
ఈసారి గణపయ్యకు టెక్ టచ్‌తో స్వాగతం చెప్పారంటే, ఇక మీ పండుగ వాతావరణం భక్తి ప్లస్ టెక్ కాంబోలో డబుల్ ఆనందంతో మెరిసిపోతుంది.
వీఆర్ గణపయ్యతో రద్దీకి గుడ్‌బై!
వినాయక చతుర్థి రాగానే ముంబయి లాల్‌బాగ్చా రాజా ముందు కనిపించే రద్దీ మాటల్లో చెప్పలేనిది. కాని, ఇప్పుడు బయట అడుగు పెట్టకుండానే, మీ లివింగ్‌రూమ్‌లో కూర్చొని ఆ భవ్య దర్శనాన్ని ఆస్వాదించవచ్చు. అదే ఈ ‘లాల్‌బాగ్ 360’ వీఆర్ దర్శనం. ఒక్క యాప్‌తో మీ హాల్లో కూర్చునే పూజా గంటలు, పూజారుల మంత్రోచ్ఛారణ, మండప అలంకారాలు అన్నీ కళ్లముందే ప్రత్యక్షం అవుతాయి. ఎడమ వైపు తిప్పితే పూలతో అలంకరించిన మండపం, కుడివైపు తిప్పితే గణపయ్య పాదాల వద్ద నమస్కరిస్తున్న భక్తులు అన్నీ నిజంగానే అక్కడ ఉన్నట్టు అనిపిస్తాయి.
ఇదే విధంగా ‘గణేశ్ వీఆర్’, ‘విజయవిధి వర్చువల్ దర్శనం’ లాంటి యాప్‌లు కూడా 360 డిగ్రీల వీడియోలతో పండుగ వాతావరణాన్ని ఇంటికే తీసుకొస్తున్నాయి. వాడటం కూడా చాలా సులభం. మీ ఫోన్ లేదా స్మార్ట్ టీవీలో యాప్ డౌన్ లోడ్ చేసి, హెడ్‌సెట్ లేదా ఫుల్‌స్క్రీన్‌లో ఆన్ చేస్తే సరిపోతుంది. లైవ్ టైమింగ్స్, లింకులు అధికారిక వెబ్‌సైట్‌లో దొరుకుతాయి.
ఒకే టచ్‌తో భక్తి ప్లస్‌డీజే మోడ్!
గణేష్ మండపం అంటే వెలుగుల వేదిక! అయితే, ఇప్పుడు తీగలు, ప్లగ్‌లు, స్విచ్‌లతో ఇబ్బంది పడే రోజులు పోయాయి. ఒక వైఫై ఎల్‌ఈడీ బల్బు పెట్టేస్తే చాలు. మీ మండపం క్షణాల్లో ‘సినిమా సెట్’లా మెరిసిపోతుంది. ఉదయం పూజ సమయానికి పసుపు వెలుగు, మధ్యాహ్నం భక్తులు రాగానే ప్రకాశించే తెలుపు వెలుగు, రాత్రి డీజే బీట్ పడగానే గ్రీన్ , బ్లూ, రెడ్ ఫ్లాష్‌లతో మండపం ఫుల్ పార్టీ మూడ్‌లోకి మారిపోతుంది.
ఇవన్నీ కేవలం ఫోన్ టచ్‌తోనే! ‘అలెక్సా, డివోషనల్ మోడ్ ఆన్ ’ అంటే పసుపు, ఎరుపు కాంబినేషన్ రెడీ. వాడటం కూడా సింపుల్. బల్బు పెట్టి, యాప్ డౌన్‌లోడ్ చేసి, వైఫై కనెక్ట్ చేస్తే సరిపోతుంది. టైమింగ్ సెట్ చేసి, పూజ సమయానికి ఆటోమేటిక్‌గా వెలుగులు వెలిగేలా చేసుకోవచ్చు. విప్రో, ఫిలిప్స్, హెవెల్స్ లాంటి బ్రాండ్లు మంచి ఆప్షన్లు ఇస్తున్నాయి. ఒక్క బల్బు ధర రూ. 600 నుంచి మొదలవుతుంది.
ఒక్క బాక్స్‌లో మొత్తం పండుగ!
వినాయక చవితి దగ్గర పడుతుంటే, ఇంట్లో అందరికీ ఒకటే టెన్షన్ , పూజ సామగ్రిని సర్దుకోవాలి, పత్రి తెప్పించాలి, విగ్రహం తీసుకురావాలి. వీటన్నిటికీ చివరి నిమిషంలో టెన్షన్.. టెన్షన్! కాని, ఈసారి అంతా ఈజీ! ‘ఆరాధ్య గణేశ్ చతుర్థి సంపూర్ణ పూజా కిట్’ చేతిలో ఉంటే చాలు, మీ పండుగ ఏ లోటు లేకుండా చక్కగా పూర్తవుతుంది. ఒక్క బాక్స్‌లోనే పన్నెండు అంగుళాల మట్టి గణపయ్య, ఇరవైఒక్క రకాల పవిత్ర పత్రి, ఒక చెక్క పాలవెల్లి సహా పూజకు కావాల్సినవన్నీ సిద్ధంగా లభిస్తాయి.
కేవలం పూలు, పండ్లు, నైవేద్యం బాధ్యత మాత్రమే మీది! ఎవరైనా పూజ విధానం మరచిపోయారా? టెన్షన్ లేదు, చిన్న పుస్తకంతోపాటు, వీడియో గైడ్ కూడా వెబ్‌సైట్‌లో రెడీగా ఉంటుంది. పైగా ప్యాకేజింగ్ నుంచి విగ్రహం వరకు అంతా ప్రకృతికి నష్టం లేకుండా పర్యావరణహితంగా ఉంటుంది. ధర కేవలం రూ.1500 మాత్రమే! .
(చదవండి: బాబోయ్..బనానా చిప్స్ తింటే... ఆరోగ్యం ఆటలో అరటిపండే...)