న్యూఢిల్లీ: పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో చోటుచేసుకున్న ఆత్మహుతి దాడి వెనుక భారత్ ఉన్నదంటూ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. ఆ దేశపు ఉన్మాద నాయకత్వం ఇలాంటి కల్పిత, తప్పుడు కథనాలను అల్లుతుందని తాము ముందే ఊహించామని వ్యాఖ్యానించింది.
ఓ కోర్టు వెలుపల జరిగిన దాడిలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. వాస్తవమేదో అంతర్జాతీయ సమాజానికి తెలుసునని విదేశాంగశాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ పేర్కొన్నారు. తప్పుదోవ పట్టించే పాకిస్తాన్ కథనాలను ఎవరూ నమ్మరన్నారు. పాక్‌లో రాజ్యాంగ స్వరూపాన్ని మార్చి వేస్తూ మిలటరీ చేతుల్లోకి అధికారాన్ని ధారదత్తం చేస్తున్న వేళ ప్రజల దృష్టిని మరల్చేందుకే ఇలాంటి నిరాధార ఆరోపణలను ప్రధాని షరీఫ్ చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ పేరుతో మరో పోస్టును సృష్టించి, ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్‌కు త్రివిధ దళాలపై తిరుగులేని అధికారాలను కట్టబెట్టేందుకు పార్లమెంట్ రాజ్యాంగ సవరణలకు ఆమోదించడంపై ప్రతిపక్షాలు తీవ్ర నిరసనలకు దిగడం తెల్సిందే.
ఇదిలా ఉండగా, దాడి తర్వాత పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్.. భారత్‌ను టార్గెట్ చేసి ఆరోపణలు చేశారు. ఇస్లామాబాద్ ఆత్మాహుతి దాడిలో 12 మంది మృతి చెందడానికి భారత్ కారణమని అన్నారు. దాడిలో ఢిల్లీ పాత్ర ఉందని కూడా ఆయన ఆరోపించారు. ఈ దాడులు పాకిస్తాన్‌ను అస్థిరపరిచే లక్ష్యంతో భారత్ రాష్ట్ర ప్రాయోజిత ఉగ్రవాదానికి కొనసాగింపు అంటూ కామెంట్స్ చేశారు. భారత్ మద్దతు ఉగ్రవాదులు ఇస్లామాబాద్‌లో దాడి చేసినప్పటికీ, ఆఫ్ఘన్ భూభాగం నుండి పనిచేస్తున్న అదే నెట్‌వర్క్ వానాలో అమాయక పిల్లలపై కూడా దాడి చేసింది.


