
దూకుడైన బ్యాటింగ్‌కు పెట్టింది పేరు వీరేందర్ సెహ్వాగ్ (Virender Sehwag). ఈ విధ్వంసకర ఓపెనర్ క్రీజులో ఉన్నాడంటే బౌలర్లకు చుక్కలే. సునిల్ గావస్కర్ (Sunil Gavaskar) తర్వాత టీమిండియాకు దొరికిన అత్యుత్తమ టెస్టు ఓపెనర్లలో సెహ్వాగ్ ఒకడు. పాకిస్తాన్ గడ్డపై 2004లో ట్రిపుల్ సెంచరీ బాదిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఈ ఫీట్ సాధించిన భారత తొలి క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు.
టీమిండియా స్టార్లకు చేదు అనుభవాలు
అయితే, ప్రతీ ఆటగాడి కెరీర్‌లాగే సెహ్వాగ్ కెరీర్‌లోనూ ఎత్తుపళ్లాలు ఉన్నాయి. 2005- 06 మధ్యకాలంలో పరుగులు రాబట్టడంలో వీరూ కాస్త తడబడ్డాడు. ఆ సమయంలోనే టీమిండియా హెడ్‌కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ గ్రెగ్ చాపెల్ (Greg Chappell) వచ్చాడు. అపుడే సౌరవ్ గంగూలీని కెప్టెన్సీ నుంచి, జట్టు నుంచి తప్పించడం జరిగాయి.
హర్భజన్ సింగ్, వీవీఎస్ లక్ష్మణ్ తదితరులు కూడా చాపెల్ వ్యవహారశైలితో నొచ్చుకున్నట్లు వార్తలు వచ్చాయి. తనకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైందని సెహ్వాగ్ తాజాగా వెల్లడించాడు. అయితే, తాను ఆటతోనే అతడి నోరు మూయించానంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
గతం నాకు అనవసరం
‘‘అప్పట్లో నేను పరుగులు రాబట్టేందుకు చాలా ఇబ్బందిపడ్డాను. అపుడు గ్రెగ్ చాపెల్ అన్న మాటలు నన్ను బాధించాయి. ‘నువ్వు కాలు కదపనంత వరకు పరుగులు రాబట్టలేవు’ అని నాతో అన్నాడు. అందుకు బదులుగా.. ‘గ్రెగ్.. నేను టెస్టుల్లో 50కి పైగా సగటుతో ఇప్పటికే 6000 పరుగులు సాధించాను’ అని చెప్పాను.
ఇందుకు స్పందిస్తూ.. ‘నువ్వు గతంలో ఏం చేశావో నాకవసరం లేదు. నీకు మళ్లీ అదే మాట చెబుతున్నా. నువ్వు కాలు కదిపితేనే పరుగులు వస్తాయి’ అన్నాడు. దీంతో మా ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది.
జట్టు నుంచి నిన్ను తప్పిస్తా.. నువ్వేం చేసుకుంటావో చేసుకో
అప్పుడు కెప్టెన్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్ వచ్చి మమ్మల్ని విడదీయాల్సి వచ్చింది. ఆ మరుసటి రోజు నేను బ్యాటింగ్‌కు వెళ్తున్న సమయంలో.. ‘నువ్వు ఈరోజు కచ్చితంగా పరుగులు చేయాలి. లేదంటే.. జట్టు నుంచి నిన్ను తప్పిస్తా’ అని గ్రెగ్ నాతో అన్నాడు.
‘నువ్వేం చేసుకుంటావో చేసుకో’ అని నేను బదులిచ్చాను. ఓ ఆటగాడు బ్యాటింగ్‌కు వెళ్తున్న సమయంలో కోచ్ నుంచి వచ్చే ఇలాంటి మాటలు ఎలాంటి ప్రభావం చూపుతాయన్న అంశం మీద అతడికి కాస్తైనా అవగాహన లేదు.
ఆరోజు నాకు స్ట్రైక్ రాగానే బంతిని బాదడం మొదలుపెట్టాను. భోజన విరామ సమయానికి ముందు నేను 99 పరుగుల వద్ద ఉన్నాను. అపుడు డ్రెసింగ్‌రూమ్‌లోకి వెళ్తుంటే ద్రవిడ్ అక్కడే నిల్చుని ఉన్నాడు.
నా దరిదాపుల్లోకి కూడా రావొద్దని మీ కోచ్‌కు చెప్పు
నేను తనను పిలిచి.. ‘నా దరిదాపుల్లోకి కూడా రావొద్దని మీ కోచ్‌కు చెప్పు’ అని అన్నాను. లంచ్ తర్వాత తిరిగి వచ్చి 180 పరుగులు పూర్తి చేసుకున్నాడు. అప్పుడు ఓ మూలన నిల్చుని ఉన్న గ్రెగ్ వైపు ఓ లుక్కేశాను.
‘నా కాలు కదిపినా.. కదపకపోయినా.. పరుగులు ఎలా చేయాలో మాత్రం నాకు తెలుసు’ అని మరోసారి అతడితో అన్నాను’’ అని సెహ్వాగ్ గత జ్ఞాపకాలను లైఫ్ సేవర్ పాడ్‌కాస్ట్‌లో పంచుకున్నాడు. అయితే, ఇందులో సెహ్వాగ్ సదరు మ్యాచ్ ఏదో చెప్పలేదు. అయితే, భారత్- వెస్టిండీస్ మధ్య 2006 నాటి టెస్టు సందర్భంగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
ఆనాటి మ్యాచ్‌లో సెహ్వాగ్ 180 పరుగులు చేయగా.. ద్రవిడ్ 140, మహ్మద్ కైఫ్ 148 పరుగులు (నాటౌట్) సాధించారు. ఈ క్రమంలో 588/8 వద్ద భారత్ తమ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అయితే, ఈ మ్యాచ్ డ్రాగా ముగిసిపోయింది. కాగా తన కెరీర్‌లో 104 టెస్టులు ఆడిన సెహ్వాగ్ 8586 పరుగులు సాధించాడు.
చదవండి: పాపం హార్దిక్ పాండ్యా!.. బీసీసీఐ ఉపాధ్యక్షుడి కామెంట్స్ వైరల్