
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)కు ఉన్న అభిమానగణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అద్భుతమైన ఆట తీరుతో హిట్‌మ్యాన్ కోట్లాది మంది ఫ్యాన్స్‌ను సొంతం చేసుకున్నాడు. వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు సాధించిన రోహిత్.. టీ20లలోనూ ఆకాశమే హద్దుగా చెలరేగిన విషయం తెలిసిందే.
ఇక ఐపీఎల్ (IPL)లోనూ ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించి.. జట్టును ఏకంగా ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన ఘనత రోహిత్‌కు ఉంది. క్యాష్ రిచ్ లీగ్‌లో ఈ ఫీట్ నమోదు చేసిన మొదటి సారథి కూడా ఇతడే!.. అయితే, గతేడాది ముంబై ఇండియన్స్ ఓ అనూహ్య నిర్ణయం తీసుకుంది.
రోహిత్‌పై వేటు.. పాండ్యాకు పగ్గాలు
రోహిత్‌ను తప్పించి.. అతడి స్థానంలో హార్దిక్ పాండ్యా (Hardik Pandya)ను కెప్టెన్‌గా నియమించింది. అయితే, హిట్‌మ్యాన్ అభిమానులు ఈ విషయాన్ని అంత తేలికగా జీర్ణం చేసుకోలేకపోయారు. రోహిత్‌ను పక్కనపెట్టడాన్ని విమర్శిస్తూ.. ముంబై ఇండియన్స్‌ను తప్పుబట్టడంతో పాటు హార్దిక్‌ను సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు.
పాపం హార్దిక్.. చేదు అనుభవం
అంతేకాదు.. ముంబై ఇండియన్స్ సొంత మైదానం వాంఖడేలోనూ హార్దిక్ పాండ్యాపై నేరుగానే తిట్ల వర్షం కురిపించారు. అతడిని హేళన చేస్తూ కించపరిచేవిధంగా వ్యవహరించారు. అయితే, హార్దిక్ మాత్రం ఇందుకు కౌంటర్ ఇచ్చేందుకు బదులు.. ఆటపై మరింతగా శ్రద్ధ పెట్టాడు.
కానీ ముంబై ఇండియన్స్‌ను విజయవంతంగా ముందుకు నడపలేకపోయాడు. హార్దిక్ సారథ్యంలో 2024లో ఆ జట్టు మరీ చెత్త ప్రదర్శనతో పద్నాలుగింట కేవలం నాలుగే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. అయితే, ఆ తర్వాత టీ20 ప్రపంచకప్-2024లో హార్దిక్ పాండ్యా అద్భుతంగా రాణించాడు.
వరల్డ్‌కప్ గెలిచిన వీరుడు
రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత మరోసారి రోహిత్ సారథ్యంలో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టైటిల్‌ను టీమిండియా సొంతం చేసుకోవడంలోనూ పాలుపంచుకున్నాడు.
రోహిత్ శర్మ ఫ్యాన్స్ అలా చేశారు
అయితే, 2024 నాటి ఐపీఎల్‌లో వాంఖడే వేదికగా హార్దిక్ పాండ్యా ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తాజాగా స్పందించాడు. యూపీటీ20 యూట్యూబ్ చానెల్‌తో మాట్లాడుతూ.. ‘‘అలాంటి సంఘటనలు జరిగినపుడు బీసీసీఐలోని వ్యక్తులు సదరు ఆటగాళ్లతో మాట్లాడతారు.
వారికి ధైర్యం చెబుతారు. ఆత్మవిశ్వాసం కోల్పోవద్దని సూచిస్తారు. నిజానికి హార్దిక్ విషయంలో రోహిత్ శర్మ ఫ్యాన్స్ అలా చేశారు. తమ అభిమాన ఆటగాడి స్థానంలో అతడు కెప్టెన్‌గా రావడాన్ని సహించలేకపోయారు.
హార్దిక్ పరిణతితో వ్యవహరించాడు
రోహిత్ వారినేమీ అతడిపైకి ఉసిగొల్పలేదు. అంతేకాదు.. హార్దిక్‌కు కూడా ఇలా జరుగవచ్చని ముందు నుంచే అవగాహన ఉంది. ఏదేమైనా ఆ పరిస్థితుల్లో హార్దిక్ పరిణతితో వ్యవహరించాడు. ఆ ప్రభావం తనమీద పడకుండా చూసుకున్నాడు.
భావోద్వేగాల్లో కూరుకుపోకుండా.. ఆటకు మరిన్ని మెరుగులు దిద్దుకున్నాడు. ఒక్కసారి ఆటగాళ్లు తిరిగి గొప్పగా రాణిస్తే తిట్టిన వారే.. ప్రశంసించడం మొదలుపెడతారు’’ అని రాజీవ్ శుక్లా చెప్పుకొచ్చాడు.
చదవండి: Asia Cup 2025: అదొక వింత నిర్ణయం.. కెప్టెన్ అయ్యే ప్లేయర్‌ను జట్టు నుంచి తీసేస్తారా?