
ఈ నెల 25 నుంచే అమల్లోకి..
100 డాలర్ల దాకా విలువైన లేఖలు, డాక్యుమెంట్లు, గిఫ్ట్ ఐటమ్స్ పంపొచ్చు
అవి మినహా ఇతర పార్సిళ్ల బుకింగ్‌లు నిలిపివేత
తపాలా శాఖ ప్రకటన
న్యూఢిల్లీ: అమెరికాకు కొన్ని రకాల తపాలా సేవలను ఈ నెల 25వ తేదీ నుంచి తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు భారత తపాలా శాఖ ప్రకటించింది. పన్ను నిబంధనల్లో అమెరికా ప్రభుత్వం మార్పులు చేయడమే ఇందుకు కారణమని వెల్లడించింది. ప్రధానంగా పార్సిల్ సేవలను నిలిపివేయనున్నట్లు పేర్కొంది. 800 డాలర్ల వరకు విలువైన వస్తువులపై పన్నురహిత మినహాయింపులను ఉపసంహరిస్తున్నట్లు అమెరికా సర్కార్ జూలై 30న ఉత్తర్వు జారీ చేసిన సంగతి తెలిసిందే.
ఆగస్టు 29 నుంచి అమల్లోకి తీసుకొస్తామని వెల్లడించింది. ఈ నేపథ్యంలో అమెరికాకు పంపించే అన్ని రకాల పోస్టల్ ఐటమ్స్‌పై వాటి విలువతో సంబంధం లేకుండా ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్ యాక్ట్(ఐఈఈపీఏ) టారిఫ్ ఫ్రేమ్‌వర్క్ కింద కస్టమ్స్ డ్యూటీ చెల్లించాల్సి ఉంటుంది. 100 డాలర్ల దాకా విలువైన బహుమతులపై ఎలాంటి పన్ను ఉండదు.
యూఎస్ కస్టమ్స్ విభాగం నుంచి అనుమతి పొందినవారు పోస్టల్ షిప్‌మెంట్స్‌పై పన్ను వసూలు చేసి, అమెరికా ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు ఈ నెల 25 నుంచి అమెరికాకు పోస్టల్ పార్సిళ్లను పంపించడం ఆపేస్తున్నట్లు విమానయాన సంస్థలు ప్రకటించాయి. తపాలా శాఖ ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. 100 డాలర్ల దాకా విలువైన లేఖలు, డాక్యుమెంట్లు, గిఫ్ట్ ఐటమ్స్ మినహా ఇతర పార్సిళ్ల బుకింగ్‌ను నిలిపివేస్తున్నట్లు స్పష్టంచేసింది.
పార్సిళ్లను అమెరికాకు పంపడానికి ఇప్పటికే సొమ్ము చెల్లించినవారు రీఫండ్ పొందవచ్చని సూచించింది. ఆయా పార్సిళ్లను తిరిగి పొందాలని పేర్కొంది. వినియోగదారులకు కలుగుతున్న అసౌకర్యానికి చింతిస్తున్నామని ఒక ప్రకటనలో వివరించింది. అమెరికాకు అన్ని రకాల పోస్టల్ సేవలను సాధ్యమైనంత త్వరగా పునఃప్రారంభించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు తెలియజేసింది.
అమెరికా పన్ను నిబంధనల్లో మార్పుల కారణంగా భారత్‌తోపాటు స్కాండినేవియా, ఆస్ట్రియా, ఫ్రాన్స్, బెల్జియం తదితర దేశాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఆయా దేశాలు అమెరికాకు పార్సిల్ డెలివరీలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన తర్వాత విదేశాలపై టారిఫ్‌ల మోత మోగించిన సంగతి తెలిసిందే. ఇండియా సహా పలుదేశాలపై ప్రతీకార సుంకాలు విధించారు. ప్రపంచ దేశాలతో వాణిజ్య యుద్ధానికి తెరతీశారు. ఇందులో భాగంగానే పోస్టల్ సేవలపై పన్నురహిత మినహాయింపులను ఉపసంహరించారు.