
టెహ్రాన్: ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులపై సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్‌ను అంతమొందించేందుకు గత నెలలో ఇజ్రాయెల్ ప్రయత్నించిందని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (ఐఆర్‌జీసీ) నివేదిక వెల్లడించింది. ఈ క్రమంలో ఆయన స్వల్ప గాయాలతో బయపడ్డట్లు వివరించింది.
వివరాల ప్రకారం.. జూన్ 15వ తేదీన పార్లమెంటు స్పీకర్ మహమ్మద్ ఘాలీబా, న్యాయ వ్యవస్థ చీఫ్ మొహసేనీ ఇజేయ్‌తోపాటు ఇతర సీనియర్ అధికారులు టెహ్రాన్‌లో సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశంలో ఉండగా ఇజ్రాయెల్ దాడి చేసిందని ఐఆర్‌జీసీ అనుబంధ ఫార్స్ న్యూస్ ఆదివారం తెలిపింది. ఇజ్రాయెల్ దాడుల్లో అధ్యక్షుడు మసౌద్.. స్వల్ప గాయాలతో బయపడ్డట్లు వివరించింది. ఇక, తనపై దాడిని అధ్యక్షుడు పెజెష్కియాన్ ఇటీవలే ధ్రువీకరించారు. ‘వారు ప్రయత్నించారు. కానీ విఫలమయ్యారు’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
మరోవైపు.. ఫార్స్ న్యూస్ వివరాల ప్రకారం.. ఇజ్రాయెల్ జరిపిన క్షిపణి దాడిలో పెజెష్కియాన్ కాలికి గాయమైంది. టెహ్రాన్ పశ్చిమ ప్రాంతంలోని ఓ భవనంపై ఈ దాడి జరిగింది. భవనం కింది భాగంలో ఇరాన్ అధికారులు ఉన్నారు. పేలుడు సంభవించగానే విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. అత్యవసర వ్యవస్థలను ముందుగానే సిద్ధం చేసుకోవడంతో భవనంలోని వారంతా సురక్షితంగా బయటపడ్డారు.
