మనుషుల్లో మాదిరిగా వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్స్ ఉన్నట్లుగానే మొక్కలలో కూడా ఉంటాయి. కొన్ని మొక్కలు సూర్యకాంతిని, నేలనుంచి పోషకాలను తీసుకుని జీవిస్తాయి. మరికొన్ని మొక్కలు మాత్రం అలా కాదు ఆహారం కోసం ఇతర వనరులపై ఆధారపడతాయి. అవే మాంసాహార మొక్కలు.. ప్రకృతిలో ఈ మొక్కలు భిన్నంగా ఉంటాయనేది మీకు తెలుసా..?
నాన్ వెజిటేరియన్ ప్లాంట్స్
ఈ నాన్ వెజిటేరియన్ ప్లాంట్స్ పోషకాలను ఉత్పత్తి చేసుకునే సామర్థ్యం ఉన్నా... కొన్ని రకాల కీటకాలను ఆహారంగా తీసుకుంటాయి. అటువంటి మొక్కలను ‘కార్నివోరస్ ప్లాంట్స్’ లేదా మాంసాహార మొక్కలు అంటారు. వీటికి పత్రహరితం ఉన్నప్పటికీ, కొందరు పూర్తిగా, మరికొందరు పాక్షికంగా వేరే జీవులపైన ఆధారపడతాయి. మరెందుకని ఆ మొక్కలు మాంసాహారంగా మారాయి? మామూలుగా మొక్కలకు ఎదుగుదలకు, ఇతర జీవక్రియలకు అవసరమయ్యే ముఖ్య పోషకాల్లో ఒకటి నైట్రోజన్. ఇది నేలలో లభిస్తుంది. అయితే, కొన్ని ప్రాంతాల నేలల్లో నైట్రోజన్ సరిపడా ఉండదు. అటువంటి ప్రాంతాల్లో పెరిగే మొక్కలు... కీటకాలు లేదా ఇతర చిన్న జీవులను పట్టుకుని, వాటి నుంచి నైట్రోజన్‌ను తీసుకుంటాయి. ఈ మాంసాహార మొక్కలు (Carnivorous Plants) నీటిలో, ఆమ్ల గుణాలు ఎక్కువగా ఉండే చిత్తడి నేలల్లో పెరుగుతాయి.
మాంసాహార మొక్కల్లో రకాలు..
మాంసాహార మొక్కల్లో రకాలు ఈ మొక్కలన్నిటికీ వేటాడుకునే, ఆహారం పట్టుకునే పద్ధతులు వేరుగా ఉంటాయి. కొన్ని మొక్కలు కీటకాలను ఆకర్షించడానికి తీయని మకరందాన్ని స్రవిస్తాయి. మరికొన్ని ఆకులను ఉపయోగించి వేటాడతాయి. కొన్ని మొక్కలు కీటకాలు దానిపై వాలగానే మూసుకుపోతాయి. మరికొన్ని జిగురు వంటి ద్రవాన్ని స్రవించి, కీటకాలను అంటి పెట్టుకునేలా చేస్తాయి. మరికొన్ని మొక్కలు ప్రత్యేక ఆకారం ఉన్న గదులను కలిగి, అందులో కీటకాలు పడగానే బయటకు రానివ్వవు. ఇలా రకరకాల పద్ధతుల్లో ఆ మొక్కలు వేటాడతాయి. ఈ మాంసాహార మొక్కలు భూమిపై దాదాపు 630 జాతుల్లో ఉన్నట్లుగా చెబుతారు. ఈ మాంసాహార మొక్కల గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందామా..?
వీనస్ ఫ్లైట్రాప్
వీనస్ ఫ్లైట్రాప్ దీనిని ఫ్లైట్రాప్ అని కూడా అంటారు. ఇది నార్త్ కరోలినా, సౌత్ కరోలినా ప్రాంతాల్లో ఉంటుంది. చిత్తడి నేలల్లో పెరిగే అరుదైన మొక్క. దీని ఆకులు రెండు వైపులా ముడుచుకుని పోయే విధంగా ఉంటాయి. లోపలి భాగంలో కీటకాలు వాలగానే దవడల్లా మూసుకుపోతాయి. ఈ ఆకుల అంచులలో వెంట్రుకల వంటి కొసలు ఉంటాయి. కీటకం పడగానే, వెంట్రుకల వంటి భాగాలు అడ్డుగా మారి, కీటకం బయటకు రాకుండా అడ్డుకుంటాయి. ఆ తర్వాత మొక్క జీర్ణక్రియ ఎంజైములను స్రవించి, కీటకంలోని పోషకాలను సంగ్రహిస్తుంది. జీర్ణక్రియ పూర్తవడానికి సుమారు 10 రోజులు పడుతుంది.
జీర్ణక్రియ అయిపోయిన తర్వాత, ఆకు మళ్లీ తెరుచుకుంటుంది. సన్‌డ్యూ ఇది ప్రపంచవ్యాప్తంగా దాదాపు 194 జాతుల్లో లభిస్తుంది. దీని ఆకులు సన్నని వెంట్రుకల మాదిరిగా, ఎరుపు, ఆకుపచ్చ రంగుల్లో ఉంటాయి. దీని కొనభాగం తీయని జిగురువంటి ద్రవాన్ని స్రవిస్తుంది. ఆ జిగురు కీటకాలను ఆకర్షిస్తుంది. ఆ జిగురు కీటకాలను ఆకర్షించి, వాటిని బంధిస్తుంది. పట్టుకున్న తర్వాత, మొక్క కీటకాలను చుట్టి, జీర్ణక్రియ ఎంజైములను స్రవిస్తుంది.
నెపెంథస్..
ఇది ఒక రకమైన క్లైంబింగ్ మొక్క. దీని ఆకులు కిందకు వేలాడుతూ కుండ లేదా పిచర్ ఆకారంలో ఉంటాయి. దీని లోపలి భాగం తేనెవంటి మకరందాన్ని స్రవిస్తుంది. తీయని వాసనతో ఆకర్షించబడిన కీటకాలు అందులోకి జారుతాయి. లోపలి భాగం జిగురుగా, జారుడుగా ఉండడం వల్ల కీటకాలు బయటకు రాలేవు. కింది భాగంలో జీర్ణక్రియ ఎంజైములు ఉంటాయి. అందులో పడిన కీటకాలను జీర్ణం చేసుకుని పోషకాలను తీసుకుంటుంది. ఈ పిచర్ ప్లాంట్ జాతులలో కొన్ని.. చిన్న ఎలుకలను, ఇతర చిన్న జీవులను కూడా తినేంత పెద్దవిగా ఉంటాయి. ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికాలో ఈ మొక్కలు పెరుగుతాయి. కాటిల్ పర్పుల్ పిచర్ ఇవి కీటకాలను పట్టుకోవడానికి ప్రత్యేక ఆకారం ఉన్న ఆకులను కలిగి ఉంటాయి. పిచర్ ఆకారంలో ఉండే ఆకుల్లో వర్షపు నీరు నిల్వ అవుతుంది. కీటకాలు అందులో పడగానే బయటకు రాలేవంత బలంగా ఉండే వెంట్రుకల వంటి నిర్మాణాలు లోపలి వైపు ఉంటాయి. సాలీడులు, ఈగలు, చీమలు వంటి వాటిని ఇవి ఆహారంగా తీసుకుంటాయి. ఇవి ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా చిత్తడి నేలల్లో పెరుగుతాయి.
చదవండి: కావేరి వామన్.. ఐదడుగుల అరటి!
వాటర్‌వీల్ ప్లాంట్..
ఇది నీటి అడుగున పెరుగుతుంది. ఈ మొక్క కీటకాలను పట్టుకోవడానికి వీనస్ ఫ్లైట్రాప్‌ని పోలిన యాంత్రిక పద్ధతిని ఉపయోగిస్తుంది. నీటిలోని చిన్న చిన్న కీటకాలు ఆకులపై వాలగానే, అవి చాలా వేగంగా మూసుకుపోతాయి. ఇది ప్రధానంగా ఐరోపా, ఆఫ్రికా, ఆసియా, ఆస్ట్రేలియాలోని మురికి నీటిలో పెరుగుతుంది. బటర్‌వార్ట్ ఈ మొక్కలు ఆకుపచ్చ, పసుపు లేదా గులాబీ రంగుల్లో కనిపిస్తాయి. దీని ఆకుల పైభాగం జిగురుతో కప్పబడి ఉంటుంది. ఇది కీటకాలను పట్టుకోవడానికి సన్‌డ్యూ మొక్కను పోలిన విధానాన్ని అనుసరిస్తుంది. చిన్న చిన్న కీటకాలు ఆ జిగురుకు అతుక్కుపోతాయి. పట్టుకున్న తర్వాత, ఈ మొక్క ఆకును నెమ్మదిగా కీటకం చుట్టూ చుట్టి, జీర్ణక్రియ ఎంజైములను స్రవించి, పోషకాలను గ్రహిస్తుంది. ఈ మొక్కలు ఉత్తర, దక్షిణ అమెరికా, ఐరోపా, ఆసియాలోని చిత్తడి నేలల్లో పెరుగుతాయి.
కాలిఫోర్నియా పిచర్ ప్లాంట్..
కోబ్రా లిల్లీ దీనిని కాలిఫోర్నియా పిచర్ ప్లాంట్ అని కూడా పిలుస్తారు. ఇది ప్రధానంగా కాలిఫోర్నియా, ఒరెగాన్ ప్రాంతాల చిత్తడి నేలల్లో పెరుగుతుంది. దీని ఆకు, కోబ్రా పాము తల మాదిరిగా ఉంటుంది. లోపలికి జారుడుగా ఉండే ఆకుల్లోకి కీటకాలు వెళ్ళగానే, వెనుకకు రాలేక లోపల చిక్కుకుంటాయి. ఇవి పసుపు, ఆకుపచ్చ, ఎరుపు రంగుల్లో ఉండి కీటకాలను ఆకర్షిస్తాయి. డయోనియా మస్సిపుల లేదా వీనస్ ఫ్లైట్రాప్, ప్రపంచంలోనే అత్యంత అరుదైన, అందమైన మాంసాహార మొక్కల్లో ఒకటి. ఇది కీటకాలను పట్టుకోవడానికి దాని ఆకులను ఉపయోగించి వేగంగా మూసుకుపోతుంది. డ్రోసెరా లేదా సన్‌డ్యూ మొక్క, జిగురు లాంటి ద్రవాన్ని స్రవించి కీటకాలను బంధిస్తుంది.
- పసుపులేటి వెంకటేశ్వరరావు


