
అహ్మదాబాద్: ఇజ్రాయెల్ యుద్ధంతో పూర్తిగా దెబ్బతిన్న గాజాలోని పేదల కోసం భారత్‌లోని వివిధ మసీదుల నుండి నిధులు సేకరిస్తున్న సిరియన్ జాతీయుడిని గుజరాత్‌లోని అహ్మదాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. అతనికి సహకరిస్తూ వస్తున్న మరో ముగ్గురు సిరియన్ పౌరులు పరారయ్యారు. పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు.
నిందితునితో పాటు అతని సహచరులు గాజా బాధితుల పేరుతో విరాళాలు సేకరించి, ఆ డబ్బును వారి విలాసవంతమైన జీవితం కోసం ఖర్చు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీనికితోడు వారు ఏదో ఒక ప్రయోజనం కోసం రెక్కీ నిర్వహించడానికి నగరంలో తిష్ట వేశారనే అనుమానాలున్నాయని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఈ ఉదంతంలో ఎల్లిస్ బ్రిడ్జ్ ప్రాంతంలోని ఒక హోటల్ నుండి అలీ మేఘత్ అల్-అజార్ (23) ను అరెస్టు చేసినట్లు క్రైమ్ బ్రాంచ్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శరద్ సింఘాల్ మీడియాకు తెలిపారు. ఇదే హోటల్‌లో అనుమానిత సిరియస్లు జకారియా హైతం అల్జార్, అహ్మద్ అల్హబాష్, యూసఫ్ అల్-జహర్ బసచేసినట్లు పోలీసులు కనుగొన్నారు.
‘ఒక నిఘా సమాచారం ఆధారంగా మేము డమాస్కస్ నివాసి అయిన అల్-అజార్‌ను అరెస్టు చేశాం. అతని వద్ద నుండి 3,600 అమెరికన్ డాలర్లు, రూ. 25,000 నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. అతని అరెస్టు తర్వాత మిగిలిన ముగ్గురు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అయితే వారు దేశం నుండి పారిపోకుండా ఉండేందుకు వారిపై లుక్-అవుట్ నోటీసు జారీ చేశాం. ఈ నలుగురు సిరియన్లు పర్యాటక వీసాలపై దేశానికి వచ్చి జూలై 22న కోల్‌కతాలో దిగారు. ఆగస్టు 2న వారు అహ్మదాబాద్ చేరుకున్నారు.
వారు స్థానిక మసీదుల నిర్వహకులను సంప్రదించి, గాజాలో ఆకలితో అలమటిస్తున్న వారి వీడియోలను చూపిస్తూ విరాళాలు సేకరించారు. గాజాలోని పేద లకు ఆహారం అందించేందుకు, నిధులు సేకరిస్తున్నామని వారు చెప్పేవారు. అయితే వారు గాజాకు నిధులు పంపుతున్నట్లు ఎటువంటి ఆధారాలు దొరకలేదు’ అని అని శరద్ సింఘాల్ తెలిపారు. కాగా గుజరాత్ ఉగ్రవాద నిరోధక దళం, జాతీయ దర్యాప్తు సంస్థతో కలిసి అహ్మదాబాద్ పోలీసుల క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఆ సిరియన్లు గుజరాత్‌కు రావడం వెనుక ఉన్న ఖచ్చితమైన ఉద్దేశ్యం ఏమిటి? స్థానిక మసీదుల నుండి సేకరించిన నిధులను ఎక్కడికి పంపారనే దానిపై దర్యాప్తు చేపట్టారు.
నిందితుల కదలికలు, సంబంధాల గురించి మరింత తెలుసుకునేందుకు వారు బస చేసిన ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌లను స్కాన్ చేస్తున్నామని ఒక అధికారి తెలిపారు. ప్రాథమికంగా.. వారు రెక్కీ చేయడానికే ఇక్కడకు వచ్చారని, కొంతమంది అనుమానాస్పద వ్యక్తులతో సంప్రదింపులు జరుపుతున్నారని తెలుస్తోందని ఆయన తెలిపారు. అరెస్టయిన సిరియన్ జాతీయుడు, అతని సహచరులు పర్యాటక వీసా షరతులను ఉల్లంఘించారన్నారు. విచారణ సమయంలో నిందితుడు తమ విలాసవంతమైన జీవనశైలి కోసం ఈ నిధులు ఖర్చుపెడుతున్నట్లు తెలిపారు.