తెలంగాణ ఆర్థిక ముఖచిత్రం మార్చేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు
ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ద్వారా ఫుడ్ పార్కులు, ప్రాసెసింగ్ జోన్ల స్థాపనకు కసరత్తు.. మైక్రో కోల్డ్ స్టోరేజీ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు
బహుళ ఉత్పత్తుల ప్రాసెసింగ్ సెంటర్లతో స్థానికంగా ఉపాధి కల్పన దిశగా అడుగులు..
అంతర్జాతీయ ప్రమాణాల కోసం ఫుడ్ ప్రాసెసింగ్‌లో ఆధునిక టెక్నాలజీ వాడాలని నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చడంలో వ్యవసాయ, ఆహారశుద్ధి సంబంధిత పరిశ్రమలకు పెద్దపీట వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడంతోపాటు ఎగుమతుల వృద్ధి, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాల పెంపుదలపై దృష్టిపెట్టనుంది. రాష్ట్రంలోని పంటల వైవిధ్యం, రైతుల సంఘటిత శక్తి, వేగంగా విస్తరిస్తున్న ఫుడ్ పార్కులు, ప్రాసెసింగ్ జోన్లు తదితరాలను అనువుగా మలుచుకొని జాతీయ స్థాయిలో వ్యవసాయ, ఆహార సంబంధిత పరిశ్రమలకు తెలంగాణను కేంద్రంగా తీర్చిదిద్దే ప్రణాళికలకు ప్రభుత్వం మెరుగులు దిద్దుతోంది. మెగా ఫుడ్ పార్కులను బలోపేతం చేయడం, చిన్నతరహా పరిశ్రమల మధ్య పోటీతత్వం పెంచడం, పంటల ఆధారిత మార్కెటింగ్ వసతులు, ఆధునాతన నిల్వ సదుపాయాలు, శీతల గిడ్డంగుల నెట్‌వర్క్ విస్తరణ కోసం సమగ్ర విధానం తేవాలని నిర్ణయించింది.
తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ద్వారా..
పరిశ్రమల శాఖ అధీనంలోని ‘తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ’(టీజీఎఫ్‌పీఎస్) ద్వారా ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించి ఫుడ్ పార్కులు, ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు బలోపేతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. బ్రాండింగ్, ప్యాకేజింగ్, మార్కెటింగ్ గ్రాంట్ల ద్వారా చిన్నతరహా ఆహార శుద్ధి పరిశ్రమలను ప్రోత్సహించి రిటైల్ విక్రయాలతోపాటు ఎగుమతులను ప్రోత్సహించనుంది. చిన్న పరిశ్రమలకు ఆర్థిక చేయూత ఇచ్చి ఈ–కామర్స్ వేదికలపై ఉత్పత్తుల విక్రయాలకు చోటు కల్పించనుంది. ప్రాసెసింగ్ యూనిట్లకు నిరంతరం కూరగాయలు, పండ్ల సరఫరా జరిగేలా 110 టన్నుల సామర్థ్యంగల మైక్రో కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందించనుంది. టీజీఐఐసీ, మార్కెటింగ్ శాఖల ద్వారా ఈ మైక్రో కోల్ట్ స్టోరేజీలకు సౌర విద్యుత్ సదుపాయం కల్పించనుంది.
బహుళ ఉత్పత్తుల ప్రాసెసింగ్ సెంటర్లు..
వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘాలు, వ్యాపారుల కోసం బహుళ ఉత్పత్తుల ప్రాసెసింగ్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేపడుతోంది. ధాన్యం, పండ్లు, కూరగాయలు, నూనె గింజలు, పాల ఉత్పత్తులు, మాంసం, చేపలను ప్రాసెసింగ్ సెంటర్లకు తరలించడం ద్వారా స్థానికంగా ఉపాధి కల్పనతోపాటు మెగా ఫుడ్ పార్కులకు ముడి సరుకుల లోటు లేకుండా సరఫరా గొలుసును బలోపేతం చేసేందుకు రైతులు, రైతు సంఘాలను అనుసంధానించనుంది.
పోషకాహార ఫుడ్ పార్కుల స్థాపన..
ఫార్మా, ఫుడ్ కంపెనీల సహకారంతో దేశంలోనే తొలిసారిగా ‘న్యూట్రాసూటికల్ ఫుడ్ పార్కులు’ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఫుడ్ పార్కుల్లో జరిగే కార్యకలాపాల కోసం యూనివర్సిటీలు, ఇతర అభివృద్ది, పరిశోధన సంస్థలు పనిచేస్తాయి. ఆహార శుద్ధి పరిశ్రమల్లో పరిశోధనలు, ఆవిష్కరణల కోసం నేషనల్ సెంటర్ ఫర్ ఫుడ్ ఇన్నోవేషన్ (ఎన్‌సీఎఫ్‌ఐ)ను ఏర్పాటు చేయడం ద్వారా ఆహార శుద్ధి రంగం బలోపేతానికి కృషి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు ఆహార శుద్ధి ఉత్పత్తుల్లో అంతర్జాతీయ స్థాయి నాణ్యతా ప్రమాణాలు పెంపొందించి ఎగుమతులను ప్రోత్సహించేందుకు టీజీఎఫ్‌పీఎస్ ద్వారా సరి్టఫికేషన్ ఇవ్వనుంది.
ఫుడ్ ప్రాసెసింగ్‌లో ఆధునిక సాంకేతికత..
మసాలా దినుసులు, పండ్లు, కూరగాయలతోపాటు ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ప్రమాణాలు పెంచేందుకు ఆధునిక ఐటీ సాంకేతికతను కూడా వినియోగించే ప్రణాళికలు సిద్ధం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పంటల సాగు, దిగుబడి, శుద్ధి దశల్లో ఏఐ, ఇతర సాంకేతికతలను మేళవిస్తూ ఆవిష్కరణలను ప్రోత్సహించే బాధ్యతను సంబంధిత శాఖలకు అప్పగించింది. రాష్ట్రంలో వివిధ పంటల సాగుకు పేరొందిన ప్రాంతాలను అనుసంధానిస్తూ వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. మామిడి, మి ర్చి, పసుపు, సోయాబీన్, కందులు, వరి, పత్తి, మొక్కజొన్న, తృణధాన్యాలు తదితరాల ప్రాసెసింగ్‌కు సంబంధించిన పరిశ్రమలు ఏర్పాటును ప్రోత్సహించనుంది.


