కొనసాగుతున్న గాలింపు చర్యలు
శివినిలో విషాదం
రైవాడ జలాశయంలో ముగ్గురు గల్లంతు.. మృతదేహం లభ్యం
కొమరాడ/దేవరాపల్లి/అనంతగిరి (అరకులోయ): వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు గల్లంతయ్యారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం జంఝావతి రబ్బరు డ్యాంలో స్నానం కోసం దిగిన ముగ్గురు ఆదివారం గల్లంతయ్యారు.
శివిని గ్రామానికి చెందిన అధికారి గోవిందనాయుడు (35), అరసాడ ప్రదీప్ (29), రాయఘడ శరత్‌కుమార్ (17) పిక్నిక్ కోసం జంఝావతి రబ్బరు డ్యాం వద్దకు వెళ్లారు. సాయంత్రం డ్యాంలో స్నానం చేసేందుకు దిగి ప్రవాహం కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసు, అగ్నిమాపక అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.
రైవాడ జలాశయంలో పడవ బోల్తా..
అల్లూరి జిల్లా జీనబాడులోని రైవాడ జలాశయంలో పడవ బోల్తా పడి ముగ్గురు గల్లంతయ్యారు. వివరాలు..జీనబాడుకు చెందిన గాలి అప్పలరాజు అటవీ శాఖలో తాత్కాలిక ప్రొటెక్షన్ వాచర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కొండ నుంచి కలప అక్రమ రవాణా జరుగుతుందన్న సమాచారం తెలుసుకున్న అప్పలరాజు, జాలాడ ప్రసాద్ బోటులో జలాశయం గేట్ల వద్దకు వెళ్లి కలపను పట్టుకున్నారు.
తిరిగి వచ్చేటప్పుడు గంజాయి జీవన్, దేబార రమేష్‌లను అదే పడవలో ఎక్కించుకొని రేవు వద్దకు వస్తుండగా.. పడవ నీట మునిగింది. ప్రసాద్ పడవని పట్టుకొని కేకలు వేయడంతో సమీపంలో అతని తండ్రి సత్యం, బంధువులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రసాద్‌ను, జీవన్(19) మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. అప్పలరాజు (24), రమేష్ (18)ల కోసం గాలిస్తున్నారు.


