కార్యాలయ ఉద్యోగ నియామకాలు (వైట్ కాలర్) అక్టోబర్ నెలలో తగ్గుముఖం పట్టాయి. క్రితం ఏడాది ఇదే నెలలో నియామకాలతో పోల్చి చూస్తే 9 శాతం తగ్గినట్టు నౌకరీ జాబ్‌స్పీక్ ఇండెక్స్ నివేదిక వెల్లడించింది. దసరా – దీపావళి పండుగ సెలవులు నియామకాలపై ప్రభావం చూపించినట్టు తెలిపింది. కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు, నియామక సంస్థల శోధన ఫలితాల ఆధారంగా ‘నౌకరీ డాట్ కామ్’ ప్రతి నెలా జాబ్‌స్పీక్ ఇండెక్స్ నివేదికను విడుదల చేస్తుంటుంది.
అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్, విద్య, బీపీవో/ఐటీఈఎస్ రంగాల్లో నియామకాలు సానుకూల వృద్ధిని చూశాయి. అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్‌లో 15 శాతం పెరగ్గా.. విద్యా రంగంలో 13 శాతం, బీపీవో/ఐటీఈఎస్‌లో 6 శాతం చొప్పున అధికంగా నియామకాలు జరిగాయి.
విద్యా నియామకాల పరంగా హైదరాబాద్‌లో అత్యధికంగా 47 శాతం వృద్ధి కనిపించింది. ఆ తర్వాత చైన్నైలో 34 శాతం, బెంగళూరులో 31 శాతం చొప్పున పెరిగాయి.
కృత్రిమ మేథ(ఏఐ) మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్) నిపుణులకు డిమాండ్ క్రమంగా పెరుగుతూనే ఉంది. అక్టోబర్‌లో వీటికి సంబంధించి నియామకాలు 33 శాతం పెరిగాయి. ముఖ్యంగా మెషిన్ లెర్నింగ్ నియామకాలు వరకే చూస్తే 139 శాతం వృద్ధి కనిపించింది. వివిధ రంగాల్లో పెరుగుతున్న ఏఐ నిపుణుల అవసరాలను ఇది తెలియజేస్తోంది.
ఐటీ రంగంలో 15 శాతం, బ్యాంకింగ్‌లో 24 శాతం చొప్పున అక్టోబర్‌లో నియామకాలు తగ్గాయి. ముఖ్యంగా ఐటీ రంగంలో బ్లాక్‌చైన్, క్రిప్టోకరెన్సీ వంటి టెక్నాలజీలపై పనిచేసే కంపెనీల్లో నియామకాలు 60 శాతం అధికంగా నమోదయ్యాయి.
సెర్చ్ ఇంజనీర్లకు 62 శాతం డిమాండ్ అధికంగా కనిపించింది. మెడికల్ బిల్లర్/కోడర్‌కు 41 శాతం, ట్రాన్సిషన్ మేనేజర్లకు 35 శాతం, తయారీ ఇంజీనర్లకు 32 శాతం చొప్పున డిమాండ్ నెలకొంది.
👉 ఇది చదివారా? ‘నెల జీతాల ఉద్యోగాలు ఉండవ్..’


