
ఆసియాకప్-2025కు ఎంపిక చేసిన భారత జట్టుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌ను ఎంపికచేయకపోవడాన్ని చాలా మంది మాజీ క్రికెటర్లు తప్పుబడుతున్నారు. తాజాగా ఈ జాబితాలోకి ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్, పంజాబ్ కింగ్స్ అసిస్టెంట్ కోచ్ బ్రాడ్ హాడిన్ చేరాడు.
అయ్యర్‌ను పక్కనపెట్టడం సెలక్టర్లు తీసుకున్న ఒక వింత నిర్ణయమని హాడిన్ మండిపడ్డాడు. కాగా అయ్యర్ గత కొంత కాలంగా ఫార్మాట్‌తో సంబంధం లేకుండా దుమ్ములేపుతున్నాడు. ఐపీఎల్-2025లో కూడా అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. అయినప్పటికి ఆసియాకప్‌కు ఈ ముంబై ఆటగాడిని సెలక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు.
"శ్రేయస్ అయ్యర్‌ను ఎందుకు ఎంపిక చేయలేదో ఆర్ధం కావడం లేదు. అయ్యర్ ఒక ఆల్ ఫార్మాట్ ప్లేయర్. అతడికి అద్భుతమైన నాయకత్వ లక్షణాలతో పాటు తీవ్రమైన ఒత్తిడిలో కూడా నిలకడగా బ్యాటింగ్ చేసే సత్తా ఉంది. అతడి బ్యాటింగ్ స్టైలే వేరు. మిడిలార్డర్‌లో అతడికి మించిన ఆటగాడు మరొకరు లేరు.
తొలుత అతడి పేరు సెలక్షన్ జాబితాలో చూసి గాయపడ్డాడని అనుకున్నాను. కానీ అతడిని కావాలనే తప్పించారని తర్వాత తెలిసింది. నిజంగా ఇదొక వింత నిర్ణయం. ఎందుకంటే అయ్యర్ ఒక టీమ్ మ్యాన్. . నిజానికి అతను కెప్టెన్ అవుతాడని నేను అనుకున్నాను. అటువంటిది ఇప్పడు అతడికి జట్టులోనే చోటు దక్కలేదని" విల్లో టాక్ పాడ్‌కాస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హడిన్ పేర్కొన్నాడు.
అయ్యర్ చివరిసారిగా డిసెంబర్ 2023లో భారత్ తరపున టీ20 మ్యాచ్ ఆడాడు. 2024-25 సీజన్‌కు గాను బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో చోటు కోల్పోయిన ఈ ముంబైకర్.. ఆ తర్వాత దేశీయ టోర్నమెంట్లలో అద్బుతమైన ప్రదర్శనలు చేశాడు. దీంతో అతడు కాంట్రాక్ట్‌తో పాటు వన్డే జట్టులోకి తిరిగొచ్చాడు.
చదవండి: ఆ టోర్నీ నుంచి శుబ్‌మన్ గిల్ ఔట్.. కెప్టెన్ ఎవరంటే?