‘నెల జీతాల ఉద్యోగాలు ఉండవ్‌..’ | Forget monthly salary Saurabh Mukherjea warns middle class of jobless future | Sakshi
Sakshi News home page

‘నెల జీతాల ఉద్యోగాలు ఉండవ్‌..’

Nov 3 2025 2:06 PM | Updated on Nov 3 2025 2:18 PM

Forget monthly salary Saurabh Mukherjea warns middle class of jobless future

దేశంలో నెల జీతాల ఉద్యోగాలు ఉండబోవంటూ ఆర్థిక నిపుణుడు చేసిన హెచ్చరిక కలవరపెడుతోంది. భారతదేశ వైట్ కాలర్ జాబ్ యంత్రం ఆగిపోయే దశకు వచ్చిందని మార్సెల్లస్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్స్ వ్యవస్థాపకుడు, చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ సౌరభ్ ముఖర్జియా హెచ్చరిస్తున్నారు. ఆయన మాటల్లో చెప్పాలంటేభారతదేశంలో స్థిరమైన జీతం పొందే ఉపాధి యుగం ముగుస్తోంది”

ఇటీవలి పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన ముఖర్జియా.. “ఉపాధి వృద్ధి ప్రధానంగా ఆగిపోయింది. ఈ పరిస్థితి కనిపించడమే కాదు.. కోలుకోలేనిదిగా ఉంది” అన్నారు. గత ఐదేళ్లలో వైట్ కాలర్ ఉద్యోగాల పెరుగుదల తక్కువగా ఉండటమే కాక, భవిష్యత్తులో కూడా వాటి పునరుజ్జీవనం “దాదాపు అసంభవం” అని ఆయన అభిప్రాయపడ్డారు.

కారణం ఆటోమేషన్..

ఈ పరిణామానికి ప్రధాన కారణాలు ఆటోమేషన్, కార్పొరేట్ సామర్థ్యం. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, టైటాన్, ఏషియన్ పెయింట్స్ వంటి పెద్ద కంపెనీలు, ఇప్పుడు ఉద్యోగులను పెంచుకోకుండానే తమ వ్యాపారాన్ని విస్తరించగలుగుతున్నాయి. “ఈ కంపెనీలు పెద్ద సంఖ్యలో ఉద్యోగావకాశాలు సృష్టించే అవకాశం చాలా తక్కువ. ఆటోమేషన్ వల్ల ఉద్యోగుల సంఖ్యను పెంచకుండానే ఎదగడం సాధ్యమవుతోంది” అని సౌరభ్ ముఖర్జియా అన్నారు

గ్రాడ్యుయేట్ల వెల్లువ.. అవకాశాల కొరత

ప్రతి సంవత్సరం సుమారు 80 లక్షల మంది కొత్త గ్రాడ్యుయేట్లు భారత శ్రామికశక్తిలోకి ప్రవేశిస్తున్నారు. కానీ వీరికి తగిన అవకాశాలు ఉండటం లేదు. “అధికారిక కార్పొరేట్ నిర్మాణం లేకుండా ఈ కొత్త తరం యువతకు జీవనోపాధి కల్పించడం ఎలా అన్నదే దేశం ఎదుర్కొనే సవాలు” అని ఆయన చెప్పారు. రానున్న సంవత్సరాల్లో దేశంలో పని విధానం పూర్తిగా మారిపోతుందని సౌరభ్ ముఖర్జియా హెచ్చరించారు.

గిగ్ ఎకానమీ వైపు ప్రయాణం

సాంప్రదాయ వేతన ఉద్యోగాలు వేగంగా తగ్గిపోతాయనేది సౌరభ్ ముఖర్జియా అంచనా. “డ్రైవర్లు, కోడర్లు, పాడ్‌కాస్టర్లు, ఫైనాన్షియల్ అడ్వైజర్లు అందరూ స్వయం ఉపాధి వైపు వెళ్తున్నారు,” అని ఆయన చెప్పారు. “మనం గిగ్ ఉద్యోగాల ప్రపంచంలోకి అడుగుపెడుతున్నాం. జీతం ఆధారిత ఉపాధి యుగం చరిత్రలో కలిసిపోతోంది” అన్నారు.

గిగ్ఎకానమీ భారత్కు కలిసివస్తుందని ముఖర్జియా ఆశాజనకంగా కూడా ఉన్నారు. 29 సంవత్సరాల సగటు వయస్సు ఉన్న యువ జనాభా, ప్రపంచంలోనే చౌకైన మొబైల్ బ్రాడ్‌బ్యాండ్, అలాగే ఆధార్, యూపీఐ వంటి డిజిటల్ వ్యవస్థలు.. ఇవన్నీ భారత్‌ను “గిగ్ ఎకానమీ” యుగంలో బలంగా నిలబెడతాయని ఆయన నమ్మకం.

సాంప్రదాయ వైట్ కాలర్ ఉద్యోగాలు సవాలుగా మారతాయి. మన జీవితంలో ఎక్కువ భాగం గిగ్ కార్మికులుగా గడపాల్సిన భవిష్యత్తు కోసం మనమూ, మన పిల్లలూ సిద్ధం కావాలి” అని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement