
బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్‌లపై రాహుల్ గాంధీ ఫైర్
కటిహార్: కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ప్పటి నుంచి పేదలకు అవకాశాలను దొర క్కుండా చేసిన బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు ఇప్పుడు వారి ఓట్లను లాగేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలను అనుకూలంగా మార్చుకునేందుకు కుట్రలు పన్నుతున్నా యన్నారు. ఓటర్ అధికార్ యాత్రలో భాగంగా శనివారం రాహుల్ బిహార్‌లోని కటిహార్ జిల్లాలో జరిగిన ర్యాలీలో మాట్లాడారు.
రాజ్యాంగ ప్రతిని ప్రదర్శిస్తూ ఆయన.. బీఆర్ అంబేడ్కర్ రచించిన ఈ పుస్తకంలోని ఆదర్శాలకు మరో వెయ్యేళ్ల యినా విలువ తగ్గదన్నారు. దళితులు, వెనుకబడిన కులాలు, మహిళలను ముందుకు సాగకుండా అడ్డుకోవడమే బీజేపీ లక్ష్యమని, అందుకే బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తున్నాయని విమర్శించారు. గతంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో దళితులు, ఈబీసీలు, మైనారిటీలకు మంచి ఉద్యోగాలు దొరికేవనీ, బీజేపీ సర్కారు ప్రైవేటీకరణతో ఇప్పుడా అవకాశం లేకుండా చేసిందని రాహుల్ ఆరోపించారు. ప్రతి వ్యక్తికీ ఓటు హక్కుంది.
అందరి ఓట్లూ సమానమే. ఆర్‌ఎస్‌ఎస్, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా కలిసి అమూల్యమైన ఆ ఓటును దొంగిలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. కర్నాటక, మహారాష్ట్ర, హరియాణాల్లో ఎన్నికల్లో వేలాది మంది ఓట్లను గల్లంతు చేశారని ఈసీకి కూడా ఫిర్యాదు చేశామన్నారు. వేలాదిగా చేర్చిన కొత్త ఓట్లన్నీ బీజేపీకే పడటంతో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా వచ్చాయని చెప్పారు.
ఇప్పుడు బిహార్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని రాహుల్ మండిపడ్డారు. ఈ విషయం తెలిపేందుకే ఓటర్ అధికార్ యాత్ర చేపట్టామని వివరించారు. అయితే, మీడియా తమ ప్రయత్నాన్ని చాలా తక్కువ చేస్తోందని, లక్షలాది మంది ప్రజలు తమ యాత్రకు తరలివస్తున్నా చూపించడం లేదని ఆరోపించారు. ఈ నెల 17వ తేదీన సాసారంలో యాత్ర మొదలయ్యాక మొదటిసారిగా తాత్కాలిక వేదిక నుంచి రాహుల్ ప్రసంగించడం విశేషం. కార్యక్రమంలో బిహార్ ప్రతిపక్ష నేత తేజస్వీయాదవ్ పాలుపంచుకున్నారు.