
తీవ్రస్థాయి నిర్ణయాలకు జైకొడుతున్న యువత
క్రీట్ (గ్రీస్): తొమ్మిది నెలల క్రితం అమెరికాలో జరిగిన ఒక హత్య మిగతా అన్ని నేరాల మాదిరిగా ఒకటి, రెండు రోజులు మీడియాలో పతాకశీర్షికలకెక్కి కనుమరుగుకాలేదు. హత్య చేసిన హంతకుడిని శిక్షించాలనే డిమాండ్లకు బదులు అతడిని కీర్తిస్తూ లక్షలాది మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతు పలకడం యావత్ ప్రపంచాన్ని విస్మయపరిచింది. హత్యను ఖండించాల్సిందిపోయి అతడికి బెయిల్ ఇవ్వాల్సిందేనని ఆన్‌లైన్‌లో ఒక ఉద్యమమే మొదలైంది.
2024 డిసెంబర్‌లో అమెరికాలో అత్యంత సంపన్న ఆరోగ్యబీమా సంస్థ అయిన ‘యునైటెడ్ హెల్త్‌కేర్’సీఈఓ బ్రియాన్ థాంప్సన్‌ను షూట్‌చేసి చంపేసిన లిగి మాంజియోన్ అనే యువకుడి గురించే ఇదంతా. హత్య వంటి తీవ్రస్థాయి హింసను ఒక సగటు మనిషి తప్పుబట్టాల్సిందిపోయి వెనకేసుకురావడం వెనకున్న అంతరార్థం ఏమిటనే దానిపై ఇప్పుడు మానసిక వైద్యరంగంలో చర్చమొదలైంది.
పనిచేసే చోట నెలకొన్న తీవ్రస్థాయి ఒత్తిడి వాతావరణమే యువత మానసిక అలసటకు గురై, పట్టరాని కోపం, అసహనం, ఉద్రేకం దిశగా పయనింపజేస్తోందని పలువురు మనోవిజ్ఞాన శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. థాంప్సన్‌ను హత్యచేయడం సబబేనని ఆన్‌లైన్‌లో నిర్వహించిన సర్వేలో 41 శాతం యువత వ్యాఖ్యానించడం మారుతున్న యువత ఆలోచన ధోరణులకు అద్దంపడుతోందని మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞలు చెబుతున్నారు.
అవినీతి, దురాశపై పట్టరాని కోపం
తాము పనిచేసే సంస్థలో జరిగే అవినీతి, సంస్థ ఉన్నతాధికారులు, యాజమాన్యం దురాశను నేటి యువత ఏమాత్రం సహించట్లేదు. తీవ్రస్థాయి పని ఒత్తిడి, అనుక్షణం మారుతున్న సంస్థలో పని విధానాలు, ఆధునిక పని వాతావరణం సైతం యువతలో అసంతృప్తి జ్వాలలను రాజేస్తూ చివరకు వారిలో పట్టరాని ఆవేశాన్ని మరింత ఎగదోస్తోంది. అన్ని రంగాలకు సంబంధించి యువ ఉద్యోగులు, కార్మికుల మనసులో గూడు కట్టుకుంటున్న అసంతృప్తి తాలూకు వివరాలతో ఏపీఏ ‘సైకాలజీ ఆఫ్ వయలెన్స్’జర్నల్ ‘హింస్మాతక పిడివాదం’పేరిట ప్రత్యేక సంచికను వెలువర్చింది. గ్రీస్‌లోని క్రెటే విశ్వవిద్యాలయంలోని ప్రొఫెసర్ అలెక్సియోస్ అర్వాంటిస్ సారథ్యంలో ఈ పరిశోధన జరిగింది.
ఎన్నింటికో దారి తీస్తున్న మానసిక అలసట
పనిప్రదేశంలో విపరీతమైన ఒత్తిడి కారణంగా మానసిక అలసట పెరిగిపోయి చివరకు భ యం, బాధ, అసంతృప్తి, అసహనం కట్టలు తెంచుకుంటున్నాయి. తమకు అన్యాయం జరి గిపోతోందనే భావన యువతలో పెరిగిపోతోంది. దీంతో అన్యాయానికి హింసతోనే ముగింపు పలకాలనే ధోరణి ఎక్కువవుతోంది. అధ్యయనంలో భాగంగా పరిశోధకులు వందలాది మంది యువ ఉద్యోగుల రోజువారీ మానసిక స్థితిని అంచనావేశారు. మానసిక అలసట, మానసిక స్థితి, హింసాత్మక ఆలోచన స్థాయిలను క్రీడీకరించారు. అతిగా మానసికంగా అలసిపోయినప్పుడు తీవ్రస్థాయి ఆలోచనలు మంచివేనన్న భావన వారిలో పెరిగిపోతోంది. అన్యాయాన్ని అంతమొందించాలంటే హింసే అత్యుత్తమ మార్గమని వాళ్లు భావిస్తున్నారు. ప్రతిరోజూ ఇలాగే మానసిక అలసటకు గురైతే ఆ స్థాయిలో వారిలో బాధ ఎక్కువవుతోంది. వీటిని మూడురకాల సిద్ధాంతాలతో వర్గీకరించవచ్చని మానసిక నిపుణులు చెబుతున్నారు.
సాధారణ బాధ సైతం...
సాధారణ బడలిక సిద్ధాంతం ప్రకారం ప్రతిరోజూ అతిపనితో విసిగిపోయిన సందర్భాల్లో ప్రతికూల ఆలోచనలు వెల్లువెత్తుతాయి. ఇక రెండోసిద్ధాంతం ప్రకారం.. చేస్తున్న పనిలో సంతృప్తిలోపించినప్పుడు సైతం మానసిక అలసట, విసుగు పెరుగుతాయి. ఇక మూడో సిద్ధాంతం ప్రకారం తాము ఎంతగా కష్టపడుతున్నా సరైన ప్రాధాన్యత, ఉన్నతాధికారుల నుంచి ప్రశంస దక్కని సందర్భాల్లోనూ మానసి అలసట ఎక్కువై చివరకు హింసాత్మక ఆలోచనలు ఆ యువ ఉద్యోగులను చుట్టుముడుతున్నాయి. ఈ మూడు రకాల సందర్భాల్లోనూ మెజారిటీ యువత తమ వృత్తిలో తమకు సరైన గౌరవం దక్కనప్పుడు, తమ శ్రమకు తగ్గ ఫలితం లభించనప్పుడు తమకు నచి్చన మార్గంలో సంతృప్తి సాధించేందుకు హింసాత్మక ఆలోచనలకు జై కొడుతున్నారని సర్వేలో తేలింది.
వ్యవస్థీకృత మార్పుతో..
ఈ పెడపోకడలపై బహుళజాతి అంతర్జాతీయ సంస్థలు తక్షణం మేల్కొనాలి. సంస్థ అభ్యున్నతి కోసం అవిశ్రాంతంగా కష్టపడుతున్న ఉద్యోగులకు తగు ప్రాధాన్యతనిస్తే తోటి ఉద్యోగుల్లో సైతం సంస్థ పట్ల గౌరవం, వారిలో అంకితభావం అనూహ్యంగా పెరుగుతాయి. అప్పుడు ఇలాంటి హింసాత్మక ఆలోచనల వైపు యువత అస్సలు మళ్లదు. అప్పుడు మానసిక అలసట అనే ఊసే ఉండదు. పనిచేసే చోట పారదర్శకత కనిపించేలా చేయడం సంస్థల విద్యుక్తధర్మం.
తాము ఎంతగా సంస్థ కోసం కష్టపడినా గౌరవం దక్కట్లేదని భావించే వారిని మేనేజర్లు వీలైనంత త్వరగా గుర్తించి దిద్దుబాటు చర్యలు చేపడితే మొత్తం సంస్థలోనే ప్రతికూలవాతావరణం అనేది మటుమాయం అవుతుంది. ఆ మేరకు ఉన్నతాధికారులు, మేనేజర్లకు సైతం శిక్షణనివ్వాలి. కేవలం సంస్థలో ఉన్నప్పుడు ఉద్యోగి పడే ఆవేదనగా దీనిని తేలిగ్గా తీసుకుంటే మొత్తం సమాజంపైనే ఇది చాన్నాళ్ల తర్వాత ప్రతికూల ప్రభావం చూపుతుంది.
సంస్థల దురాశపై ధ్వజమెత్తాలనే పెడపోకడలు ఎక్కువై విప్లవవాదం మరింతగా సమాజంలో వేళ్లూనుకుంటుంది. మానసిక అలసటకు గురైన ఉద్యోగి తమ సంస్థ నుంచే సాంత్వన కోరుకుంటాడు. అక్కడి అది దక్కని నాడు సంస్థ మాత్రమే కాదు సమాజం సైతం దాని దుష్ప్రభావాలను ఎదుర్కోక తప్పదని మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు.
హింసాత్మకం.. సాధారణం
తమ పరిశోధనపై వైద్యనిపుణులు మరో స్పష్టతనిచ్చారు. ‘‘యువతలో మానసిక అలసటకు గురైన ప్రతి ఒక్కరూ ఇలా హింసాత్మక మార్గంలో పయనిస్తున్నారని మేం చెప్పట్లేదు. కానీ ఆ దిశగా అడుగులేసే అవకాశాలు బాగా పెరుగుతున్నాయనేది సుస్పష్టం. ఇది చివరకు హింసాత్మకంగా వ్యవహరించం తప్పు కాదు అనే స్థాయికి యువత ఆలోచన ధోరణి నెమ్మది నెమ్మదిగా మారుతోంది. ఇది అత్యంత ఆందోళనకరం’’అని నిపుణులు ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘నేడు ప్రతి నలుగురిలో ముగ్గురు అతి పనిఒత్తిడి బారిన పడుతున్నారు. దీంతో శ్రామికలోకంలో మెజారిటీ యువత తమకు తెలీకుండానే అతివాదానికి మద్దతుపలుకుతోంది.
అధిక పనిఒత్తిడి కారణంగా మానసికఅలసటకు గురైన వారిలో చాలా మందిలో అసహనం పెరిగిపోతోంది. దీంతో విధ్వంసకర ఆలోచనలు మొగ్గ తొడుగుతున్నాయి. ఇవి ప్రజాస్వామ్యయువత విలువలు, చక్కటి, సుహృద్భావ పనివాతావరణానికి గొడ్డలిపెట్టుగా మారుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చూస్తే పనిఒత్తిడి కారణంగా హింసాత్మక ఘటనలు చాలా అత్యల్పస్థాయిలో ఉన్నప్పటికీ వాటి దు్రష్పభావాలు మాత్రం స్థిరంగా పెరుగుతూ పోతున్నాయి’’అని మనోవిజ్ఞాన శాస్త్ర నిపుణులు అభిప్రాయపడ్డారు.