వర్నకట్న వేధింపులకు మరొకరు బలి.. నిక్కీ దారుణ హత్య | Greater Noida Woman Burnt Alive over Dowry Demand Husband in Custody | Sakshi
Sakshi News home page

Greater Noida: రూ. 35 లక్షల కట్నం తేలేదని.. మండే ద్రవాన్ని శరీరంపై పోసి..

Aug 24 2025 7:42 AM | Updated on Aug 24 2025 8:11 AM

Greater Noida Woman Burnt Alive over Dowry Demand Husband in Custody

గ్రేటర్‌ నోయిడా: వరకట్న దురాచారాన్ని సంప్రదాయం పేరుతో  నేటికీ కొందరు కొనసాగిస్తున్నారు. చట్టం దీనిని నేరం అని చెప్పినా, పట్టించుకోనివారి సంఖ్య కూడా అధికంగానే ఉంటోందనడానికి పలు ఉదాహరణలు కనిపిస్తున్నాయి. ఫలితంగా వరకట్నం పేరుతో దేశంలో పలు దారుణాలు  చోటుచేసుకుంటున్నాయి. తాజాగా యూపీలోని గ్రేటర్‌ నోయిడాలో చోటుచేసుకున్న ఉదంతం అందరినీ కంటతడి పెట్టిస్తోంది.

మరింత కట్నం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ, భర్త,  అత్తమామలు కలసి 28 ఏళ్ల మహిళ(నిక్కీ)కు నిప్పంటించి, ఆమె ప్రాణాలను బలిగొన్నారని గ్రేటర్‌ నోయిడా పోలీసులు తెలిపారు. ఈ ఉదంతంలో పోటీసులు మృతురాలు నిక్కి భర్త భర్త విపిన్ భాటీ (28)ని అరెస్టు చేయగా, అతని తండ్రి సత్యవీర్ భాటి, సోదరుడు రోహిత్ భాటి పరారీలో ఉన్నారు. తన సోదరి నిక్కీని అత్తామామలు ఏళ్ల తరబడి వేధిస్తున్నారని కాంచన్ ఫిర్యాదు చేయడంతో ఈ కేసు వెలుగు చూసింది.

ఈ దారుణం ఆగస్టు 21న కాస్నా పోలీస్ స్టేషన్ పరిధిలోని సిర్సా గ్రామంలో చోటుచేసుకుంది. నిక్కీని కట్నంగా రూ.35 లక్షలు తీసుకురావాలంటూ వేధిస్తున్న భర్త, అత్తామామలు తాజాగా ఆమెపై మండే ద్రవాన్ని పోసి నిప్పంటించారు. తీవ్రంగా గాయపడిన నిక్కీని నోయిడాలోని ఫోర్టిస్ హాస్పిటల్ నుండి ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ హాస్పిటల్‌కు తరలిస్తుండగా మృతిచెందింది. ఈ నేపధ్యంలో.. మృతురాలి భర్త విపిన్ భాటి, అతని తల్లి దయ, మామ సత్యవీర్‌, బావ రోహిత్‌లు తన సోదరి నిక్కీ మృతికి కారకులంటూ ఆమె సోదరి కంచన్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే పోలీసులు మృతురాలు నిక్కీ భర్త విపిన్‌ను అరెస్టు చేశారు.

నిక్కీ సోదరి కాంచన్ తన ఫిర్యాదులో 2016 డిసెంబర్‌లో తన సోదరి నిక్కీకి వివాహం అయ్యిందని, ఆ సమయంలో అత్తింటివారు కట్నం తీసుకోలేదని తెలిపింది. అయితే ఆ తరువాత నిక్కీ భర్త, అత్తమామలు నిక్కీని పుట్టింటి నుంచి రూ. 35 లక్షల కట్నం తీసుకురావాలంటూ ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. నిక్కీ అందుకు నిరాకరించడంతో ఆమెను అత్తింటివారు వేధించసాగారు. ‘ఆగస్టు 21న సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో, విపిన్, అతని తల్లి దయ, తండ్రి సత్యవీర్ , సోదరుడు రోహిత్‌లు కలిసి నా సోదరిపై మండే పదార్థాన్ని పోసి నిప్పంటించారు. విషయం తెలుసుకున్న నేను ఆమెను ఫోర్టిస్ ఆసుపత్రికి తరలించాను. అక్కడి నుండి  సఫ్దర్‌జంగ్‌కు తరలిస్తుండగా, దారిలో నిక్కీ మరణించింది’ అని కాంచన్‌ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.

గ్రేటర్ నోయిడా పోలీసు అధికారి సుధీర్ కుమార్ మాట్లాడుతూ ‘ఆగస్టు 21న రాత్రి ఫోర్టిస్ ఆసుపత్రిలో తీవ్రమైన కాలిన గాయాలతో అడ్మిట్ అయిన మహిళ గురించి మాకు సమాచారం అందింది. తరువాత ఆమెను ఢిల్లీకి రిఫర్ చేశారు. కానీ దారిలో ఆమె మరణించారు. పోస్టుమార్టం నిర్వహించి, మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించాం. నిందితులపై కేసు నమోదు చేసుకుని భర్త విపిన్‌ను అరెస్టు చేశాం. పరారీలో ఉన్న అతని బంధువులను  గాలించేందుకు పోలీసు బృందాలను నియమించాం. నిక్కీ ఈ హత్యకు ముందు వరకట్నం వేధింపులకు గురైందా? లేదా అని దానిపై దర్యాప్తు  చేస్తున్నాం’ అని తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement