్చింది. చూసే ప్రేక్షకుల ఆలోచన విధానంలోనూ చాలా మార్పులొచ్చాయి.

ఒకప్పుడు ఎంటర్‌టైన్‌మెంట్ అంటే సినిమా మాత్రమే. దీంతో వీకెండ్ వస్తే చాలు థియేటర్లకు వెళ్లేందుకు ఆసక్తి చూపించేవారు. చిన్నపెద్దా మూవీస్ అన్నీ చూసేవారు. ఇప్పుడు మీడియం బడ్జెట్ సినిమాలు అనగానే ఎలానూ నెలరోజులకు ఓటీటీల్లోకి వచ్చేస్తాయిగా, ఇంట్లో చూసుకోవచ్చులే అని చాలామంది.. ముందే ఫిక్స్ అయిపోతున్నారు. అందుకే మీడియం బడ్జెట్ చిత్రాల్ని థియేటర్లలో రిలీజ్ చేసినా సరే వాటికి పెద్దగా ఆదరణ ఉండట్లేదు.

గీతా ఆర్ట్స్, సితార, మైత్రీ, ఎస్వీసీ లాంటి పెద్ద సంస్థలు నిర్మించే మీడియం బడ్జెట్ సినిమాలకు కాస్తోకూస్తో హైప్ ఉంటుంది. అందుకు తగ్గట్లే వాళ్లు ప్రమోషన్ చేస్తుంటారు. ఖర్చు విషయంలో అస్సలు వెనకాడరు. స్టార్స్‌తోనూ ప్రమోషన్స్ చేయిస్తారు. దీంతో ఆయా పెద్ద నిర్మాణ సంస్థల నుంచి వచ్చే చిత్రాలకు మాత్రం అంతో ఇంతో ఆదరణ దక్కుతోంది. మిగిలిన వాటి వైపు ఆడియెన్స్ చూడటమే గగనమైపోతోంది.

మూవీ టీమ్ చేసే కొన్ని పనులు కూడా చిన్న సినిమాలని ప్రేక్షకులు లైట్ తీసుకునేలా చేస్తున్నాయి. సినిమా రిలీజ్ కావడమే లేటు.. మా మూవీ తోపు, బంపర్ హిట్ అని సోషల్ మీడియాలో ప్రచారం చేయించుకుంటున్నారు. కంటెంట్ ఉంటే పర్లేదు లేదంటే మాత్రం.. వీటిని చూసి నమ్మి, థియేటర్‌కి వెళ్లిన చాలామంది.. పలుమార్లు మోసపోయారు. ఇలా జరిగిన తర్వాత చిన్న సినిమా అంటే ఇంతే అని ఓ అభిప్రాయం వాళ్లకు కచ్చితంగా ఏర్పడుతుంది.

చిన్న చిత్రాలంటే బడ్జెట్ తక్కువే. అందుకు తగ్గట్లే క్వాలిటీ, కంటెంట్ ఉంటుంది. ప్రస్తుతం ఓటీటీల్లో ఇంటర్నేషనల్ క్వాలిటీ కంటెంట్ చూస్తున్న ప్రేక్షకుడు.. మన నిర్మాతలు తీసే రొటీన్ రొట్టకొట్టుడు చిత్రాలకు ఎందుకు వెళ్తాడు? ఈ విషయంపై దర్శకనిర్మాతలు కచ్చితంగా దృష్టిపెట్టాలి. రెగ్యులర్ కమర్షియల్, థ్రిల్లర్, హారర్ చిత్రాలు తీస్తే.. పరుగెత్తుకుని వచ్చి చూసేసే రోజులు కావివి. కామెడీ కావొచ్చు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కావొచ్చు సమ్‌థింగ్ డిఫరెంట్ ఉంటేనే ఆడియెన్స్, థియేటర్‌కి వచ్చి చూస్తారు. లేదంటే కనీసం ఆ వైపు కూడా చూడరు.

చిన్న సినిమాల్లో స్టార్స్ పెద్దగా ఉండరు. సదరు హీరో లేదా హీరోయిన్ కోసం థియేటర్‌కి వెళ్లి చూడాలా? అని సగటు ప్రేక్షకుడు కచ్చితంగా అనుకుంటాడు. స్టార్ హీరోల సినిమాలు రిలీజైనప్పుడు ఇంతింత టికెట్ రేట్లు పెట్టి చూస్తారు. వాటికే మొత్తం ఖర్చు పెట్టేస్తే చిన్న చిత్రాలు వచ్చినప్పుడు చూసేందుకు డబ్బులు ఎక్కడుంటాయి?

ఈ వీకెండే తీసుకుందాం. ఒకటి రెండు కాదు అరడజనుకు పైగా చిన్న సినిమాలు ఒకేసారి రిలీజయ్యాయి. వీటిలో ఒక్కదానికి మాత్రమే పాజిటివ్ టాక్ వచ్చింది. మిగిలిన వాటికి మిక్స్‌డ్, నెగటివ్ టాక్ వచ్చింది. ఇలా ముకుమ్మడి విడుదల కూడా మీడియం బడ్జెట్ చిత్రాల్ని చంపేస్తోందని చెప్పొచ్చు. ఇలా చాలా చాలా అంశాలు టాలీవుడ్‌లో చిన్న సినిమాలకు రోజురోజుకీ శాపంగా మారుతున్నాయా అనిపిస్తోంది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement