సాక్షి, హైదరాబాద్: ‘ఐబొమ్మ’సహా పదుల సంఖ్యలో పైరసీ వెబ్‌సైట్లు నిర్వహించి, హైదరాబాద్ సైబర్ క్రైమ్ అధికారులకు చిక్కిన ఇమ్మడి రవి పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించింది. ఈ మేరకు నాంపల్లి న్యాయస్థానం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్‌లో భాగంగా చంచల్‌గూడ జైలులో ఉన్న రవిని దర్యాప్తు అధికారులు గురువారం కస్టడీలోకి తీసుకుని ఐదు రోజులపాటు విచారించనున్నారు.
ఇందులో భాగంగా సైబర్ క్రైమ్ పోలీసులు అతడి నెట్‌వర్క్‌పై దృష్టి పెట్టారు. పైరసీ సర్వర్లు ఎక్కడెక్కడ ఉంచాడు? ఆయా వ్యవహారాల్లో సహకరించింది ఎవరు.. ఇతర సాంకేతిక అంశాలపై ప్రశ్నించనున్నారు. మరోపక్క ఆరేళ్లలో 21 వేల చిత్రాలను పైరసీ చేసిన, బెట్టింగ్/గేమింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన ఇమ్మడి రవి ఆర్థికాంశాలపైనా అధికారులు దృష్టి పెట్టారు. ఇప్పటికే హైదరాబాద్, విశాఖపట్నంలో ఉన్న కొన్ని స్థిరాస్తుల్ని గుర్తించారు. అతడు పౌరసత్వం తీసుకున్న కరేబియన్ దీవుల్లోని దేశమైన సెయింట్ కిట్స్ అండ్ నెవీస్‌లోనూ కొన్ని ఆస్తులు ఖరీదు చేసినట్లు అనుమానిస్తున్న అధికారులు ఆ కోణంలోనూ విచారించనున్నారు.
ఏడాదిలోనే హోంలోన్ క్లోజ్...
పైరసీ, బెట్టింగ్ దందా ద్వారా రవి భారీ మొత్తం ఆర్జించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కుటుంబీకులకు దూరంగా ఉంటున్న రవి ఓ సమీప బంధువుతో మాత్రం సన్నిహితంగా ఉన్నట్లు గుర్తించారు. వివిధ సందర్భాల్లో ఆ బంధువు రవి ఖాతాకు రూ.కోటి బదిలీ చేసినట్లు ఆధారాలు సేకరించారు. దీనిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. 2018 నుంచి పైరసీ వెబ్‌సైట్లు నిర్వహిస్తున్న రవి మూసాపేట్‌లోని రెయిన్‌బో విస్టా అపార్ట్‌మెంట్‌లోని ఎ–బ్లాక్‌లోని 1903 ఫ్లాట్‌ను 2019లో ఖరీదు చేశాడు.
ఆ సమయంలో కేవలం కొంత మొత్తం చెల్లించిన అతడు.. మిగిలింది హోంలోన్ తీసుకున్నాడు. అయితే కేవలం ఏడాదిలోనే ఆ లోన్‌ను రవి క్లియర్ చేసినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. ఇప్పటివరకు రవికి సంబంధించిన ఆరు బ్యాంకు ఖాతాలను విశ్లేషించిన పోలీసులు వాటిలో రూ.28 కోట్ల లావాదేవీలు గుర్తించారు. దాదాపు మరో 25 బ్యాంకు ఖాతాల వివరాలు సేకరిస్తున్నారు. బిట్ కాయిన్ల రూపంలోనూ భారీ లావాదేవీలు జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసు కస్టడీలో భాగంగా పోలీసులు రవికి సంబంధించిన క్రిప్టో కరెన్సీ వాలెట్స్ వివరాలు సేకరించనున్నారు.


