బాలోత్సవంలో సందడే.. సందడి
●ఆకట్టుకున్న దేశభక్తి, జానపద గీతాలు
●కోలాటంతో కదం తొక్కిన బాలలు
నరసరావుపేట: పల్నాడు బాలోత్సవం ఆకట్టుకుంది. చిన్నారులు సృజనాత్మకత, నైపుణ్యాలు వారిలో ప్రతిభను వెలుగులోకి తీసుకొచ్చాయి. పట్టణంలోని ఎస్‌ఎస్‌ఎన్ కళాశాలలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి మూడవ పిల్లల పండుగ సాంస్కృతిక కార్యక్రమాలు రెండో రోజు ఆదివారం రెట్టించిన ఉత్సాహంతో కొనసాగాయి. చిన్నారులు జానపద వేషధారణలతో మైమరిపించారు. కళాశాల ప్రాంగణం బాలల కేరింతలు, చిన్నారుల నవ్వులతో నిండిపోయింది. ముఖ్య అతిథులుగా ఎంఏఎం కళాశాలల చైర్మన్ మేదరమెట్ల రామశేషగిరిరావు, ఎస్‌ఎస్‌ఎన్ కళాశాల పాలకవర్గ అధ్యక్షులు కపలవాయి విజయకుమార్, లిఖిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత డాక్టర్ రామినేని వినోద్‌కుమార్‌రెడ్డి హాజరయ్యారు. చిన్నారుల ప్రదర్శనలు తిలకించి ఆనందం వ్యక్తం చేశారు. కోలాటం, లఘు నాటికలు, జానపద నృత్యం–గ్రూపు, పాటలు, స్పెల్ బీ, ప్రాజెక్ట్ పని, రంగ వల్లులు, బుర్రకథ, కథ చెప్పడం, తెలుగు పద్యాలు, అభినయ గేయాలు, దేశభక్తి గేయాలు, రైమ్స్, విచిత్ర వేషధారణ, మెమరీ టెస్ట్, బెస్ట్ ఫ్రమ్ వేస్ట్, వక్తృత్వం, మ్యాథ్స్ క్విజ్, మట్టితో బొమ్మలు తయారీ తదితర పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. నాటికలు, పాటలు, పద్యాలు, ఏక పాత్రాభినయాల్లోనూ ప్రతిభ కనబరిచారు.
నృత్య ప్రదర్శనల్లో బాలలు
బాలోత్సవంలో సందడే.. సందడి


