
భారత్ సంకల్పానికి చోదకశక్తి
బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్ వెల్లడి
2 రోజుల పర్యటన కోసం భారత్‌కు
నేడు ప్రధాని మోదీతో భేటీ
ముంబై: భారత్–యునైటెడ్ కింగ్‌డమ్(యూకే) మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ)తో భారత్‌లో వృద్ధికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని బ్రిటిష్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ చెప్పారు. 2028 నాటికి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న భారత్ సంకల్పానికి ఇదొక చోదకశక్తిగా పని చేస్తుందని అన్నారు. ప్రగతికి ఇదొక లాంచ్‌ప్యాడ్ అని వెల్లడించారు.
రెండు రోజుల భారత పర్యటన నిమిత్తం కీర్ స్టార్మర్ బుధవారం ముంబైకి చేరుకున్నారు. ఆయన వెంట 125 మంది ప్రతినిధులు సైతం వచ్చారు. వీరిలో పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, యూనివర్సిటీల వైస్ చాన్స్‌లర్లు ఉన్నారు. రోల్స్ రాయిస్, బ్రిటిష్ టెలికాం, లండన్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్, బ్రిటిష్ ఎయిర్‌వేస్, బ్రిటిష్ ఫిలిం ఇనిస్టిట్యూట్, బ్రిటిష్ ఫిలిం కార్పొరేషన్, పైన్‌వుడ్ స్టూడియోస్ వంటి దిగ్గజ సంస్థల ప్రతినిధులు సైతం ఉండడం విశేషం.
బ్రిటిష్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత స్టార్మర్ ఇండియాలో అడుగుపెట్టడం ఇదే మొదటిసారి. ఈ ఏడాది జూలైలో భారత్‌తో అతిపెద్ద వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నామని స్టార్మర్ గుర్తుచేశారు. ఈ ప్రయాణం ఇక్కడితోనే ఆగదని, ఒప్పందం అంటే కేవలం ఒక కాగితం ముక్క కాదని వ్యాఖ్యానించారు. ఒప్పందం దేశ అభివృద్ధికి లాంచ్‌ప్యాడ్‌గా పనిచేస్తుందన్నారు. భారత్‌తో తమ వాణిజ్యం మరింత వేగవంతం, సులభతరం అవుతుందన్నారు. ఈ మేరకు స్టార్మర్ ఒక ప్రకటన విడుదల చేశారు.
బ్రిటన్‌కు తిరిగొస్తున్న బాలీవుడ్
ముంబైలోని సబర్బన్ అంధేరీలో ఉన్న యశ్‌రాజ్ ఫిలింస్ స్టూడియోను కీర్ స్టార్మర్ సందర్శించారు. యశ్‌రాజ్ సంస్థ సీఈఓ అక్షయ్ విధానీ, చైర్‌పర్సన్ ఆదిత్య చోప్రా, ఆయన భార్య రాణి ముఖర్జీ తదితరులు స్టార్మర్‌ను కలిశారు. భారత సినీ నిర్మాణ సంస్థలు యూకేలో సినిమాలను చిత్రీకరించబోతున్నాయని, దీనివల్ల పెట్టుబడులు వస్తాయని, తమ దేశంలో ప్రజలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని స్టార్మర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
సినీ నిర్మాణానికి యూకే ఒక ప్రపంచ స్థాయి వేదిక అని చెప్పారు. ‘‘బాలీవుడ్ మళ్లీ బ్రిటన్‌కు తిరిగివస్తోంది. వచ్చే ఏడాది మూడు బాలీవుడ్ చిత్రాలు బ్రిటన్‌లో నిర్మాణం కానున్నాయి. దీనివల్ల మా దేశానికి లబ్ధి చేకూరుతుంది. ఇది కూడా వాణిజ్య ఒప్పందం లాంటిదే. సినిమాల చిత్రీకరణ వల్ల రెండు దేశాల మధ్య సాంస్కృతి సంబంధాలు బలపడతాయి’’ అని స్టార్మర్ తెలిపారు.
ఫుట్‌బాల్ మైదానానికి స్టార్మర్
బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్ ముంబైలోని కూపరేజ్ ఫుట్‌బాల్ గ్రౌండ్‌ను సందర్శించారు. ఆయన వెంట ప్రముఖ సాకర్ ఆటగాడు మైఖైల్ ఓవెన్ కూడా ఉన్నారు. యువ క్రీడాకారులతో, కోచ్‌లతో వారు ముచ్చటించారు.
స్టార్మర్ పర్యటన చరిత్రాత్మకం: మోదీ
భారత పర్యటనకు వచి్చన కీర్ స్టార్మర్‌కు ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతం పలికారు. ఆయన పర్యటన చరిత్రాత్మకమని ఉద్ఘాటించారు. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్టుచేశారు. గురువారం స్టార్మర్‌తో జరిగే సమావేశం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని వెల్లడించారు.