డాక్టర్ జున్ను సాహెబ్‌కు డబుల్ ధమాకా
●కొండవీడు హైస్కూల్ టీచర్‌కు
రెండు అవార్డులు
●రెండురోజులు రెండు సంస్థల నుంచి అందుకున్న జాతీయ పురస్కారాలు
యడ్లపాడు: కొండవీడులోని జెడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయులు డాక్టర్ షేక్ జున్ను సాహెబ్‌కు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వేర్వేరు స్వచ్ఛంద సంస్థలు రెండు జాతీయస్థాయి పురస్కారాలను అందించాయి. విద్య, మానవ సేవ, పర్యావరణ పరిరక్షణ రంగాలలో చేసిన విశిష్ట సేవలకు ఈ ప్రతిష్టాత్మక జాతీయ పురస్కారాలు ఆమె అందుకున్నారు. ఇందులో విద్యార్థులకు వినూత్న బోధన, చేతిరాత నైపుణ్యాలు, గ్రీన్ వారియర్స్ పేరిటా అందించిన సేవలకు హైదరాబాద్ బిర్లా ప్లానిటోరియంలో శారదా ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో ‘జాతీయ ఉపాధ్యాయ ప్రేరణ అవార్డ్స్–2025’ శనివారం అందుకున్నారు. పేదలకు నిస్వార్థ సహాయం, విద్యార్థులకు కాలిగ్రఫీ ఉచిత శిక్షణ ఉద్యమం, జీవ వైవిధ్య అవగాహన రంగాలలో చేసిన విశేష కృషికి గ్లోబల్ హ్యూమన్ రైట్స్‌ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎఫ్‌టీసీసీఐలో ‘ఉత్తమ్ భారత్ పురస్కార్ 2025’ను ఆదివారం అందించింది. ఆయా కార్యక్రమాల్లో ముఖ్య అతిథులుగా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, తెలంగాణ ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్‌కుమార్, ఎంపీ మల్లు రవి, బయో డైవర్సిటీ అంబాసిడర్ సుష్మ పుప్పొడి, శారద సంస్థ వ్యవస్థాపకులు కమల మనోహర్, జీహెచ్‌ఆర్టీ వ్యవస్థాపకులు షేక్ రెహమాన్ చేతుల మీదుగా వీటిని అందుకున్నారు. అతిథులు జున్నుసాహెబ్ నిబద్ధత, సేవా నిరతికి నిదర్శనమని కొనియాడారు. అవార్డు గ్రహీత జున్నుసాహెబ్ మాట్లాడుతూ ఈ పురస్కారాలతో బాధ్యత మరింత పెరిగిందని, తన సంకల్పాన్ని మరింత విస్తరింపజేస్తానని చెప్పారు. పలువురు విద్యవేత్తలు, ప్రముఖులు, సహోపాధ్యాయులు జున్ను మాస్టారుకు అభినందనలు తెలిపారు.
డాక్టర్ జున్ను సాహెబ్‌కు డబుల్ ధమాకా


