ఇస్లామాబాద్: పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో భారీ పేలుడు సంభవించింది. ఇవాళ (నవంబర్ 11, మంగళవారం) జ్యుడీషియల్ కాంప్లెక్స్ సమీపంలో జరిగిన పేలుడులో 12 మంది ప్రాణాలు కోల్పోగా, 20 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో అత్యధికులు న్యాయవాదులేనని పాక్ మీడియా వర్గాలు వెల్లడించాయి. ఆత్మాహుతి దాడిగా అధికారులు భావిస్తున్నారు.
స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం సమయంలో కోర్టు గేటు వద్ద పార్క్ చేసి ఉన్న ఓ కారులో ఈ పేలుడు జరిగింది. అత్యంత రద్దీగా ఉండే సమయం కావడంతో ప్రాణనష్టం భారీగా జరిగింది. పేలుడు తీవ్రతకు సమీపంలోని పార్క్ చేసిన పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. సుమారు 6 కిలో మీటర్ల దూరం వరకు పేలుడు శబ్దం వినిపించినట్లు స్థానికులు పేర్కొన్నారు. పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సిన్ నక్వీ మాట్లాడుతూ.. ఈ బాంబు దాడి మధ్యాహ్నం 12.39 గంటలకు జరిగిందని తెలిపారు.
కారులోని గ్యాస్ సిలిండర్ పేలడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందా? ఆత్మాహుతి దాడా? పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాను నా కారు పార్క్ చేసి కాంప్లెక్స్‌లోకి వెళ్తుండగా.. గేటు సమీపంలో పెద్ద శబ్దం వినిపించిందని.. అక్కడ రెండు మృతదేహాలు పడి ఉన్నాయని న్యాయవాది రుస్తుమ్ మాలిక్ ఏఎఫ్‌పీ మీడియా తెలిపారు. కాగా, ఈ పేలుడు సంభవించిన కొన్ని గంటల ముందే దక్షిణ వజీరిస్థాన్‌లో పాక్ భద్రతా దళాలు ఓ ఉగ్ర కుట్రను భగ్నం చేసిన సంగతి తెలిసిందే. వానాలోని కేడెట్ కాలేజీపై తెహ్రీక్-ఏ-తాలిబన్ పాకిస్తాన్ (TTP) ఉగ్రవాదులు దాడికి యత్నించగా.. అడ్డుకున్న భద్రతా దళాలు ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చాయి.
ఇటీవల పాకిస్తాన్–ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. అక్టోబర్ 9న కాబూల్‌లో జరిగిన డ్రోన్ దాడులకు ఇస్లామాబాద్ బాధ్యత వహించిందని ఆఫ్ఘనిస్తాన్ ఆరోపించింది. ఆ దాడిలో పలువురు మరణించగా, ప్రతీకార చర్యలు చేపడతామని కాబూల్ హెచ్చరించింది. అనంతరం జరిగిన సరిహద్దు ఘర్షణల్లో పలు సంఖ్యల్లో సైనికులు, పౌరులు, మిలిటెంట్లు మరణించారు. అక్టోబర్ 19న ఖతార్ మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే.


