సాక్షి, తాడేపల్లి: ప్రజా ఆరోగ్యం కోసం వైఎస్ జగన్ ఎంతో తపించి మెడికల్ కాలేజీల తీసుకొస్తే.. వాటిని చంద్రబాబు ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలని చూస్తున్నారని వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ బొత్స నేతృత్వంలో వైఎస్సార్‌సీపీ బృందం గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు.
అనంతరం తాడేపల్లి పార్టీ కేంద్రకార్యాలయంలో బొత్స ఈ అంశంపై మాట్లాడారు. కోవిడ్ సమయంలో అనేక ఇబ్బందులు పడ్డాం. జిల్లాకో మెడికల్ కాలేజీ ఉండాలనే ఆలోచనతో ముందుకు వెళ్లాం. పేదలకు మేలు జరగాలనే వైఎస్ జగన్ మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు. వైద్య రంగాన్ని వైఎస్ జగన్ అభివృద్ధి చేశారు. ప్రజల ఆరోగ్యం కోసం వైద్య రంగానికి నిధులు కేటాయించారు.
ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలపై పోరాడుతున్నాం. చంద్రబాబు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో కాలేజీలను పెట్టాలని చూస్తున్నారు. ఐదు కాలేజీలు మా హయాంలో పూర్తయ్యాయి. మిగతావి క్రమబద్దంగా పనులు జరుగుతున్నాయి. జగన్‌కు మంచి పేరు రాకూడదనే ప్రైవేటీకరణకు వెళ్తున్నారు. అవి పూర్తయితే జగన్ కు పేరు వస్తుందని కూటమి ప్రభుత్వం కుట్ర పన్నింది..
..మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాలు సేకరిస్తున్నాం. అన్ని ప్రజాసంఘాలు, ప్రజాస్వామ్య వాదులు మద్దతు తెలుపుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ల చేతుల్లో ఉండకూడదు. అన్ని విషయాలు గవర్నర్‌కు వివరించాం. దీనిపై ఒక కమిటీని పంపించి ర్యాండమ్ చెకింగ్ చేయమని కోరాం. ప్రైవేట్ వాళ్లు ప్రజలకు ఎందుకు సేవ చేస్తారు?. లాభాపేక్షతో వ్యాపారం చేస్తే ప్రజల పరిస్థితి ఏంటి?. పేద పిల్లలు వైద్య విద్యని ఎలా చదవగలరు?. పీపీపీని వెనక్కు తీసుకునే వరకు మా పోరాటం ఆగదు’’ అని బొత్స స్పష్టం చేశారు.
ఇంకా బొత్స ఏమన్నారంటే.. 👉జగన్ హయాంలో రూ.25 లక్షల వరకు ఉచితంగా వైద్యం పొందేలా చేశారు. చంద్రబాబుకు కోపం ఉంటే మాపై తీర్చుకోవాలి. అంతేగానీ పేదల మీద అంత కోపం ఎందుకు?. ఓటు వేసి గెలిపించిన పాపానికి అదే పేదల మీద కక్ష తీర్చుకోవటం న్యాయమేనా?. విద్య, వైద్య రంగాలను చంద్రబాబు సర్వ నాశనం చేశారు.
👉జగన్ హయాంలో ఏపీ విద్యార్థులు అంతర్జాతీయ ఖ్యాతిని సాధించారు. ట్యాబులు ఇస్తే విద్యార్థులు గేమ్ లు ఆడుకున్నారని మాక్ అసెంబ్లీలో చెప్పించారు. ఇలా పిల్లలతో చెప్పించటానికి కాస్తన్నా సిగ్గు ఉండాలి. స్పీకర్ అయ్యన్నపాత్రుడికి ఇంగిత జ్ఞానం లేదు. ఎమ్మెల్యేలను కించపరిచేలా మాట్లాడటం తగదు. ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటే స్పీకర్ తీసుకోవచ్చు. అంతేగానీ బాధ్యతలేని వ్యక్తి లాగా మాట్లాడటం సరికాదు

👉రాష్ట్రంలో అసలు ప్రభుత్వమే లేదు. ఏ వ్యవస్థ మీదా పర్యవేక్షణ లేదు. ఎల్లోమీడియాలో ఆహాఓహో అనిపించుకోవటం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదు. రైతులు గిట్టుబాటు ధరల్లేక అల్లాడిపోతుంటే అసలే మాత్రం పట్టించుకోవటం లేదు. హాస్టళ్లలో కలుషిత ఆహారం తిని విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్న ప్రభుత్వానికి పట్టటంలేదు. ఆస్పత్రులలో సరైన వైద్యం అందటం లేదు. ఇలాంటి వాటి గురించి కూడా చంద్రబాబు పట్టించుకోవటం లేదు
👉రాజ్యాంగ ఆమోద దినోత్సవానికి ప్రతిపక్షాన్ని ఎందుకు పిలవలేదు?. రాజ్యాంగంలో ప్రతిపక్షాన్ని పిలవవద్దని ఉందా?. ప్రతిపక్షం గురించి పట్టించుకోని ప్రభుత్వానికి రాజ్యాంగం గురించి మాట్లాడే అర్హత లేదు
👉పవన్ కళ్యాణ్ బూతులు మాట్లాడితే ఒప్పా?. ఇంకొకరు మాట్లాడితే తప్పా?. పవన్ కళ్యాణ్ కాకినాడ వెళ్లి రేషన్ బియ్యం గురించి హడావుడి చేశారు. మరి ఆ తర్వాత కూడా బియ్యం అక్రమ రవాణా ఎందుకు ఆగలేదు?. ఒక డీఎస్పీ అవినీతిపరుడుని, పేకాట క్లబ్బులు నడిపిస్తున్నాడని పవన్ చెప్పారు. మరి అదే డీఎస్పీకి అవార్డులు, రివార్డులు ఎలా ఇచ్చారు? అని బొత్స నిలదీశారు.


