దారి తప్పిన చిన్నారి.. 17 ఏళ్ల తర్వాత ఇంటికి..
అనగనగా ఓ చిన్నారి.. ఐస్‌క్రీమ్ కొనుక్కోవడానికి ఇంటి గడప దాటింది. అంతే.. తప్పిపోయింది. ఇంటి చిరునామా మరిచిపోయింది. దశాబ్దంన్నరకు పైగా సాగిన ఆ కన్నీటి కథకు, ఆధునిక సాంకేతికత అనూహ్యమైన ముగింపు పలికింది. దశాబ్దం క్రితం నమోదైన ఓ ‘మిస్సింగ్ గర్ల్’ ఫిర్యాదు, అత్యాధునిక ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్, ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సాంకేతికత... వెరసి ఓ పాకిస్తానీ యువతిని 17 ఏళ్ల తర్వాత తన కుటుంబంతో తిరిగి కలిపాయి. 2008లో ఇస్లామాబాద్‌లో తప్పిపోయిన కిరణ్ అనే బాలిక.. ఇప్పుడు 27 ఏళ్ల యువతిగా ఎదిగి కన్నవారి ఒడికి చేరుకుంది.
‘నేను ఏడుస్తూ ఒంటరిగా ఉన్నాను. అప్పు డు ఎవరో ఒక దయామయి నన్ను ఇస్లామాబాద్‌లోని ఎధీ సెంటర్‌కు తీసుకెళ్లినట్టు గుర్తు. అప్పట్లో నాకు ఏమీ గుర్తు లేదు’.. అని కిరణ్ గుర్తు చేసుకుంది. కొద్ది రోజుల్లోనే, మానవతామూర్తి దివంగత అబ్దుల్ సత్తార్ ఎధీ భార్య బిల్కిస్ ఎధీ.. కిరణ్‌ను కరాచీకి తీసుకెళ్లారు. అప్పటి నుండి, ఎధీ ఆశ్రయంలో.. బిల్కిస్ సంరక్షణలో కిరణ్ పెరిగింది. కిరణ్ తల్లిదండ్రుల ఆచూకీ కోసం ఇస్లామాబాద్‌కు పలుమార్లు వెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందని ఎథీ ఫౌండేషన్ సభ్యులు తెలిపారు.
పట్టు వదలని ‘ఎధీ’ ప్రయత్నం
ఎధీ ఫౌండేషన్ ప్రస్తుత చైర్‌పర్సన్ ఫైసల్ ఎధీ భార్య సభా ఫైసల్ ఎధీ మాట్లాడుతూ.. కిరణ్ తల్లిదండ్రులను గుర్తించడానికి ఇస్లామాబాద్‌కు ఎన్నిసార్లు వెళ్లినా ఫలితం దక్కలేదన్నారు. ఆశలు సన్నగిల్లిన సమయంలో, ఫౌండేషన్ ఈ ఏడాది మొదట్లో పంజాబ్‌లో ’సేఫ్ సిటీ ప్రాజెక్ట్’లో పనిచేస్తున్న సైబర్ సెక్యూరిటీ నిపుణుడు నబీల్ అహ్మద్‌ను సంప్రదించింది. ‘మేము అతనికి కిరణ్ ప్రస్తుత ఫొటోలు, ఆమె బాల్యం గురించి తెలిసిన స్వల్ప సమాచారాన్ని అందజేశాం’.. అని సభా వివరించారు. కేసును సవాలుగా తీసుకున్న నబీల్, ఇస్లామాబాద్ పోలీస్ స్టేషన్‌లో దశాబ్దం క్రితం నమోదైన ‘మిస్సింగ్ గర్ల్’ రిపోర్ట్‌ను గుర్తించారు. ఆ రిపోర్ట్‌లోని పాత ఫొటోలు, కిరణ్ ప్రస్తుత ఫొటోలను, అత్యాధునిక ఏఐ ఆధారిత ఫేషియల్ రికగ్నిషన్, ట్రాకింగ్ సాఫ్ట్‌వేర్ల సహాయంతో విశ్లేషించారు. పాత రూపానికి, ప్రస్తుత రూపానికి పోలికలను ఏఐ అత్యంత కచి్చతత్వంతో అందించడంతో, కిరణ్ కుటుంబాన్ని గుర్తించడం సాధ్యమైంది.
నా కూతుర్ని చూస్తాననుకోలేదు
టైలర్‌గా పనిచేసే అబ్దుల్ మజీద్, తానే కిరణ్ తండ్రినని ధ్రువీకరిస్తూ కరాచీకి చేరుకున్నారు. ‘కిరణ్ ఫొటోలను పత్రికల్లో వేయించినా ప్రయోజనం లేకుండా పోయింది. నా కూతురిని చూస్తానని ఆశ వదులుకున్నాను’.. అని మజీద్ భావోద్వేగానికి లోనయ్యారు. సేఫ్ సిటీ ప్రాజెక్ట్ అధికారులు తనను సంప్ర దించినప్పుడు
ఆ ఆనందాన్ని వరి్ణంచలేనని తెలిపారు. ‘ఇక్కడి నా కుటుంబ సభ్యులను (ఎధీ ఆశ్రయం) వదిలి వెళ్లడం బాధగా ఉన్నా, బిల్కిస్ ఆపాకు నేను ఎప్పటికీ కృతజు్ఞరాలిని’.. అని కిరణ్ సంతోషంగా వీడ్కోలు పలికింది. ఏఐ సాంకేతికత సాయంతో ఎధీ ఆశ్రయం నుండి.. తన కుటుంబానికి చేరిన అయిదో యువతి కిరణ్ కావడం విశేషం. కాలం చెరిపేసిన గతాన్ని, ఏఐ సాంకేతికత చెక్కు చెదరకుండా తిరిగి లిఖించింది... ఇది సైన్స్, సెంటిమెంట్ మేళవించిన అద్భుతం.
– సాక్షి, నేషనల్ డెస్క్


