
చమురు ఉత్పత్తులపై ట్రంప్ సర్కార్‌కు తెగేసి చెప్పిన విదేశాంగ మంత్రి జైశంకర్
స్వప్రయోజనాలతో కూడిన అధికారిక వ్యాపారం మీది!
మాది వ్యాపారమంటారా?
ట్రంప్ విదేశాంగ విధానం పూర్తిగా అగమ్యగోచరం
ముందు సొంతిల్లు దిద్దుకోండి అమెరికాకు పదునైన చురకలు
న్యూఢిల్లీ: భారత్ నుంచి ముడి చమురు సహా పలు రకాల శుద్ధిచేసిన ఉత్పత్తులను కొనడం మీకు ఇబ్బంది అనుకుంటే అస్సలు కొనొద్దని ట్రంప్ సర్కార్‌కు భారత విదేశాగ మంత్రి జైశంకర్ తెగేసి చెప్పారు. ట్రంప్ పాలనాయంత్రాంగం అనుక్షణం స్వప్రయోజనాలతో వాణిజ్యంచేస్తూ భారత్ సైతం అదేపనిచేస్తుంటే తప్పుబట్టడం హాస్యాస్పదంగా ఉందని జైశంకర్ వ్యాఖ్యానించారు.
పలుదేశాలపై ఎడాపెడా పన్నుల పిడిగుద్దులు కురిపించే ట్రంప్ అవలంభించే విదేశాంగ విధానం పూర్తిగా అగమ్యగోచరంగా తయారైందని ఎద్దేవాచేశారు. ఢిల్లీలో జరుగుతున్న ‘వరల్డ్ లీడర్స్ ఫోరమ్’లో ఆయన అతిథిగా పాల్గొని పలు అంశాలపై నిర్మొహమాటంగా మాట్లాడారు. ‘‘మా సరుకు కొనాలని మీపై ఒత్తడి చేయట్లేదు కదా. మీరు భారతీయ చమురు ఉత్పత్తులను కొనకపోతే వేరే దేశాలు కొంటాయి. సరుకులను యూరప్ అమ్ముతుంది. అమెరికా కూడా అమ్ముతుంది.
భారత్ సైతం అమ్ముతుంది. మావి వద్దనుకుంటే, సమస్య అనుకుంటే కొనకుంటే సరిపోతుందికదా’’అని జైశంకర్ వ్యాఖ్యానించారు.‘అమెరికా సంప్రదాయక విదేశాంగ విధానానికి ట్రంప్ తిలోదకాలిచ్చారు. ఏ దేశం గురించి ఆయన ఏం అనుకుంటున్నారో ఎవ్వరికీ తెలీదు. అసలు ట్రంప్ సారథ్యంలో అమెరికా విదేశాంగ విధానం అగమ్యగోచరంగా, అధ్వానంగా తయారైంది. ఇలాంటి విదేశాంగ విధానాన్ని, ఇంత బాహాటంగా అమలుచేసిన అమెరికా అధ్యక్షుడిని ప్రపంచం కనీవినీ ఎరుగదు.
సొంత వ్యాపారం, వాణిజ్యం పెంచుకోవడంపైనే ట్రంప్ సర్కార్ దృష్టిపెడుతుందని అందరూ అంటారు. మరి అలాంటప్పుడు భారత్ వంటి దేశాలు రష్యా వంటి దేశాలతో వాణిజ్యం చేస్తుంటే మీకొచి్చన ఇబ్బంది ఏంటి?. మీరు చేస్తున్న పనిని వేరొకరు చేయొద్దనడం హాస్యాస్పదం. సొంతింటిని గాలికొదిలేసి పక్కింట్లో ఏం జరుగుతుందా అని ట్రంప్ యంత్రాంగం తొంగి చూస్తుంటే నవ్వొస్తోంది. ముందు మీ ఇంటిని చక్కదిద్దుకోండి’’అని ట్రంప్‌కు జైశంకర్ చురకటించారు.
మధ్యవర్తిత్వం ఉత్తిదే
‘‘మేలో ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్, భారత్ యుద్ధంలో మునిగిపోకుండా తాను ఆపానని బీరాలు పలుకుతున్న ట్రంప్ మాటల్లో ఆవగింజంత అయినా నిజం లేదు. అసలు మధ్యవర్తిత్వాన్ని భారత్ ఏనాడూ ప్రోత్సహించలేదు. గతంలోనూ తగాదా తీర్చమని ఎవ్వరినీ పెద్దమనిíÙగా పిలవలేదు. 1970వ దశకం నుంచి చూసినా గత అర్థశతాబ్దకాలంలో పాకిస్తాన్‌తో పొరపొచ్ఛాలకు సంబంధించి ఎలాంటి మధ్యవర్తిత్వాన్ని అంగీకరించకూడదని భారత్ ఏనాడో నిర్ణయించుకుంది’’అని అన్నారు.
అన్నింట్లో వైఖరి సుస్పష్టం
‘‘ప్రతి అంశానికి సంబంధించి భారత్‌కు స్పష్టమైన విధానముంది. అమెరికా 50 శాతం టారిఫ్‌లు విధించినాసరే ఎలాంటి వాణిజ్య ఒప్పందాల్లోనైనా మన రైతుల ప్రయోజనాలే భారతప్రభుత్వానికి అత్యున్నతం. వ్యూహాత్మక వాణిజ్యం మొదలు రక్షణ, టారిఫ్‌లు, మధ్యవర్తిత్వం దాకా ప్రతి అంశంలో భారత్ స్వీయప్రయోజనాలకే విలువ ఇస్తుంది. అమెరికాతో వాణిజ్య ఒప్పందానికి సంబంధించి అమెరికా ప్రతినిధి బృందంతో ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి.
సాగు, డెయిరీ ఉత్పత్తుల విషయంలో రైతుల ప్రయోజనాలు, సూక్ష్మ,చిన్న,మధ్యతరహా పరిశ్రమల పరిరక్షణకు భారత్ పట్టుబట్టడంతో ఈ అంశాల్లో ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతోంది’’అని జైశంకర్ అన్నారు. పన్నుల భారం మోపడంతో అమెరికా సత్సంబంధాలు సన్నగిల్లి కొత్తగా చైనాతో బంధం కాస్తంత బలపడిందన్న వాదనను ఆయన కొట్టిపారేశారు. ‘‘ఒక సందర్భాన్ని వేరొక సందర్భంతో పోల్చిచూసి తుది నిర్ణయానికి, అంచనాకు రావడం సబబుకాదు’’అని వ్యాఖ్యానించారు.