తప్పుడు కేసులపై సీబీఐ విచారణ జరపాలి
●పిన్నెల్లి సోదరులపై బనాయించినవి అక్రమ కేసులు
●ఈ విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు
●న్యాయం ఎప్పటికై నా గెలుస్తుంది
●గురజాల మాజీ ఎమ్మెల్యే
కాసు మహేష్‌రెడ్డి
పిడుగురాళ్ల: వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులపై బనాయించిన తప్పుడు కేసుపై దమ్ముంటే అధికార పార్టీ సీబీఐ విచారణ జరిపించాలని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి డిమాండ్‌చేశారు. పిన్నెల్లి సోదరులపై బనాయించినవి తప్పుడు కేసులనే విషయం జిల్లాలో ఎవరిని అడిగిన వెంటనే చెబుతారని అన్నారు. నరసరావుపేటలోని తన నివాసంలో మహేష్‌రెడ్డి ఆదివారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పిన్నెల్లి సోదరులకు పాపం పండింది.. జైలుకు పోతున్నారంటూ మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మరెడ్డి పత్రికా ప్రకటనలు చేస్తున్నారని, ప్రత్యర్థితో రాజకీయంగా పోటీపడాలే గాని తప్పుడు కేసులు బనాయించి జైలు పంపాలని చూడడం చేతకానితనం అని పేర్కొన్నారు. పోలీసుల వల్ల కాక చివరికి కోర్టులను ప్రభావితం చేసే స్థాయికి దిగజారారని విమర్శించారు. పిన్నెల్లి సోదరులకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డితో పాటు జిల్లాలోని ప్రతి కార్యకర్తా వెన్నంటి ఉంటారని తెలిపారు. వెల్దుర్తి మండలం గొల్లపాడులో నాలుగైదు నెలల క్రితం జరిగిన హత్య కేసులో చనిపోయిన వారు, చంపించిన వాళ్లు తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్లే అయినప్పటికీ ప్రత్యర్థి పార్టీలో ప్రధాన నాయకుడైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై తప్పుడు కేసు నమోదు చేయటం దుష్ట సంప్రదాయానికి దారి తీస్తుందని పేర్కొన్నారు. ఇందులో పాల్గొన్న వారిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. సుప్రీంకోర్టు తీర్పుకు విలువ ఇస్తామని, తప్పకుండా రామకృష్ణారెడ్డి హాజరవుతారని, న్యాయం కోసం తమ వంతు గట్టిగా పోరాడుతామని మహేష్ రెడ్డి తెలిపారు.
అభివృద్ధి చేసిన ఘనత వైఎస్సార్ సీపీదే !
మాచర్ల నుంచి శ్రీశైలం వరకు, మళ్లీ అక్కడ నుంచి బాచిపల్లి వరకు జాతీయ రహదారి సుమారు రూ.600 కోట్లతో అభివృద్ధి చేసిన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే దక్కిందని మహేష్‌రెడ్డి అన్నారు. అది కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి జరగడం గొప్ప విషయమని పేర్కొన్నారు. ఒరికెపూడిశెల ప్రాజెక్టును కావాల్సిన అన్ని అనుమతులు తీసుకొచ్చింది.. రూ.3000 కోట్లు బడ్జెట్ మంజూరు చేయించింది రామకృష్ణారెడ్డి కాదా ? అని ప్రశ్నించారు. జలజీవన్ మిషన్ ద్వారా రూ.150 కోట్లు ఖర్చు చేసి అభివృద్ధి చేశారని తెలిపారు. పల్నాడు అభివృద్ధిలో దూసుకుపోయిందని, ఇలా అభివృద్ధి చేయడమేనా? రామకృష్ణారెడ్డి చేసిన పాపం అని బ్రహ్మారెడ్డిని ప్రశ్నించారు. ఎన్నికలు నాలుగు నెలలు ఉందనంగా జంగమహేశ్వరంలో వైఎస్సార్ సీపీ నాయకుడిని, టీడీపీ నాయకులు చంపారని అంతమాత్రాన తాము శ్రీనివాసరావు మీద తప్పుడు కేసులు పెట్టలేదు కదా అని అన్నారు. ఎన్నికల ప్రచారంలో ఇటువంటి విషయాలను ఎప్పుడూ రాజకీయంగా ఉపయోగించుకోలేదని తెలిపారు. తాము ఎప్పటికీ ఇటువంటి చిల్లర రాజకీయాలు చేయమని స్పష్టం చేశారు. రామకృష్ణారెడ్డి నిర్దోషిగా బయటికి వస్తారని, జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాను రెపరెపలాడేందుకు తామంతా కష్టపడతామని కాసు మహేష్ రెడ్డి పేర్కొన్నారు.


