
రాత్రంతా పీలుస్తున్న విద్యార్థులు..పోలీసుల అదుపులో ఇంటర్ స్టూడెంట్ !
యూట్యూబ్‌లో చూసి తయారీ
కేశంపేట: రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల పరిధి లోని కొత్తపేటలోని సాంఘిక సంక్షేమశాఖ హాస్టల్ లో కొందరు విద్యార్థులు హుక్కాకు అలవాటు పడ్డారు. ఏకంగా యూట్యూబ్‌లో చూసి అవసరమైన సామగ్రి ఆన్‌లైన్‌లో, తెలిసినవారి నుంచి సమకూర్చుకొని స్వయంగా హుక్కా తయారు చేశారు. హాస్టల్‌లో ఉండే కొత్తపేటకు చెందిన ఇంటర్ విద్యార్థికి షాద్‌నగర్‌లోని ఓ హోటల్‌లో పనిచేసే మిత్రుడు ఉన్నాడు. ఇతని ద్వారా హుక్కా పీల్చడం అలవాటు చేసుకున్నాడు.
మరో ఇద్దరు విద్యార్థులకు అలవాటు చేశాడు. అలా పదోతరగతి లోపు చదువుతున్న 20 మంది హుక్కాకు బానిసలుగా మారారు. ఇదంతా ఓ నాలుగో తరగతి విద్యార్థి గమనించగా, అతడిని కొట్టి బలవంతంగా హుక్కా తాగించారు. విషయం తెలుసుకున్న వార్డెన్ ఇద్దరు విద్యార్థులను హాస్టల్ నుంచి ఇంటికి పంపించారు.
ఈ క్రమంలో శుక్రవారం రాత్రి హుక్కా పీల్చేందుకు గుర్తు తెలియని వ్యక్తి హాస్టల్ గోడ దూకి, విద్యుత్ దీపాలు ఆర్పివేశాడు. దీంతో మిగిలిన విద్యార్థులు రాత్రంతా భయంభయంగా గడిపి శనివారం ఉదయమే హాస్టల్ సిబ్బందికి తెలిపారు. హాస్టల్‌లో తనిఖీ చేయగా హుక్కా మిషన్‌తోపాటు సామగ్రి లభించాయి. ఇంటర్ విద్యార్థిని పోలీస్ స్టేషన్‌కు తరలించినట్టు విశ్వసనీయ సమాచారం