దయచేసి ధాన్యం కొనండి !
రైతుల వేడుకోలు
కారెంపూడి: మండలంలో వరి నూర్పిళ్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. అయితే, పంట చేతికొచ్చినా రైతుల మొహంలో నవ్వులేదు. ధాన్యం కొనే దిక్కు లేదు. బీపీటీ, కేఎన్‌ఎం రకాలను వ్యాపారులు అసలు అడగడం లేదు. ఒక వేళ అడిగినా రూ.1,200లోపు 75 కేజీల బస్తా అడుగుతున్నారు. నిల్వ చేసుకునే అవకాశం, ఆర్థిక వెసులుబాటు లేని రైతులు ఆ ధరకే తెగనమ్ముతున్నారు. ఇంత తక్కువ రేటుకు అమ్మితే మిగులు ఉండదని దిగులు చెందుతున్నారు. ఎకరానికి సగటు దిగుబడి 35 బస్తాలు వస్తున్నాయి. ఎరువుల కొట్లలో బాకీలుంటే మాత్రం వారు ఏదో ఒక రేటుకు కొంటున్నారు. కాని మిగిలిన రైతులు వ్యాపారులను బతిమిలాడుకుని అమ్ముకుంటున్న పరిస్ధితులు కూడా తలెత్తుతున్నాయి.
దిగుబడి ఉన్నా ధర లేదు
మండలంలో 18 వేల ఎకరాలలో ఖరీఫ్‌లో వరి సాగైంది. ప్రస్తుతం మండలంలో సగం దాకా వరి నూర్పిళ్లు పూర్తయ్యాయి. అయినా కూడా ధర మాత్రం పెరగడం లేదు. చిట్టిపొట్టి రకం ధాన్యం మాత్రం బస్తా రూ.1,650 దాకా పలుకుతోంది. ఆరబెట్టకుండా ఉన్న బస్తా కనీసం రూ.1,500 లేకపోతే గిట్టుబాటు కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ ధర అయినా కల్పించాలని వేడుకుంటున్నారు. ఇంత వరకు ఇలాంటి పరిస్థితిని తాము గతంలో చూడలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. కనీసం బాధను బయటకు చెప్పడానికి కూడా భయపడుతున్న పరిస్ధితి కన్పిస్తోంది. శనివారం సాయంత్రం ఎన్‌ఎస్‌పీ కాలనీ గురుకుల పాఠశాల వద్ద ఒక చిన్నకారు రైతు బస్తా రూ. 1,300కు అమ్మానని వాపోయాడు. ఎకరాకు 35 బస్తాలయ్యాయని ఈ రేటుకు రెక్కల కష్టం కూడా మిగలదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇలాగైతే వ్యవసాయం చేయడం కంటే కూలికి పోవడం మేలని సాటి రైతుకు చెప్పి వాపోయాడు. ఇలా ఎంతో మంది బాధపడుతున్నారు. గ్రామాల్లో ధాన్యం రాసుల కళకళలతో ఆనందంగా ఉండాల్సిన రైతులు ధాన్యం కొనే దిక్కు లేరని బాధపడుతున్న పరిస్థితి కన్పిస్తోంది. మద్దతు ధర కోసం రైతులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.


