
అనేక దేశాల్లో ఆయుధ ఫ్యాక్టరీలు నిర్మించామంటూ ఇరాన్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఇజ్రాయెల్‌తో భీకర యుద్ధం ముగిసి రెండు నెలలు గడవకముందే ఇరాన్ ప్రకటన సంచలనం రేపుతున్నాయి. అయితే, ఆయుధ తయారీ కేంద్రాలు ఎక్కడెక్కడ నిర్మించామనే విషయాన్ని మాత్రం రహస్యంగా ఉంచింది. ఇరాన్ రక్షణ మంత్రి అజీజ్ నజీర్జాదే ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. క్షిపణి అభివృద్ధిపైనే తమ సైన్యం ప్రధాన దృష్టి పెట్టిందన్న ఆయన.. ఇటీవల ఇజ్రాయెల్‌తో జరిగిన యుద్ధంలో అత్యాధునిక క్షిపణులను మాత్రం వాడలేదంటూ చెప్పుకొచ్చారు.
పలు దేశాల్లో ఆయుధ కర్మాగారాలు ఏర్పాటు చేశాం.. త్వరలోనే వాటిని అధికారికంగా తెరుస్తామంటూ నజీర్జాదే వెల్లడించారు. గత ఏడాది కాలంలో అభివృద్ధి చేసిన క్షిపణులు అత్యాధునిక, అత్యంత శక్తిమంతమైనవిగా ఆయన పేర్కొన్నారు. 12 రోజుల యుద్ధం ఆగకపోతే.. తమ క్షిపణులను ఇజ్రాయెల్ సైన్యం అడ్డుకోలేకపోయేవని.. అందుకే అమెరికా జోక్యంతో కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించిందన్నారు.
కాగా, ఎడతెరిపిలేకుండా భీకరంగా బాంబులేసుకుంటూ పశ్చిమాసియాలో ఇజ్రాయెల్, ఇరాన్‌లు పోరుపంథాలోనే పయనించిన సంగతి తెలిసిందే. పోటాపోటీగా క్షిపణులు జారవిడుస్తూ రెండు దేశాల్లో యుద్ధం హోరాహోరిగా సాగింది. ఇజ్రాయెల్‌ను మరింత దెబ్బకొట్టేందుకు ఇరాన్ తన వద్ద పోగుబడిన క్లస్టర్ బాంబులను ప్రయోగించింది. అయితే, ఇరాన్ క్లస్టర్ బాంబుల్ని ఉపయోగించడం ఇదే తొలిసారి. ఇజ్రాయెల్‌లోని టెల్‌అవీవ్, హైఫా, బీర్‌షెబా, రెహోవోట్ నగరాలు సహా పలు ప్రాంతాలపై క్లస్టర్ బాంబులను వేయడంతో పెద్దసంఖ్యలో భవనాలు ధ్వంసమయ్యాయి. తీరప్రాంత నగరమైన హైఫాలో భవంతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి.