
ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న లారీ
మూడు నెలల చిన్నారి సహా తల్లి మృతి
బాబు పుట్టాడని పిన్ని ఇంటికి నిద్ర చేయడానికి వచ్చిన బాలింత
ఎన్టీఆర్ జిల్లా: కొడుకు పుట్టాడని చిన్నమ్మ ఇంట్లో నిద్ర చేయటానికి వచ్చిన ఓ బాలింత, మూడు నెలల కుమారుడు శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయారు. రోడ్డు ప్రమాదంలో తల్లీకుమారుడు దుర్మరణం చెందగా మరొక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. విషాద ఘటన శుక్రవారం ఎనీ్టఆర్ జిల్లా కంచకచర్ల మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రం ఎ.కొండూరుకు చెందిన నాగబత్తుల చైతన్యకు విజయవాడకు చెందిన నవీన్‌తో ఏడాది క్రితం వివాహమైంది. అతను విజయవాడలోని ఓ సినిమా థియేటర్‌లో పని చేస్తుంటాడు. వారికి మగ బిడ్డ పుట్టగా ఆర్జిక్ చైతన్య అని నామకరణం చేశారు.
చైతన్య కంచికచర్ల మండలం కీసరలో నివసిస్తున్న పిన్ని ఇంట్లో నిద్రచేసేందుకు మూడు నెలల బాబుతో కలసి బస్సులో వచ్చింది. కీసర సెంటర్‌లో బస్సు దిగానంటూ పిన్నికి ఫోన్ చేసింది. ఆమె చైతన్యను తీసుకురావాల్సిందిగా పొరుగింట్లో ఉండే శ్రీకాంత్ అనే వ్యక్తిని కోరింది. వెంటనే బస్టాప్‌నకు వెళ్లిన శ్రీకాంత్ తల్లీబిడ్డను బైక్‌పై ఎక్కించుకుంటున్నాడు. అదే సమయంలో విజయవాడ వైపు నుంచి హైదరాబాద్ వైపునకు వేగంగా వెళ్తున్న లారీ వీరి బైక్‌ను ఢీకొట్టింది.
ఘటనలో చిన్నారి ఆర్జిక్ అక్కడికక్కడే మరణించాడు. చైతన్య, శ్రీకాంత్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు వారిని హైవే అంబులెన్స్‌లో నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చైతన్య మృతి చెందింది. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. లారీడ్రైవర్ పరారయ్యాడు. పోలీసులు లారీని స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.