
94 శాతం కంపెనీలు సానుకూలం
ద్వితీయార్ధంపై నౌకరి అంచనా
ముంబై: కార్యాలయ ఉద్యోగ నియామకాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ ఆరు నెలల్లో పెరగొచ్చని నౌకరీ ‘హైరింగ్ సర్వే’ తెలిపింది. కొత్త ఉద్యోగాల సృష్టి ద్వారా నియామకాలు చేపట్టనున్నట్టు 72 శాతం సంస్థలు సర్వేలో భాగంగా తెలిపాయి. మొత్తం మీద 94 శాతం కంపెనీలు ద్వితీయ ఆరు నెలల్లో నియమకాల పట్ల సానుకూలత వ్యక్తం చేశాయి. 1,300 కంపెనీల అభిప్రాయాలను సర్వేలో భాగంగా నౌకరీ తెలుసుకుంది.
ఏఐ కారణంగా ఉద్యోగాల నష్టం ఏర్పడుతుందన్న ఆందోళనలు నెలకొన్నప్పటికీ.. 87 శాతం కంపెనీలు ఉపాధిపై ఏఐ ప్రభావం లేదని చెప్పాయి. ఇక 13 శాతం సంస్థలు ఏఐ కొత్త ఉద్యోగాల కల్పనకు ప్రేరణగా పేర్కొన్నాయి. ఐటీ రంగంలో 42 శాతం, అనలైటిక్స్‌లో 17 శాతం, బిజినెస్ డెవలప్‌మెంట్‌లో 11 శాతం మేర కంపెనీలు ఏఐ ఆధారిత కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నాయి. ప్రత్యేక నైపుణ్యాలున్న వారికి డిమాండ్ నియామకాలకు మద్దతుగా నిలుస్తున్నట్టు నౌకరీ తెలిపింది. సర్వేలో పాల్గొన్న కంపెనీల్లో 37 శాతం ఐటీ పోస్ట్‌లకు నియామకాలు చేపట్టనున్నట్టు తెలిపాయి.
సంప్రదాయ ఐటీ విధుల కంటే అత్యాధునిక టెక్నాలజీలకు సంబంధించి నిపుణుల నియామకాలకు కంపెనీలు సానుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా మెషిన్ లెరి్నంగ్, డేటా సైన్స్, ఏఐ నిపుణులకు డిమాండ్ నెలకొంది. 4–7 ఏళ్ల అనుభవం ఉన్న వారికి డిమాండ్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే 47 శాతం కంపెనీలు సీనియర్లనే తీసుకోవాలని చూస్తున్నాయి. ఆరంభ స్థాయి ఉద్యోగుల నియామకాల పట్ల 29 శాతం కంపెనీలు సానుకూలంగా ఉన్నాయి. 8–12 ఏళ్ల అనుభవం ఉన్న వారి కోసం 17 శాతం సంస్థలు చూస్తున్నాయి.
కొత్త ఉద్యోగాల కల్పన సానుకూలం..
‘‘72 శాతం కంపెనీలు ఖాళీలను భర్తీ చేసుకోవడం కంటే కొత్త ఉద్యోగాలను సృష్టించి, భర్తీ చేసుకోవాలని చూస్తుండడం ఉత్సాహాన్నిస్తోంది. ఇక 87 శాతం సంస్థలు ఏఐ కారణంగా ఉద్యోగాల నష్టం ఉండదని భావిస్తున్నాయి. ఏఐ ఉద్యోగ కోతలకు దారితీస్తుందంటూ అంతర్జాతీయంగా నెలకొన్న అభిప్రాయాలకు ఇది విరుద్ధంగా ఉంది’’అని నౌకరీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ పవన్ గోయల్ వివరించారు.