విద్యుత్ వైర్లు చోరీ చేసే ముఠాకు చెక్
ఇద్దరు నిందితుల అరెస్టు మరో ఇద్దరి కోసం గాలింపు
కంకిపాడు: ఖాళీగా ఉన్న వెంచర్లలో విద్యుత్ స్తంభాలకు ఉన్న అల్యూమినియం వైర్లను చోరీ చేసే ముఠాకు కంకిపాడు పోలీసులు చెక్ పెట్టారు. చోరీకి పాల్పడుతున్న ముఠా సభ్యుల్లో ఇద్దరిని అరెస్టు చేశారు. వారి వద్ద రూ.3 లక్షలు విలువైన వైర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు స్థానిక పోలీసుస్టేషన్‌లో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. సీఐ జె.మురళీకృష్ణ కథనం మేరకు.. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక గ్రామానికి చెందిన గరికే చందు ఇళ్ల వెంబడి ఉల్లిపాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తూ మద్యం, పేకాటకు బానిసయ్యాడు. తన గ్రామానికే చెందిన గరికే నాగరాజు, పాలపర్తి నాగరాజు, మంగళగిరి మండలం యర్రబాలెంనకు చెందిన పాత ఇనుప కొట్టు నిర్వాహకుడు కుంటిగుర్ల నరసింహరాజుతో కలిసి జల్సాలు తీర్చుకోవటానికి, డబ్బుకోసం విద్యుత్ వైర్లు చోరీని మార్గంగా ఎంచుకున్నారు. కంకిపాడు, జగన్నాధపురం, కొణతనపాడు, ప్రొద్దుటూరు, దావులూరు గ్రామాల్లోని రియల్ ఎస్టేట్ వెంచర్లలో స్తంభాలకు ఉన్న విద్యుత్ వైర్లను చోరీ చేస్తున్నారన్నారు. గరికే చందుపై గతంలో నాలుగు వైరు చోరీ కేసులు ఉన్నాయి. విద్యుత్ వైర్లు చోరీపై నమోదైన కేసులో భాగంగా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాలతో ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయి. ప్రొద్దుటూరు గాయత్రీ విహార్ వద్ద గరికే చందు, గరికే నాగరాజు, పాలపర్తి నాగరాజు, కుంటిగుర్ల నరసింహరాజు అల్యూమినియం రేకులు ఏరుతూ సంచుల్లో మూట గట్టడాన్ని పోలీసులు గుర్తించారు. గరికే చందు, కుంటిగుర్ల నరసింహరాజు పోలీసులకు చిక్కగా, మిగిలిన ఇద్దరు పరారయ్యారు. కంకిపాడు పరిసర గ్రామాల్లో అల్యూమినయం వైర్లు చోరీ చేస్తున్నట్లు అంగీకరించారు. వారి వద్ద రూ.3 లక్షలు విలువైన వైరును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి నిందితులు చందు, నరసింహరాజును అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. మిగిలిన ఇద్దరి కోసం గాలింపు చేపట్టామని సీఐ మురళీకృష్ణ తెలిపారు. కేసు విచారణలో ముఖ్యభూమిక వహించిన ఎస్‌ఐ డి.సందీప్, పీఎస్‌ఐ ఎస్.సురేష్, హెచ్‌సీ కె.చంద్రబాబు, పీసీలు పి.ఎస్.ఎన్.మూర్తి, సయ్యద్ బాజీబాబును ప్రత్యేకంగా అభినందించారు.


