
అరటి పండు చిప్స్.. వీటి గురించి తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఓ రకంగా హాట్ చిప్స్ అనే ఒక పూర్తి స్థాయి చిరుతిళ్ల దుకాణాలు అన్ని నగరాల్లో పాగా వేయడానికి కూడా ఈ బనానా చిప్స్ పై జనంలో పెరిగిన క్రేజ్ బాటలు వేసిందని చెప్పొచ్చు. సాయంత్రం వేళ స్నాక్స్ నుంచి రాత్రి వేళల్లో ఛీర్స్ దాకా కాస్త ఆరోగ్య స్పృహ ఉన్నవారు ఎంచుకునే చిరు తిండి అదే.
ముఖ్యంగా కేరళ రాష్ట్రాన్ని అక్కడి ప్రకృతి సౌందర్యాన్ని ఇష్టపడే చాలా మంది పర్యాటకులు తప్పకుండా చేసే పనులలో ఒకటి అక్కడ నుంచి తాజా తాజా బనానా చిప్స్‌ను కొనుగోలు చేసి తమ స్వస్థలాలకు తీసుకురావడం.. ఎవరైనా సన్నిహితులు కేరళ వెళుతుంటే కూడా వచ్చేటప్పుడు బనానా చిప్స్ తీసుకురా అంటూ అభ్యర్ధించే తెలుగువారికీ కొదవలేదు.
ఈ నేపథ్యంలో గత ఏప్రిల్ 2024 నుంచి మార్చి 2025 మధ్య కేరళ ఆహార భద్రతా కమిషనరేట్ ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఆహార పదార్ధాలలో కల్తీపై తనిఖీలు నిర్వహించింది. ఆ సందర్భంగా సేకరించిన నమూనాలపై జరిపిన పరీక్షలలో, విభ్రాంతికర విషయాలు వెలుగు చూశాయి. గాడ్స్ ఓన్ కంట్రీగా పేరొందిన కేరళ లో రాష్ట్రవ్యాప్తంగా విక్రయించే ఆహారాలలో నిషేధిత రంగులు, నిల్వకారక రసాయనాలు, పురుగుమందుల మిశ్రమాలు బయటపడ్డాయి. అవి అనుమతించదగిన పరిమితి కంటే దాదాపు 3,500% వరకూ ఎక్కువగా ఉండడం అందర్నీ షాక్‌కి గురి చేసింది.
అధికారులు తమ నివేదికను సిద్ధం చేయడానికి రాష్ట్రంలో విక్రయించే 650 పైగా ఆహార పదార్ధాల నమూనాలను పరీక్షించారు. వారి పరిశోధన ఫలితాల ప్రకారం... స్వల్ప స్థాయిలో కూడా ఏదైనా ఆహారాన్ని విషపూరితంగా మార్చే పారిశ్రామిక రంగు అయిన రోడమైన్ బి, పామ్ షుగర్ బెల్లంలలో కనపడింది. క్యాన్సర్ కారక రసాయనమైన అమరాంత్, రోజ్‌బెర్రీ, బీఫ్ చిల్లి, డ్రైడ్ ప్లమ్‌లలో, మరొక హానికరమైన రసాయనం, ఆరెంజ్ 2, రెడ్ గ్రామ్ నిమ్మకాయ ఊరగాయలలో లభ్యమైంది. స్థానికంగా ఉత్పత్తి చేసిన బ్రాండెడ్ మిరపకాయ పొడులలో సుడాన్ 1, 2, 3, 4 అనే పేరు కలిగిన క్యాన్సర్–సంబంధిత పదార్థాల జాడ దొరికింది.
ఈ తరహా హానికారక ఉత్పత్తులు మేళవించిన వివిధ రకాల మిశ్రమాలు, ప్లం కేక్‌తో పాటు బనానా చిప్స్‌లో కూడా బయటపడడం అరటి పండు చిప్స్ ని ఇష్టంగా తినేవారిని భయాందోళనలకు గురి చేసింది. ఈ మిశ్రమం..అరటి పండు చిప్స్ తినేవారిలో కలిగించే అనారోగ్యాలు సాధారణ అజీర్ణం నుంచి ప్రాణాంతక క్యాన్సర్‌ల వరకూ ఉండవచ్చునని వెల్లడి కావడం మింగుడు పడని విషయంగా మారింది.
ఈ నేపధ్యంలో కేరళ నుంచి తరలివచ్చే వాటితో పాటు తెలుగు రాష్ట్రాల్లో తయారవుతున్న బనానా చిప్స్ ను వినియోగించే విషయంలో సైతం ఆరోగ్యార్ధులు ఆచితూచి వ్యవహరించడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. అదే విధంగా కేరళ రాష్ట్రంలో అధికారులు చేసినట్టుగా తెలుగు రాష్ట్రాల్లో కూడా అధికారులు తినుబండారాలపై తనిఖీలు చేపట్టాలని, వారు విడుదల చేసినట్టుగానే హానికారక పదార్ధాలను కొలతలతో సహా జాబితాగా విడుదల చేస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.