
సాక్షి, పల్నాడు జిల్లా: వినుకొండ నియోజకవర్గంలో టీడీపీ గూండాలు బరితెగించారు. వైఎస్సార్‌సీపీ నేత భీమనాథం వెంకటప్రసాద్ కుటుంబంపై దాడికి పాల్పడ్డారు. వెంకట ప్రసాద్‌పై కత్తితో దాడి చేశారు. వెంటాడి మరీ వెంకట ప్రసాద్‌పై టీడీపీ గూండాలు కత్తులతో దాడి చేశారు. టీడీపీ గుండాల దాడిలో వెంకట ప్రసాద్, ఆయన తండ్రి గురవయ్య, అన్న వెంకటేశ్వర్లు తీవ్రంగా గాయపపడ్డారు.
టీడీపీ నాయకులు విచక్షణారహితంగా కత్తులతో దాడి చేయడంతో వెంకట ప్రసాద్ స్పాట్‌లో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ప్రసాద్ చనిపోయాడని భావించిన టీడీపీ గూండాలు వదిలేసి వెళ్లిపోయారు. గుంటూరు ఆసుపత్రికి ఆయన్ని తరలించారు. వెంకట ప్రసాద్ పరిస్థితి విషమంగా ఉందని.. 48 గంటలు గడిస్తే గాని పరిస్థితి చెప్పలేమని వైద్యులు వెల్లడించారు.
ఈ హత్యాయత్నాన్ని వైఎస్సార్‌సీపీ తీవ్రంగా ఖండిస్తోందని ఆ పార్టీ నేత అంబటి మురళీ అన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ‘‘వినుకొండలో ఇది రెండో దారుణం.. గతంలో రషీద్‌ను అత్యంత దారుణంగా చంపేశారు రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు. మీరు చేసే ప్రతి ఒక అరాచకాన్ని గుర్తుపెట్టుకుంటాం’’ అని వైఎస్సార్‌సీపీ నేతలు హెచ్చరించారు.